Monday, April 27, 2026
E-PAPER
Homeట్రెండింగ్ న్యూస్యుద్ధం పేరిట గ్యాస్‌ దందా

యుద్ధం పేరిట గ్యాస్‌ దందా

- Advertisement -

ఏజెన్సీలే బ్లాక్‌ మార్కెట్‌ చేస్తున్న వైనం బుకింగ్‌ ఆలస్యం పేరిట అధిక ధరకు అమ్మకం
డొమెస్టిక్‌ సిలిండర్ల నుంచి కమర్షియల్‌ సిలిండర్లకు రీఫిల్లింగ్‌..నామ్‌కే వాస్తేగా విజిలెన్స్‌
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌

అమెరికా ప్రోద్బలంతో ఎక్కడోనున్న ఇజ్రాయిల్‌… ఇరాన్‌పై యుద్ధం చేస్తే మనకేం టి అనుకునే వారి జేబులకు ఇప్పుడు చిల్లులు పడుతున్నాయి. ఆ ప్రభావం ఢిల్లీని దాటి హైదరాబాద్‌ గల్లీలపై పడుతోంది. ముఖ్యంగా ఇది ‘వంటిట్లో కుంపట్లు’ పెడుతోంది. కప్పు ఛారు తాగుదామన్నా.. ప్లేటు ఇడ్లీ తిందామ న్నా.. ఒకటికి రెండుసార్లు ఆలోచించాల్సిన పరిస్థితి నెలకొంది. యుద్ధం పేరు చెప్పి గృహ (డొమెస్టిక్‌), వాణిజ్య (కమర్షియల్‌) సిలిండర్ల కృత్రిమ కొరత సృష్టించటం, వినియోగదారుల అవసరాలను ఆసరా చేసుకుని వాటి ధరలను ఇబ్బడిముబ్బడిగా పెంచి దందా నడుపుతున్నా రు. తెలంగాణ వ్యాప్తంగా ఈ దందా నడుస్తున్నా…పౌర సరఫరాలశాల విజిలెన్స్‌ విభాగం పట్టీపట్టనట్టు వ్యవహరిస్తుండటం గమనార్హం. విభాగపు అధికారులు… ఐదారు వేల అక్రమ సిలిండర్లను సీజ్‌ చేశాం, దందా రాయుళ్లపై కేసులు నమోదు చేశామంటూ చెబుతున్నప్పటికీ వాస్తవ పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. రాష్ట్రంలోని హోటళ్లు, రెస్టారెంట్లు, టిఫిన్‌ సెంటర్ల యాజమానులు మాత్రం ఇప్పటికీ సిలిండర్లను బ్లాక్‌లోనే కొనుగోలు చేయాల్సి వస్తోంది. ఇంతకు ముందు డెలీవరి బారులు తమ దగ్గరికి వచ్చి సిలిండర్లను దించిపోయేవారని, కానీ ఇప్పుడు బ్లాక్‌లో అధిక మొత్తంలో ‘సమర్పిస్తేనే’ డెలివరీ చేయిస్తామంటూ ఏజేన్సీలే బెదిరిస్తున్నాయని పలు టిఫిన్‌ సెంటర్ల యజమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కమర్షియల్‌ సిలిండర్‌ ధర ఇప్పుడు అసలు ధర కంటే రెండింతలు పెరిగి పోయిందని, ఇది తమకు భరించలేని భారంగా మారిందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

కమర్షియల్‌ రూ.5 వేలు.. డొమెస్టిక్‌ రూ.3,500
ఈ దందా వల్ల రూ.2,105 ఉన్న కమర్షియల్‌ సిలిండర్‌ను బ్లాక్‌లో ఏకంగా రూ.5 వేలకు కొనుగోలు చేయాల్సి వస్తోంది. రూ.950గా ఉన్న డొమిస్టిక్‌ సిలిండర్‌ ధరను దళారులు రూ.2 వేల నుంచి రూ.3,500 పెంచి అమ్ముకుంటున్నారు. దీంతో వినియోగదారులపై తీవ్ర భారాలు పడుతున్నాయి. అయినా అదికారుల్లో మాత్రం చలనం లేదు. డిస్ట్రిబ్యూటర్లు, సిబ్బంది, దళారులు, అధికార యంత్రాంగం కుమ్మక్కై నిబంధనలకు విరుద్ధంగా ఈ దందాను నడుపుతున్నారని సమాచారం. అధికారుల అండదండలు బలంగా ఉండటం వల్లే దళారులు రెచ్చిపోతున్నారని తెలిసింది. మరోవైపు కమర్షియల్‌ సిలిండర్‌ కావాల్సిన వినియోగదారులు… డిస్ట్రిబ్యూటర్‌కు లేదంటే ఏజెన్సీకి ఫోన్‌ చేస్తే సరఫరా చేస్తారు. డొమెస్టిట్‌ సిలిండర్‌ను మాత్రం ఆన్‌లైన్‌లో బుక్‌ చేసుకోవాల్సి ఉంటుంది. ఇది సాధారణంగా జరిగే ప్రక్రియ. కానీ ఇప్పుడు ఆన్‌లైన్‌లో, ఆఫ్‌లైన్‌లో లేదా ఫోన్‌లో ఎలా బుక్‌ చేసినా ధరాభారం మాత్రం తప్పటం లేదు.

రీఫిల్లింగ్‌ దందా…
గ్యాస్‌ సిలిండర్‌ ధరలను భరించలేక హైదరాబాద్‌తోపాటు రాష్ట్రంలోని కొన్ని వందల హోటళ్లు, టిఫిన్‌ సెంటర్స్‌, రెస్టారెంట్లను నెలక్రితమే మూసేశారు. అందులో ఇప్పటికీ చాలా వాటిని తెరవలేదు. యుద్ధ తీవ్రత తగ్గి.. పరిస్థితులు సాధారణ స్థితికి చేరుకుంటున్నప్పటికీ గ్యాస్‌ దందా మాత్రం అలాగే కొనసాగుతోంది. గ్యాస్‌ అక్రమ నిల్వలను ఆరికట్టాల్సిన అధికార యాంత్రాంగం దళారులకే వత్తాసు పలుకుతోంది. దీనికితోడు డొమెస్టిక్‌ సిలిండర్ల నుంచి గ్యాస్‌ను కమర్షియల్‌ సిలిండర్లకు రీఫిల్లింగ్‌ చేసి, ఆ మేరకు ధర పెంచి దండుకుంటున్న ఘటనలు అనేకం వెలుగు చూశాయి. ఇదే సమయంలో బుకింగ్‌ కావడం లేదంటూ ప్రచారం చేయటం, బుకింగ్‌ అయినప్పటికీ స్టాక్‌ లేదని చెప్పడం, కృత్రిమ కొరత సృష్టించి ఎక్కువ ధరకు అమ్ముకోవటం తదితర పద్ధతుల్లో వినియోగదారుల నుంచి దందారాయుళ్లు భారీగా దండుకుంటున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం, పౌర సరఫరాలశాఖ దీనికి అడ్డుకట్ట వేస్తుందా? లేదా? అనేది చూడాలి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -