31లోగా స్కూల్‌ గ్రాంట్లను విడుదల చేయాలి

–  మంత్రి సబితకు టీఎస్‌జీహెచ్‌ఎంఏ వినతి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగింపు ఈనెల 31వ తేదీలోగా స్కూల్‌ కాంప్లెక్స్‌, ఎమ్మార్సీ గ్రాంట్లకు సంబంధించి మిగిలిన 50 శాతం నిధులను వెంటనే విడుదల చేయాలని తెలంగాణ రాష్ట్ర గెజిటెడ్‌ హెడ్మాస్టర్ల సంఘం (టీఎస్‌జీహెచ్‌ఎంఏ) రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేసింది. ఈ మేరకు విద్యాశాఖ మంత్రి పి సబితా ఇంద్రారెడ్డిని శనివారం హైదరాబాద్‌లో ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు రాజభాను చంద్రప్రకాశ్‌, ప్రధాన కార్యదర్శి ఆర్‌ రాజగంగారెడ్డి నేతృత్వంలో కలిసి వినతిపత్రం సమర్పించారు. పాఠశాల విద్యార్థుల యూనిఫారాల కుట్టు చార్జీలను విడుదల చేయాలని కోరారు. డీసీఈబీలకు గత విద్యాసంవత్సరంలోని ఎస్‌ఏ-1, 2 పరీక్ష పత్రాలు, ప్రస్తుత విద్యాసంవత్సరంలోని ఎస్‌ఏ-1, 2 పరీక్ష పత్రాల ముద్రణా ఖర్చులను విడుదల చేయాలని తెలిపారు. పాఠ్యపుస్తకాల సరఫరాకు సంబంధించిన ఖర్చులను ఎంఈవో, డీఈవోలకు చెల్లించాలని పేర్కొన్నారు. గత విద్యాసంవత్సరంలో పదో తరగతి స్పాట్‌ వాల్యుయేషన్‌ బకాయిలను విడుదల చేయాలని తెలిపారు. జెడ్పీహెచ్‌ఎస్‌ అగ్గనూరు ప్రధానోపాధ్యాయుల సస్పెన్షన్‌ ఎత్తేయాలని కోరారు. వజ్రోత్సవాల ఖర్చులకు సంబంధించిన నిధులనూ విడుదల చేయలేదని వివరించారు.

Spread the love