Monday, April 27, 2026
E-PAPER
Homeట్రెండింగ్ న్యూస్మ‌నసు మీదా యుద్ధ భ‌యం

మ‌నసు మీదా యుద్ధ భ‌యం

- Advertisement -

అమెరికా- ఇజ్రాయెల్‌, ఇరాన్‌పై చేస్తున్న యుద్ధం ప్రపంచ వ్యాప్తంగా తీవ్రప్రభావం చూపుతోంది. అంతకు ముందు గాజాపై జరిపిన యుద్ధ సమయంలో కూడా ఇలాంటి పరిస్థితినే చవిచూశాము. అలాగే కొద్ది రోజులే అయినా గతేడాది భారత్‌, పాక్‌ మధ్య ఉద్రిక్త పరిస్థితులు, దాడులు, ప్రతిదాడులు జరిగాయి. ఇలాంటి భయంకర వాతావరణాలు ప్రాణ, ఆస్తి నష్టాలకే పరిమితం కాకుండా, మనసు మీదా కూడా తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం!

మనం ప్రతిరోజూ ఆస్తి, ప్రాణ నష్టాల దృశ్యాలు, సోషల్‌ మీడియాల్లో అసత్య ప్రచారాల వంటివన్నీ మనసును అతలాకుతలం చేసేవే. ఇలాంటి సంఘటనలు, అనుభవాలు మనసు మీద చెరగని ముద్ర వేస్తాయి. ఫలితంగా డిప్రెషన్‌, ఆందోళన, వేదన అనంతర తీవ్ర ఒత్తిడి వంటి సమస్యలకూ దారితీస్తాయంటున్నారు మానసిక నిపుణులు. ఇవి జీవితాంతం వెంటాడొచ్చంటున్నారు. కనుక సంక్షోభ సమయాల్లో అనవసర భయాలకు గురికాకుండా చూసుకోవటం, మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవటం చాలా ముఖ్యం.

భయంకర ఘటనలు ఏవైనా
వాస్తవానికి ఒక్క యుద్ధ వాతావరణం ఒక్కటే కాదు. హఠాత్తుగా ముంచుకొచ్చే సునామీలు, వరదలు లాంటి సంక్షోభాలైనా మనసు మీద విపరీత ప్రభావం చూపిస్తాయి. అప్పటి వరకూ సురక్షితంగా ఉన్నామనే నమ్మకాన్ని ఇవన్నీ ఛిద్రం చేయడంతో పాటు అభద్రతా భావానికి గురిచేస్తాయి. ఇప్పటికే మానసిక సమస్యలతో బాధపడుతున్నవారు, మద్యం, మాదకద్రవ్యాల వంటి అలవాట్లు ఉన్నవారు ఇంకాస్త ఎక్కువగా భయాలు, ఆందోళనకు గురయ్యే అవకాశం ఉంటుంది. యుద్ధ పీడిత ప్రాంతాలలో మహిళలు డిప్రెషన్‌, తీవ్ర ఒత్తిడి బారిన పడే అవకాశం ఎక్కువగా ఉందని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి.

సర్దుకోలేనివారిలో…
హఠాత్‌ సంక్షోభాలు, అనూహ్య ఘటనలు, పరిణామాలు ఎదురైనప్పుడు కొంత మంది విపరీతంగా స్పందిస్తుంటారు. తీవ్ర ఒత్తిడికి లోనవుతారు. ఏదో కొద్ది రోజులంటే ఏమో అనుకోవచ్చు. కానీ సంక్షోభాలు దీర్ఘకాలం కొనసాగితే రోజువారీ జీవితంలో హింసనూ ఒక భాగంగా పరిగణించాల్సిన అగత్యం ఏర్పడొచ్చు. దీనికి సర్దుకోలేనివారిలో నిద్రలేమి, చిరాకు, బాధ, ఆదుర్దా వంటి మానసిక సమస్యలు ఎక్కువవుతాయి. ముఖ్యంగా యువత భవిష్యత్తు మీద ఆందోళనతోనో, ఏమీ తోచకనో ఇంటర్నెట్‌, సోషల్‌ మీడియా అతిగా చూడొచ్చు. ధూమాపానం, మద్యం వంటి వ్యసనాలకూ లోనవ్వచ్చు.

