గుజరాత్‌లో 41 వేల మంది మహిళల అదృశ్యం

– మోడీ,అమిత్‌ షా సొంత రాష్ట్రంలో అంతుచిక్కని మిస్టరీ
దేశానికే ఆదర్శం గుజరాత్‌. ఆ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి చూసి నేర్చుకొమ్మని ప్రధాని మోడీ, హౌంమంత్రి అమిత్‌షా గొప్పగా చెబుతుంటారు. కానీ గుజరాత్‌లో పేదలకు, మహిళలకు ఎలాంటి భద్రత, రక్షణ లేదని జాతీయ నేర రికార్డుల బ్యూరో (ఎన్‌సీఆర్‌బీ) నివేదిక చెబుతోంది. కేరళ ఫైల్స్‌ పేరిట తీసిన సినిమాలో 32 వేల మంది మహిళల్ని సిరియాకు తీసుకెళ్లినట్టు అబద్ధపు ప్రచారాన్ని బీజేపీ ఎన్నికల అస్త్రంగా వాడుకుంటుంటే.. కేంద్ర ప్రభుత్వ సంస్థ విడుదల చేసిన రిపోర్టులో 41 వేల మంది మహిళలు గాయబ్‌ అయినా..కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఏ మాత్రం పట్టించుకోవటంలేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
అహ్మదాబాద్‌ : ఐదేండ్ల కాలంలో గుజరాత్‌లో 41 వేల మందికి పైగా మహిళలు అదృశ్యమయ్యారు. జాతీయ నేర రికార్డుల బ్యూరో (ఎన్‌సీఆర్‌బీ) అందించిన వివరాల ప్రకారం 2016లో 7,105, 2017లో 7,712, 2018లో 9,246, 2019లో 9,268, 2020లో 8.290 మంది మహిళల ఆచూకీ తెలీకుండా పోయింది. దీంతో ఐదేండ్లలో అదృశ్యమైన మహిళల సంఖ్య 41,621కి చేరింది. రాష్ట్ర ప్రభుత్వం 2021లో అసెంబ్లీలో చేసిన ప్రకటన ప్రకారం 2019-2020లో అహ్మదాబాద్‌, వడోదరలోనే 4,722 మంది మహిళలు కన్పించకుండా పోయారు. రాష్ట్రానికి చెందిన బాలికలు, మహిళలను తరచుగా ఇతర రాష్ట్రాలకు పంపి వ్యభిచారంలోకి దింపుతున్నారని గుజరాత్‌ మానవ హక్కుల కమిషన్‌ సభ్యుడు సుధీర్‌ సిన్హా చెప్పారు. మిస్సింగ్‌ కేసులు హత్య కేసుల కంటే తీవ్రమైనవని ఆయన తెలిపారు. పోలీసులు ఈ కేసుల విచారణను నిర్లక్ష్యం చేస్తున్నారని విమర్శించారు. బాలికలు అదృశ్యం కావడానికి మానవ అక్రమ రవాణాయే కారణమని రాష్ట్ర మాజీ అదనపు డీజీపీ డాక్టర్‌ రాజన్‌ ప్రియదర్శి తెలిపారు. మహిళల అదృశ్యంపై గుజరాత్‌ కాంగ్రెస్‌ ప్రతినిధి హిరేన్‌ బంకర్‌ మాట్లాడు తూ ‘కేరళ మహిళల గురించి బీజేపీ నేతలు మాట్లాడుతుంటారు. కానీ గుజరాత్‌లో 40 వేల మందికి పైగా కన్పించకుండా పోతే పెదవి విప్పరు. పైగా ఇది దేశ ప్రధాని, హోం మంత్రి సొంత రాష్ట్రం’ అని ఎద్దేవా చేశారు.

Spread the love