స్కూల్‌ బస్సును ఢీకొట్టిన కారు..బస్సు బోల్తా..బస్సులో 30 మంది విద్యార్థులు

నవతెలంగాణ-హైదరాబాద్ : హనుమకొండ జిల్లా కమలాపూర్‌లో పెను ప్రమాదం తప్పింది. మండల కేంద్రంలో యూ టర్న్‌ తీసుకుంటున్న స్కూల్‌ బస్సును కారు ఢీకొట్టింది. దీంతో బస్సు బోల్తాపడిపోయింది. ఈ ప్రమాదంలో ముగ్గురు విద్యార్థులు సహా ఆరుగురు గాయపడ్డారు. గురువారం సాయంత్రం ఏకశిలా పాఠశాలకు చెందిన స్కూలు బస్సు విద్యార్థులను దించడానికి వెళ్తున్నది. ఈ క్రమంలో కమలాపూర్‌ మండల కేంద్రంలో ప్రధాన రహదారిపై యూటర్న్‌ తీసుకుంటున్నది. అదే సమయంలో వెనుకనుంచి వేగంగా దూసుకొచ్చిన కారు దానిని బలంగా ఢీకొట్టింది. దీంతో అదుపుతప్పిన బస్సు బోల్తా పడిపోయింది. ప్రమాద సమయంలో అక్కడే ఉన్న ఓ వ్యక్తి వెంటనే బస్సు ముందు వైపు ఉన్న అద్దాలు పగలగొట్టడానికి ప్రయత్నించాడు. ఇంతలో బస్సు కిటికీల్లోంచి దూకిన ఇద్దరు విద్యార్థులు అతనికి సహాయం చేయడంతో అద్దం వచ్చేసింది. దీంతో అందులో విద్యార్థులు ఒక్కొక్కరికిగా బయటకు వచ్చేశారు. ముగ్గురు విద్యార్థులు స్వల్ప గాయాలవగా, మిగిలినవారంతా క్షేమంగా బయట్టపడ్డారు. కాగా, కారులో ప్రయాణిస్తున్న ముగ్గురికి తీవ్రంగా గాయాలయ్యాయి. ప్రమాద సమయంలో బస్సులో 30 మంది విద్యార్థులు ఉన్నారు. ఇదంతా అక్కడ ఓ షాప్‌లో ఉన్న సీసీటీవీ కెమెరాలో రికార్డయింది. ప్రస్తుతం ఇది సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నది.

Spread the love