ఎందుకిలా?
అదే పనిగా యుద్ధ వాతావరణాన్ని తలచుకోవటం, వినటం, దృశ్యాలు చూడటం లాంటివి శరీరాన్ని, మనసును నిరంతరం అప్రమత్త స్థితిలో ఉంచుతాయి. దీంతో శరీరంలో సింపథెటిక్‌ నాడీ వ్యవస్థ విపరీతంగా ప్రేరేపితమవుతుంది. ఫలితంగా, ఒత్తిడిని కలగజేసే అడ్రినలిన్‌, నార్‌ అడ్రినలిన్‌ నుంచి పారిపోవటానికి లేదా వాటిని ఎదుర్కోవటానికి సహాయపడతాయి. కానీ అదే పనిగా, అనవసరంగా విడుదలైతే మాత్రం మానసిక ఒత్తిడికి దారి తీస్తాయి. దీని మూలంగా తరచూ నిరాశ, దిగులు, త్వరగా అలసిపోవటం, భయానక ఆలోచనలు, పీడకలలు, నిద్రలేమి, శ్వాస వేగంగా తీసుకోవటం, తరచూ గుండెదడ వంటి సమస్యలూ తలెత్తుతాయి. కుటుంబ సభ్యులపై కోపం, చీదరించుకోవటం వంటివీ కలగొచ్చు. దీన్ని సరిగా నియంత్రణలో ఉంచుకోకపోతే విపరీత పరిణామాలకు దారితీస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. యుద్ధం లేదా సంఘర్షణను అనుభవించిన ప్రతి ఐదుగురిలో ఒకరికి డిప్రెషన్‌, ఆందోళన, పోస్ట్‌-ట్రామాటిక్‌ స్ట్రెస్‌ డిజార్డర్‌, బైపోలార్‌ డిజార్డర్‌ లేదా స్కిజోఫ్రెనియా ఉన్నాయని ఓ అధ్యయనం పేర్కొంది.

పిల్లల మీద ఎక్కువ ప్రభావం
యుద్ధ వాతావరణాలు, భీతావహ ఘటనలు ప్రత్యేకించి పిల్లల మీద విపరీత ప్రభావం చూపుతాయి. ఇవి జరుగుతున్నంత కాలం బయటే కాదు, ఇంట్లోనూ పెద్దవాళ్లు ఎక్కడ ఏమవుతోందని తెలుసుకోవటానికి ఫోన్లు, టీవీలకు అతుక్కుపోతుంటారు. ఎడతెగని చర్చలు, వాదోపవాదోల్లో నిమగమవుతారు. దీనివల్ల పిల్లలతో మాట్లాడటం, వారితో గడపటం తగ్గిస్తారు. ఇవన్నీ పిల్లల మీదు ప్రతికూల ప్రభావం చూపుతాయి. భవిష్యత్తు గురించి భయాలు, ఆందోళనలు ఎక్కువవుతాయి.
ఎలా కాపాడుకోవాలి
కుటుంబంతో అనుబంధం :
భయానక పరిస్థితులను ఎలా ఎదుర్కొంటున్నాం, వాటికి ఎలా స్పందిస్తున్నామనేది ముఖ్యం. ఇందులో కుటుంబ అనుబంధాలు కీలక పాత్ర పోషిస్తాయి. ముఖ్యంగా చిన్నారులకు పెద్దవాళ్ల అండ చాలా అవసరం. కాబట్టి వారికి తగినంత సమయం కేటాయించాలంటున్నారు నిపుణులు. వారి అవసరాలను గుర్తించి, అలా నడచుకోవాలని చెబుతున్నారు. కనుక పిల్లలు తమ భయాలు, ఆందోళనలను సరిగా చెప్పలేరు. కొందరు ఏడ్వచ్చు, మరికొందరు చిరాకు పడొచ్చు. వీటిలన్నిం టిని పేరెంట్స్‌ జాగ్రత్తగా గమనించాలి. హింసాత్మక, భయానక దృశ్యాలను వీలైనంత వరకూ పిల్లల కంట పడకుండా చూసుకోవా లి. బుక్స్‌ చదవడం, ఇతర పిల్లలతో కలిసి ఆడుకోవడం లాంటివి ప్రోత్సహించటం వంటి వాటితో భయానక ఘటనల నుంచి మనసును మళ్లించే ప్రయత్నం చేయాలి.
పనులు మామూలుగా: వేళకు భోజనం చేయాలి. తగినంత నీరు తాగాలి. రాత్రిపూట ప్రశాంతంగా 7 నుంచి 8 గంటలు నిద్రపోవాలి. అలాగే క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. పుస్తకాలు చదవడం, తోటపని, సంగీతం వినటం వంటి విశ్రాంతి కార్యక్రమాలకూ ప్రాధాన్యం ఇవ్వాలి. ధూమపానం, మద్యం వంటి దురలవాట్లకు దూరంగా ఉండాలి.

