– మాజీ ఎమ్మెల్యే తాటి ఘాటు వ్యాఖ్యలు…
– తిరిగి బీఆర్ఎస్ లో చేరతానని ప్రకటన…
నవతెలంగాణ – అశ్వారావుపేట
టీ.పీ.సీ.సీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి పెద్ద మోస గాడని కాంగ్రెస్ కు మంగళవారం రాత్రి రాజీనామా చేసిన మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు బాహాటంగా విమర్శించారు. బుధవారం నియోజకవర్గ కేంద్రంలో జరిగిన సమావేశంలో తాటి మాట్లాడుతూ రెండు సంవత్సరాల క్రితం తనకు కాంగ్రెస్ పార్టీ నుండి అశ్వారావుపేట అసెంబ్లీ స్థానాన్ని కేటాయిస్తానని దానికి అయ్యే ఖర్చును కూడా నేనే చూసుకుంటానని చెప్పి తనను రేవంత్ రెడ్డి పార్టీలోకి ఆనాడు ఆహ్వానించారని ఇప్పుడు డబ్బు సంచులు కు అమ్ముడు పోయి తనకు తీవ్రమైన అన్యాయం చేశారని ఆవేదన వ్యక్తం చేసారు.సర్వేల ప్రకారం టిక్కెట్లు ఇచ్చామని చెబుతున్న రేవంత్ రెడ్డి ఏ ప్రాతిపదికన అశ్వారావుపేట స్థానాన్ని తనకు ఇవ్వలేదు స్పష్టం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని తాటి పేర్కొన్నారు.తనతో మునుగోడు ఎన్నికల సందర్భంగా కూడా రెండు నెలలపాటు పార్టీ తరపున విస్తృతమైన సేవలు చేయించుకున్నారు అని లక్షలాది రూపాయల ను కూడా తనతో ఖర్చు చేయించారని అక్కడ ప్రచారం చేసి డబ్బులు ఖర్చు చేస్తేనే అశ్వారావుపేట టికెట్ ఇస్తానని ఆరోజున చెప్పారని ఈ రోజున జరిగిన పరిస్థితి దానికి పూర్తిగా భిన్నంగా ఉందని తెలిపారు.డబ్బు సంచులతో పార్టీ లోకి వచ్చిన ఓ వ్యక్తికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చి జిల్లాలోని పలు సీట్లను ఆయన కొనుక్కున్నారు అని దాంట్లో భాగంగానే రేవంత్ రెడ్డి ఉమ్మడి ఖమ్మం జిల్లాలోనే కాకుండా రాష్ట్ర స్థాయిలో పదుల సంఖ్యలో టికెట్లను అమ్ముకున్నారని తాటి ఆరోపించారు.డబ్బు సంచులతో పార్టీలోకి వచ్చిన వ్యక్తి కర్ణాటక ఎన్నికలలో బిజెపి గెలిస్తే బిజెపి వైపు వెళ్లిపోయే వారిని కానీ వ్యాపార సూత్రం ప్రకారం అక్కడ కాంగ్రెస్ గెలవడంతో ఇక్కడ కాంగ్రెస్ లోకి వచ్చారని కాంగ్రెస్ అధిష్టానం కూడా దీనిని గమనించ లేక పోయిందని అన్నారు.తనతో పాటుగా పార్టీని నమ్ముకుని దశాబ్దాల పాటు సేవ చేస్తున్న వారికి కూడా ఈ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ తీవ్రమైన అన్యాయం చేసిందని తాటి విమర్శించారు.తనను కాంగ్రెసు లోకి ఆహ్వానించి నప్పుడు నియోజకవర్గంలో పార్టీ పరిస్థితి అత్యంత దయనీయంగా ఉందని తాను ఈ రెండు సంవత్సరాలలో గ్రామ గ్రామానికి తిరిగి పార్టీని బలోపేతం చేయడం జరిగిందని పార్టీ పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ హాజరయ్యే ఈనెల 13న దమ్మపేట లో జరిగే ప్రజా ఆశీర్వాద సభలో తాను టిఆర్ఎస్ పార్టీలో చేరుతున్నట్లు తాటి పేర్కొన్నారు. ఈ సమావేశంలో తాటి వెంట పలువురు ప్రజాప్రతినిధులు ,పార్టీ నేతలు, తదితరులు పాల్గొన్నారు.