గురుకుల అధ్యాపకులపై మానసిక ఒత్తిడి

– ఆగస్టు 5న చలో హైదరాబాద్‌ మహాధర్నా
– ఎమ్మెల్సీ నర్సిరెడ్డి, టీఎస్‌ యూటీఎఫ్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చావ రవి
– విజయాల వెనుక ఉపాధ్యాయుల శ్రమ
– అయినా కష్టానికి తగిన ఫలితం అందడం లేదు
– వారి సమస్యలను తక్షణం పరిష్కరించాలి
– అన్ని గురుకులాల్లో ఒకే బోధన సమయం ఉండాలి
– రాష్ట్ర వ్యాప్తంగా నిరసన దీక్షలు, ధర్నా
నవతెలంగాణ- విలేకరులు
”గురుకుల విద్యా సంస్థల ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించాలి.. సరిపడా ఉపాధ్యాయుల సంఖ్య లేక ఉన్న వారిపై అదనపు బాధ్యతలతో మానసిక ఒత్తిడికి గురవుతున్నారు.. అన్ని గురుకులాల్లో బోధన సమయం ఒకే విధంగా ఉండాలి.. నాణ్యమైన విద్యతో గురుకులాలు సాధిస్తున్న విజయాల వెనుక టీచర్ల శ్రమ ఉంది. కానీ.. తగిన ఫలితం వారికి అందడం లేదు.. ప్రతి గురుకులంలోనూ ఇద్దరు కేర్‌ టేకర్లను నియమించాలి..” అని ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి, టీఎస్‌ యూటీఎఫ్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చావ రవి ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. గురుకుల ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసం టీఎస్‌ యూటీఎఫ్‌ రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్న మూడు దశల పోరాట కార్యక్రమాల్లో భాగంగా సోమవారం నిరసన దీక్షలు చేపట్టారు.
నల్లగొండ జిల్లా కేంద్రంలోని క్లాక్‌టవర్‌ సెంటర్‌ వద్ద టీఎస్‌ యూటీఎఫ్‌ జిల్లా గురుకులాల ఉపాధ్యాయుల జిల్లా కన్వీనర్‌ జి.రాంబాబు అధ్యక్షతన చేపట్టిన దీక్షకు ఎమ్మెల్సీ నర్సిరెడ్డి సంఘీభావం తెలిపి మాట్లాడారు. రాష్ట్రంలో గురుకుల విద్యాసంస్థలు నాణ్యమైన విద్యకు నమూనాగా ఉన్నాయని, ఈ విజయాల వెనుక ఉపాధ్యాయుల శ్రమ, అంకితభావం ఎంతో ఉందని తెలిపారు. కానీ, వారి శ్రమకు తగిన వేతనం, గుర్తింపు లభించడం లేదన్నారు. ఉపాధ్యాయులు శారీరక శ్రమతో పాటు తీవ్రమైన మానసిక ఒత్తిడికి గురవుతున్నారని చెప్పారు. గురుకులాల అన్ని సొసైటీలలో ఏకరూప పరిపాలన అమలు చేయాలని, బోధన సమయాన్ని ఒకే విధంగా ఉండేలా మార్చాలని అన్నారు. అన్ని గురుకులాల్లో బదిలీలు- ఉద్యోగోన్నతులు వెంటనే చేపట్టాలని కోరారు. కేర్‌ టేకర్‌, డిప్యూటీ వార్డెన్‌లను ప్రత్యేకంగా నియమించి ఉపాధ్యాయులకు నైట్‌ డ్యూటీల నుంచి మినహాయింపు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. కాంట్రాక్టు, గెస్ట్‌, పార్ట్‌ టైం, ఔట్‌సోర్సింగ్‌ ఉపాధ్యాయులకు బేసిక్‌ పే, 12 నెలల వేతనం కల్పించాలని, సీఆర్టీల సర్వీస్‌ రెగ్యులర్‌ చేయాలని, అన్ని గురుకుల విద్యాలయాలకు శాశ్వత భవనాలు, స్టాఫ్‌ క్వార్టర్స్‌ నిర్మించాలని ప్రభుత్వాన్ని కోరారు. టీఎస్‌ యూటీఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శులు ఎం.రాజశేఖర్‌రెడ్డి, జి.నాగమణి పాల్గొన్నారు.
గురుకుల ఉపాధ్యాయుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని టీఎస్‌ యూటీఎఫ్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చావ రవి ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. మహబూబాబాద్‌ జిల్లా కేంద్రంలోని అమరవీరుల స్థూపం వద్ద, హనుమకొండ ఏకశిలపార్కు వద్ద నిరసన దీక్ష, జనగామ జిల్లా కలెక్టరేట్‌ వద్ద ధర్నా, నిరసన దీక్ష చేపట్టారు. ఆయా కార్యక్రమాల్లో చావ రవి మాట్లాడుతూ.. గురుకుల విద్యా సంస్థలకు శాశ్వత భవనాలు నిర్మించాలని కోరారు. విద్యార్థులకు సరిపడా ఉపాధ్యాయులను నియమించకపోవడంతో ఉన్న ఉపాధ్యాయులపై భారం పడుతున్నదన్నారు. రాష్ట్రంలోని అన్ని రకాల గురుకులాల సొసైటీలను ఒకే గొడుగు కిందకు తీసుకొచ్చి ఏకరూప పరిపాలనా అమలు చేయాలని కోరారు. లేదంటే ఆగస్టు 5న చలో హైదరాబాద్‌ మహాధర్నా నిర్వహిస్తామని హెచ్చరించారు. రాష్ట్ర కార్యదర్శులు ఎస్‌ మల్లారెడ్డి, సోమశేఖర్‌ మాట్లాడుతూ.. 2007లో రెగ్యులరైజ్‌ అయిన ఉపాధ్యాయులకు నోషనల్‌ సర్వీసు, పాత పెన్షన్‌ విధానం వర్తింపజేయాలని డిమాండ్‌ చేశారు.
నిజామాబాద్‌ జిల్లా కేంద్రంలోని ధర్నాచౌక్‌లో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా టీఎస్‌ యూటీఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి డి.సత్యానంద్‌ మాట్లాడుతూ.. ఉపాధ్యాయులను తగినంత మందిని నియమించకపోవడంతో ఉన్నవారిపై భారం పడుతున్నదని ఆవేదన వ్యక్తం చేశారు.ఆదిలాబాద్‌, ఆసిఫాబాద్‌, మంచిర్యాల, నిర్మల్‌ జిల్లా కేంద్రాల్లో కలెక్టరేట్ల ఎదుట ధర్నాలు నిర్వహించారు. కాగజ్‌నగర్‌లో ఎమ్మెల్సీ దండె విఠల్‌కు వినతిపత్రం ఇచ్చారు. ఆదిలాబాద్‌ జిల్లా కలెక్టరేట్‌ ఎదుట ధర్నాలో టీఎస్‌యూటీఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి ఏ.వెంకట్‌ పాల్గొన్నారు.
రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలోని అంబేద్కర్‌ చౌరస్తాలో నిరసన దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా గురుకుల ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యలను తక్షణం పరిష్కరించాలని టీఎస్‌యూటీఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి ఏర్పుల గాలయ్య డిమాండ్‌ చేశారు. తమ సమస్యలను గొంతెత్తి బయటకి చెప్పడానికి కూడా స్వేచ్ఛ లేని పరిస్థితులు గురుకుల సొసైటీలో ఉన్నాయన్నారు.మహబూబ్‌నగర్‌ జిల్లా కేంద్రంలో టీటీడీ కళ్యాణమండపం వద్ద నిరసన దీక్ష నిర్వహించారు. వనపర్తి పట్టణంలోని పాత కలెక్టర్‌ కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు. నాగర్‌కర్నూల్‌ జిల్లా కేంద్రంలో గాంధీపార్కులో, నారాయణపేట జిల్లా కేంద్రంలో మున్సిపల్‌ పార్క్‌ ఎదుట దీక్ష చేశారు.

Spread the love