సరైన సమాచారం: ప్రభుత్వ, విశ్వసనీయమైన సంస్థలు అందించే సమాచారాన్ని తెలుసుకోవాలి. అనవసర భయాలకు లోనుకావద్దు. ఇప్పుడు ఏఐ (కృత్రిమ మేధ) సాయంతో కొన్ని వీడియోలను మార్చి, అసత్య ప్రచారాలు చేయటమూ సర్వసాధరణమైంది. కాబట్టి ఏది పడితే దాన్ని నమ్మొద్దు.
ఆలోచనా తీరు మార్చుకోవాలి : ప్రతికూల ఆలోచనలను, అతిగా స్పందించటాన్ని తగ్గించుకోవాలి. భయం కలిగినప్పుడు శ్వాస వేగం పెరగటం, గుండెదడ మామూలేనని పరిస్థితి కుదురుకున్నాక ఇవీ తగ్గేవేనని అర్థం చేసుకోవాలి.
పాఠాలుగా: సంక్షోభ సమయాల్లో ఎలా ప్రవర్తించాలి? ఎలా ఎదుర్కోవాలి? అనే అంశాలను పాఠ్యాంశంలో చేర్చాలి. అప్పుడు సమస్య ఏంటి? అదెక్కడ మొదలైంది? దానికి పరిష్కారమేంటి? ఎలా నడుచుకోవాలి? అనేవి పిల్లలకు అలవడతాయని నిపుణులు చెబుతున్నారు. యుద్ధాల వంటి వాటిని ఆపటానికి అంతర్జాతీయ సంస్థలు ఎప్పటికప్పుడు ప్రయత్నం చేస్తుంటాయని చెబితే వారికి భరోసా కలుగుతుందని సూచిస్తున్నారు.
నలుగురితో కలివిడిగా : కుటుంబ సభ్యులు, ఫ్రెండ్స్‌తో కలిసి, ఆలోచనలను పంచుకోవటం చాలా ముఖ్యం. మనం భయపడినంతగా పరిస్థితి లేదని ఇతరులు చెప్పినప్పుడు మనసు సాంత్వన పడుతుంది.
నిపుణుల సాయం: రెండు వారాల కన్నా ఎక్కువగా నిద్రలేమి, భయం, ఆందోళన వంటి వాటితో సతమతమవుతుంటే మానసిక నిపుణుల సాయం తీసుకోవటానికి సంకోచించకూడదు. వాళ్లు ఇచ్చే కౌన్సెలింగ్‌తో మానసిక బలం లభిస్తుందని అంటున్నారు. ఆలోచనా తీరును మార్చుకోవటం, ధైర్యంగా ఎలా ఉండాలో నేర్పిస్తారు. అవసరమైతే ఆయా లక్షణాలను బట్టి మానసిక ఒత్తిడి, ఆందోళన, డిప్రెషన్‌ లాంటివి తగ్గడానికి, ప్రశాంతంగా నిద్రపోవడానికి మందులు సూచిస్తారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -