అదే పెద్ద మీటింగ్ హాలు. పువ్వు గుర్తు పార్టీ లీడర్లు అంతా ఒక్కొక్కరూ వస్తున్నారు. కొందరి మొహాలు కళ తప్పి ఉన్నాయి. మరి కొందరి మొహాలు కోపంతో ఉన్నాయి. ఇంకొందరు పగతో రగిలిపోతున్నారు. అందరూ వచ్చాక సమావేశం ప్రారంభమైంది.
”లాభం లేదు, ఇప్పటికైనా అతన్ని ఆపాలి!” అన్నాడు ఒక లీడరు.
”అతని నోరు మూయించకపోతే మనం దొంగలమేనని అందరికీ తెలిసిపోతుంది!” అన్నాడు ఇంకో లీడరు.
”అతడు, అతని తల్లి, తండ్రీ, తాత, నాయనమ్మ, ముత్తాత అందరూ దొంగలేనని మన వాట్సప్ గ్రూపుల్లో ప్రచారం బాగా చేయించాలి. అవసరమైతే వాళ్ల నాయనమ్మ, వాళ్ల ముత్తాత దొంగతనం చేసినందుకు జైల్లో వేసినట్లు ఫొటోలు తయారు చేసి, గ్రూపుల్లో, ఫేసుబుక్కుల్లో పెట్టాలి.” అన్నాడు మరో లీడరు.
”ఇతర పార్టీలు గెలిచినచోట్లలో ఆ పార్టీలు ఓట్ల దొంగతనం చేసినట్లు రివర్స్ ప్రచారం చేయాలి” మరో లీడరు సలహా.
”లక్షల సంఖ్యలో ఓట్ల దొంగతనం జరుగుతుంటే, మీ పార్టీ కార్యకర్తలు, లీడరు ఎందుకు ప్రశ్నించ లేదని నిలదీయాలి! మీరు ప్రశ్నించ లేదంటే, ఓట్‌చోరీ మీకు ఇష్టమేనని, ఇష్టమైన ఓట్‌చోరీ చేసినందుకు అభినం దించాలని, మనమే అడగాలని నేను డిమాండ్ చేస్తున్నాను” అంటూ బల్లగుద్దాడు ఒక సంఘీయుడు. అతని రివర్స్ లాజిక్ అందరికీ నచ్చి చప్పట్లు కొట్టి మరీ అభినందించారు.
అంతలోనే అందరూ ఒక విషయాన్ని గుర్తించారు. మొట్టమొదటిసారిగా తమ నాయకుడిని కీర్తించటం కాకుండా ఎదుటి పార్టీ లీడర్ గూర్చి తమ అంతరంగిక సమావేశంలో చర్చించటం జరుగుతున్నది! ఎంత ఘోరం! పెద్దాయనకు ఇది తెలిస్తే ఇంకేమైనా ఉందా? అని ఎవరికి వారు భయపడ్డారు. తాము ఇంత ఆత్మరక్షణలో పడి పోవటానికి కారణం ఎవరు? అని ఆలోచించగా ఒక లీడర్‌కి లైటు వెలిగింది! ఆయనే ఇంటి మంత్రి! (అదే హోం మినిస్టర్) వెంటనే ఫోన్ కలిపాడు.
”ఏమయ్యా కమీషనర్, పేరులోనే జ్ఞానం ఉంటే సరిపోతుందా? చేసే పనుల్లో జ్ఞానం ఉండక్కర్లేదా? ఆ బ్రెజిల్ పిల్లను ఎక్కడినుండి తెచ్చావయ్యా! 220 చోట్ల ఆ పిల్ల పేరు ఎక్కించావట, అన్నింటిలో ఒకే రకమైన పోటీ ఎందుకు పెట్టావు?” అంటూ గరుమన్నాడు.
