పేదలందరికీ ఇండ్లస్థలాలివ్వాలి

– సొంత జాగాలో ఇల్లు కట్టుకునేందుకు డబ్బులివ్వాలి
– మన ఊరు – మనబడి పనులను పూర్తి చేయాలి
– పీహెచ్‌సీలను పటిష్టపరచాలి
– సేద్యం చేయని భూములకు రైతుబంధు ఇవ్వొద్దు : ఎమ్మెల్సీ నర్సిరెడ్డి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
రాష్ట్రంలోని పేదలందరికీ ఇండ్లు, ఇండ్లస్థలాలివ్వాలని ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. సొంత జాగా ఉన్న వారు ఇల్లు కట్టుకునేందుకు డబ్బులు చెల్లించాలని డిమాండ్‌ చేశారు. శనివారం శాసనమండలిలో గవర్నర్‌ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ఆయన మాట్లాడుతూ ఉపాధ్యాయ బదిలీలు, పదోన్నతులను చేపడుతున్న ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. భాషాపండితులు, పీఈటీలకు పదోన్నతులివ్వాలనీ, తద్వారా ఆ సమస్యకు ముగింపు పలకాలని సూచించారు. మోడల్‌ స్కూళ్లు, గురుకులాల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు బదిలీలు, పదోన్నతులు కల్పించాలని కోరారు. కేజీబీవీ సిబ్బందికి స్థానచలనం కల్పించే అంశాన్ని పరిశీలించాలని చెప్పారు. మల్లిఖార్జున్‌ అనే టీచర్‌పై మతోన్మాద మూకలు దాడిచేయడాన్ని ఖండించారు. వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఉపాధ్యాయులు తరగతి గదుల్లో స్వేచ్ఛగా బోధించే వాతావరణం కల్పించాలని కోరారు. 317 జీవో బాధితులకు న్యాయం చేయాలన్నారు. స్కూల్‌ అసిస్టెంట్‌ భార్యాభర్తలను ఒకే జిల్లాకు పంపారని చెప్పారు. అదే విధంగా ఎస్జీటీలనూ బదిలీ చేయాలని సూచించారు. దేశంలో, రాష్ట్రంలో సంపద ఒకేచోట కేంద్రీకృతమవుతున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులకు కనీస వేతనం రూ.25 వేలు చెల్లించాలని డిమాండ్‌ చేశారు. కేజీబీవీల్లో టీచర్లకు రూ.26 వేలు చెల్లిస్తున్నారనీ, అదే పనిచేస్తున్న రెగ్యులర్‌ ఉపాధ్యాయులకు మాత్రం రూ.80 వేలకుపైగా వేతనం వస్తున్నదని వివరించారు. అందువల్ల కేజీబీవీ టీచర్లకు మినిమం బేసిక్‌ పే చెల్లించాలని కోరారు. కొత్త పరిశ్రమలొస్తున్నాయనీ, వాటి ద్వారా పెట్టుబడులు కూడా వస్తున్నాయంటూ ఆ శాఖ మంత్రి ప్రకటిస్తున్నారనీ, అదేతరహాలో కార్మికులకు కనీస వేతనాలు అమలు చేయడంపై సంబంధిత శాఖ మంత్రి దృష్టి పెట్టాలని సూచించారు. రాష్ట్రంలో 76 షెడ్యూల్‌ పరిశ్రమల్లో కనీస వేతనాల జీవోను విడుదల చేయాలని చెప్పారు. ఐదు పరిశ్రమలకు సంబంధించిన జీవో జారీ చేసినా గెజిట్‌ కానందున అమలు కావడం లేదన్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల (పీహెచ్‌సీ)ను అభివృద్ధి చేస్తేనే పేద ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందుతాయని వివరించారు. బస్తీ దవాఖానాలు అభినందనీయమేనని అన్నారు. ముగ్గురు డాక్టర్లు, ఆరుగురు నర్సులతో 24 గంటలూ పనిచేసేలా పీహెచ్‌సీలు, యూపీహెచ్‌సీలను పటిష్టపర్చాలని సూచించారు. కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్‌ చేయాలన్నారు. శ్రీశైలం సొరంగమార్గం పనులను పూర్తి చేయాలని కోరారు. గురుకులాలు, కేజీబీవీల్లో కేర్‌టేకర్లను నియమించాలని కోరారు. సేద్యం చేయని భూములకు రైతుబంధు ఇవ్వొద్దని అన్నారు. కౌలురైతులకు ఆ పథకాన్ని వర్తింపచేయాలని సూచించారు. మన ఊరు మనబడి పథకం ద్వారా మొదటి విడతలో 9,123 బడులను రూ.3,497 కోట్లతో అభివృద్ధి చేయనున్నట్టు ప్రభుత్వం ప్రకటించిందన్నారు. ఇప్పటి వరకు 1,210 స్కూళ్ల పనులే పూర్తయ్యాయని వివరించారు. మిగతా బడుల్లో పనులను పూర్తి చేయాలని డిమాండ్‌ చేశారు. ప్రయివేటు విద్యాసంస్థల్లోని ఉపాధ్యాయుల సంక్షేమం కోసం చర్యలు చేపట్టాలని సూచించారు. కొత్త బస్తీలు, కాలనీల్లో సర్కారు బడులు, కాలేజీలను ప్రారంభించాలని కోరారు.
మానవాభివృద్ధిలో కేరళ నెంబర్‌వన్‌
మానవాభివృద్ధి సూచికల్లో కేరళ నెంబర్‌వన్‌ స్థానంలో ఉందని నర్సిరెడ్డి ఈ సందర్భంగా చెప్పారు. ఆ సూచికల్లో తెలంగాణ ఏ స్థానంలో ఉందో చెప్పాలని మంత్రి కేటీఆర్‌ను కోరారు. అక్కడ గ్రామీణ కార్మికుల రోజు వేతనం రూ.800గా ఉందన్నారు. ఇక్కడ రూ.400, రూ.500, రూ.600 మాత్రమే కూలి వస్తున్నదని అన్నారు. అక్షరాస్యతలో ఆ రాష్ట్రం అగ్రగామిగా ఉందన్నారు. ప్రయివేటు విద్యాసంస్థల్లో దేశంలోనే తెలంగాణ రెండోస్థానంలో ఉందని వివరించారు.
కమ్యూనిస్టు ప్రభుత్వం ఏమీ చేయలేదని చెప్పడం లేదు : కేటీఆర్‌
నర్సిరెడ్డి లేవనెత్తిన అంశంపై మంత్రి కేటీఆర్‌ స్పందిస్తూ కేరళలో కమ్యూనిస్టు ప్రభుత్వం అభివృద్ధి ఏమీ చేయలేదంటూ తాను చెప్పడం లేదని మంత్రి కేటీఆర్‌ అన్నారు. విద్యారంగంలో మార్పునకు నాంది ప్రారంభమైందని చెప్పారు. మన ఊరు మనబడి పథకం ద్వారా 680 పాఠశాలల్లో పనులు పూర్తిచేసి ప్రారంభించామన్నారు. రూ.7,300 కోట్లతో 26,085 సర్కారు బడుల్లో మౌలిక వసతులను కల్పిస్తున్నామని అన్నారు. మానవాభివృద్ధిలో తెలంగాణ టాప్‌లోనే ఉంటుందన్నారు. అనంతరం గవర్నర్‌ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానాన్ని శాసనమండలి ఆమోదించినట్టు చైర్మెన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి ప్రకటించారు. సభను సోమవారం ఉదయం 10.30 గంటలకు వాయిదా వేస్తున్నామని చెప్పారు.

Spread the love