డైలీ వేజ్ సిబ్బందిని క్రమబద్ధీకరించాలి
ట్రాన్స్ ఫర్ పాలసీని పారదర్శకంగా అమలు చేయాలి : టీజీబీఈయూ సర్వ సభ్య సమావేశంలో తీర్మానం
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
నేషనల్ రూరల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను ఏర్పాటు చేయాలని తెలంగాణ గ్రామీణ బ్యాంక్ ఎంప్లాయీస్ యూనియన్ డిమాండ్ చేసింది. ఈ మేరకు శుక్రవారం ఏపీటీఆర్ఆర్బీఈఏ అధ్యక్షులు బి.రవికాంత్ అధ్యక్షతన హైదరాబాద్ లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నిర్వహించిన తొలి సర్వ సభ్య సమావేశంలో తీర్మానించారు. బదిలీల పాలసీని పారదర్శకంగా అమలు చేయాలి, డైలీవేజ్ సిబ్బందిని రెగ్యులరైజ్ చేయాలనే తీర్మానాలను కూడా ఏకగ్రీవంగా ఆమోదించారు. ఈ సందర్భంగా ఏఐఆర్ఆర్బీఈఏ సెక్రెటరీ జనరల్ ఎస్.వెంకటేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ దశాబ్దాల పోరాటాల ఫలితంగా పలు డిమాండ్లను సాధించుకున్నామని తెలిపారు. అయితే పోరాడిన వెంటనే ఫలితాలు రాకపోవచ్చని, కానీ ఏనాటికైనా ఫలితం రాకుండా ఉండబోదని వ్యాఖ్యానించారు. డైలీవేజ్ ఉద్యోగుల రెగ్యులరైజేషన్ కోసం జరిగిన ఉద్యమాలు, న్యాయ పోరాటాలను వివరించారు. ఐక్యంగా ముందుకెళ్తే విజయం సిద్ధిస్తుందని తెలిపారు. కొన్ని సార్లు ఈ తరం చేసిన పోరాటాలు రేపటి తరానికి ఉపయోగపడతాయని తెలిపారు. గ్రామీణ బ్యాంకులను నాశనం చేయాలి, వాటిని ప్రయివేటీకరించాలనే బీజేపీ ప్రయత్నాలను తిప్పికొడుతున్నామని తెలిపారు.
2015 నుంచి ఇదే రకమైన చర్యలకు మోడీ సర్కార్ పాల్పడుతోందని విమర్శించారు. గ్రామీణ బ్యాంకుల్లోని సిబ్బంది సంఖ్యను 15 వేల మందికి తగ్గించేందుకు ప్రయత్నిస్తే తాము తీవ్రంగా ప్రతిఘటించామని అన్నారు. ఫలితంగా ఉద్యోగుల సంఖ్య 70 వేల నుంచి 97 వేలకు పెరిగిందని తెలిపారు. 40 కోట్ల మంది వాటాదారులను కలుపుకుని బ్యాంకు ఉద్యోగులు పట్టుదలతో తమ హక్కులను సాధించుకోవాలని సూచించారు. స్పాన్సర్డ్ బ్యాంకుల నుంచి విముక్తి కల్పించాలని కోరారు. నేషనల్ రూరల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను ఏర్పాటు చేయాలనీ, 20 వేల మంది డైలీ వేజ్ సిబ్బందిని క్రమబద్ధీకరించాలనీ, కొత్తగా 30 వేల మందిని నియమించాలని ఆయన డిమాండ్ చేశారు. అలా చేస్తే తాము ప్రస్తుతం ఉన్న రూ.11 లక్షల కోట్ల బిజినెస్ ను రూ.50 లక్షల కోట్లకు పెంచి చూపిస్తామన్నారు. గ్రామీణ బ్యాంకు ఉద్యోగులకు, ప్రజలకు మధ్య ఘర్షణ సృష్టించేందుకు కేంద్రం ప్రయత్నిస్తోందని ఆయన ఈ సందర్భంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒడిశాలో ఒక సోదరి శవం బ్యాంకుకు మోసుకొచ్చిన సోదరుడి సంఘటనను ఉదహరిస్తూ, నిబంధనల పేరిట అలాంటి వారికి సులభతరంగా డబ్బులివ్వకుండా తీవ్ర ఇబ్బందులు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
బెఫి తెలంగాణ ప్రధాన కార్యదర్శి పి.వెంకట రామయ్య మాట్లాడుతూ గ్రామీణ బ్యాంకులను ప్రయివేటీకరించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రయత్నిస్తున్నాయని విమర్శించారు. ఆ కుట్రలో భాగంగా కొంత ప్రయివేటు పెట్టుబడిని పెట్టేందుకు కుట్రలు పన్నుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికీ గ్రామీణ బ్యాంకులు 95 శాతం రుణాలను రైతులు, సూక్ష్మ పరిశ్రమలు, గ్రామీణాభివృద్ధి కోసమే ఇస్తున్నాయని తెలిపారు. అన్ని రాష్ట్రాల గ్రామీణ బ్యాంకులను విలీనం చేసి జాతీయ స్థాయిలో నేషనల్ రూరల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. బ్యాంకుల్లో ప్రజలు పొదుపు చేసుకుం టున్న డబ్బులకు వడ్డీని పెంచాలనీ, సమాజంలో అంతరాలను తొలగించే విధానాలు తీసుకురా వాలని కోరారు. మోడీ సర్కార్ కార్పొరేట్లకు వత్తాసు పలుకుతూ వారు బకాయి పడ్డ 16.75 లక్షల కోట్ల మొండి బకాయిలను రద్దు చేసిందని గుర్తు చేశారు. దీనిపై సుప్రీంకోర్టు కూడా బీజేపీ సర్కార్ ను తప్పుపట్టిందని తెలిపారు. సమావేశంలో తెలంగాణ గ్రామీణ బ్యాంక్ చైర్మెన్ కె.ప్రతాప్ రెడ్డి, ఏఐఆర్ఆర్బీఈఏ ప్రెసిడెంట్ సి.రాజీవన్, తెలంగాణ గ్రామీణ బ్యాంక్ జీఎం ఎస్.శంకర రావు, ఎన్ఎప్ఆర్ఆర్బీఈ అధ్యక్షులు అశ్వథ్, వైస్ ప్రెసిడెంట్ శివ కుమార్ బెగ్లర్, ప్రధాన కార్యదర్శి సమీరన్ మేధి, బెఫి తెలంగాణ అధ్యక్షులు టి.సతీష్, తెలంగాణ గ్రామీణ బ్యాంక్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు వేణు రావు పబ్బతినేని, ఆకుల బాపు తదితరులు పాల్గొన్నారు.
నూతన కమిటి ఎన్నిక
తెలంగాణ గ్రామీణ బ్యాంకు ఎంప్లాయిస్ యూనియన్ నూతన కమిటిని ఈ సందర్బంగా ఎన్నుకున్నారు. అధక్ష, ప్రధాన కార్యదర్శిగా వేణురావు ఆకుల బాపూ, కోశాధికారిగా టి.సతీశ్ ఎన్నికయ్యారు.