అవతల ఏదో గొణిగాడు
”ఏం గొణుక్కుంటున్నావో ఏమిటో, అబద్దాలు చెబుతున్నాడని ముందు ఆ ‘పప్పు’ను ఏదో కేసు బనాయించి లోపల తోరు! ఏంటి వీలుకాదా? ఎందుకు కాదు? అంతా చట్ట ప్రకారం అయితే నీవు కమీషనరు అయ్యేవాడివేనా? నీకోసం చట్టాన్నే మార్చి, నిబంధనలు మార్చి నిన్ను కమీషనర్‌ను చేస్తిమి గదా! చేసేపని గుట్టుచప్పుడు కాకుండా చేయటం చేతకాదా?’ అంటూండగానే అవతల ఫోన్ కట్ అయ్యింది. దాంతో ఆ లీడర్ జుట్టు పీక్కోబోయాడు! కాని నెత్తిమీద జట్టు లేదు! దాంతో షర్డు చింపుకున్నాడు.
మొన్న కర్నాటక, నిన్న మహారాష్ట్ర, ఈ రోజు హర్యానా, రేపు ఏ రాష్ట్రం, ఏ నియోజక వర్గం పేరు బయటకు వస్తుందో తెలియటం లేదు !
”సార్ మనం బీహారులో 169 సీట్లలో గెలుస్తామని ఒక ప్రకటన చేద్దాం!’ అప్పుడు చర్చ దారి మళ్లీ అన్ని సీట్లు కావు, ఇన్నే సీట్లు అంటూ టీవీల్లో చర్చ జరుగుతుంది! దాంతో ఓట్ చోరే అంశం పక్కకు పోతుంది !” అన్నాడు ఒక లీడర్. తన సలహాకు కచ్చితంగా అభినందనలు వస్తాయని ఆశగా చూశాడు.
ఇంటి మంత్రికి కోపం మరింత పెరిగింది! సలహా ఇచ్చిన లీడర్‌ను కొట్టినంత పనిచేశాడు!
”బేవకూఫ్! ఇప్పుడున్న స్థితిలో అట్లా చెపితే ఆ 169 చోట్ల ఓట్ల దొంగతనం చేశామని మనమే చెప్పినట్లు అవుతుంది! గెలిస్తేనెమో ఓట్‌చోరీ జరిగిందని అందుకే గెలిచామని అంటారు. ఓడిపోతే ఓట్‌చోరీ చెయ్యలేదు కాబట్టి మనం ఓడిపోయామని అనుకుంటారు! ముందు నుయ్యి! వెనక గొయ్యి! అంటూ తల పట్టుకున్నాడు ఇంటి మంత్రి.
ఇంటి మంత్రిని చూసి ఛోటా మోటా లీడర్లు కూడా ఎవరి తలలు వారు పట్టుకున్నారు. ఆయన చెప్పింది కూడా నిజమే! ఓట్ చోరీ జరగలేదంటే ప్రజలు నమ్మే పరిస్థితి లేదు!
”సార్! లారెస్సాతో ఒక వీడియో చేయిద్దాం! తనది బ్రెజిల్ కాదని, భారతదేశ నివాసియేనని, స్వీటీ, సీమా, సరస్వతి, రష్మీ, వాళ్లంతా తన స్నేహితులేనని, ఇంకా క్లాస్‌మేట్లేనని, తమకు ఆధార్ కార్డులు కూడా ఉన్నాయని, తమ ఆధార్ కార్డులు రాహుల్‌గాంధే కొట్టేశాడని చెప్పిద్దాం!” అని సలహా ఇచ్చి దూరంగా జరిగాడు మరో లీడర్.
టేబుల్ మీదున్న పేపర్ వెయిట్ తీసి ఆ లీడర్ కేసి విసిరికొట్టాడు ఇంటి మంత్రి!
”అరెఁ హవులే! ఆ లారెస్సా ఇప్పటికే ఒక వీడియో చేసి పెట్టింది! ఇక ఇండియాకు వస్తే ఇంకెమన్న ఉందా!” అంటూ ఎగిరి పడ్డారు.
ఇంతలో డోర్ చప్పుడయ్యింది! ఒకరు వెళ్లి డోర్ తీశాడు. ఒక యువతి క్యాటావాక్ చేసుకుంటూ లోపలికి వచ్చింది! ఆమెతో పాటు రెండు పెద్ద సూట్ కేసులు కూడా తీసుకుని ఆమె సెక్రటరీ వచ్చాడు.
అక్కడున్న లీడర్లందరికీ, ఆమెను ఎప్పుడో, ఎక్కడో చూసినట్లు అన్పించింది! అందరికీ ఒకేసారి ఆమె ఎవరో గుర్తొచ్చింది!
”లారెస్సా! బ్రెజిల్” అంటూ అరిచారు అందరూ ఒకేసారి.
లారెస్సా ముందుకు వచ్చి, చొరవగా మైకు తీసుకుని ఏదో మాట్లాడింది! ఏమి మాట్లాడిందో ఎవరికీ అర్ధం కాలేదు! అంతా వెర్రిమొగాలు వేసుకున్నారు! అది చూసి ఆమె సెక్రటరీ మైకు తీసుకున్నాడు.
”తాను అడక్కుండానే ఇండియాలో ఓటు హక్కు ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు! ఎప్పుడూ మీరంతా రాహింగ్యాల గురించీ, వారంతా ఆక్రమంగా ఇండియాలో ఉంటున్నారని, ప్రతి ఎలక్షన్‌లలో అంటూ ఉంటారని, కాని ఇంతవరకు ఒక్క రోహింగ్యాను కూడా బయట పెట్టలేదని, ఎక్కడో బ్రెజిల్‌లో ఉన్న తనకు మాత్రం, 223 చోట్ల ఓటు హక్కు కల్పించినందుకు, మీ పార్టీకే, మీ పార్టీ ఎన్నికల కమీషనర్‌కు థ్యాంక్స్ చెబుతున్నారు మా మేడం!!” అని అనువదించాడు సెక్రటరీ.
లారెస్సా మరోసారి ఏదో మాట్లాడింది!
”తన ఫొటో పెట్టుకుని, 223 చోట్ల ఓట్లువేసిన వారి వివరాలు కావాలని, ఫోనునంబర్, ఆడ్రస్ ఎక్కడో చెప్పమంటున్నారు మా మేడం! అంతేకాదు! తాను ఇక నుండి ఇండియాలోనే ఉంటానని, మీ పెద్దాయన, గతంలో హామీ ఇచ్చినట్లు రూ.15 లక్షలు తన ఖాతాలో వేయాలని, ఇస్తామన్న రెండు కోట్ల ఉద్యోగాలలో ఒక మంచి జాబ్ మా మేడం గారికి ఇవ్వాలని, హర్యానాలోనే ఒక మంచి ఇల్లు కూడా కట్టించి ఇవ్వాలని అడుగుతున్నారు! ”అంటూ మళ్లీ తర్జుమా చేశాడు సెక్రటరీ!
లారెస్సా మళ్లీ ఏదో మాట్లాడి, రెండు సూట్ కేసులు ముందుకు తీసి ”జై శ్రీరాం!” అన్నది.
”తన లాంటి లారెస్సాలు బ్రెజిల్‌లో చాలామంది ఉన్నారని, వారి ఫొటోలు ఒక సూట్ కేసులో, ఆడ్రస్సులు మరో సూట్ కేసులో ఉన్నాయని, కావాలంటే అవి కూడా ఇతర రాష్ట్రాల, ఎన్నికల్లో వాడుకోవచ్చునని, తన ఫొటోలు అన్నీ ఒకటే వాడారని, ఇంకా వేర్చేరు ఫోజుల్లో దిగిన ఫొటోలు కూడా ఆ సూట్ కేసుల్లో ఉన్నాయని, ఇప్పటి నుండి ఆ ఫొటోలే వాడుకోవాలని అంటున్నారు! తాను అడిగినవన్నీ సిద్ధం చేయాలనీ, ఈలోగా తాను అయోధ్య బాల రాముడుని దర్శించుకుని వస్తానని, జైశ్రీరాం! అన్నారు మా మేడం గారు!” అంటూ లారెస్సాతో పాటు సెక్రెటరీ కూడా అయోధ్య వెళ్లిపోయాడు.
- ఉషాకిరణ్



