నల్లగొండ జిల్లాలో లక్ష మందికిపైగా కార్మికులు పూర్తిస్థాయి ఆస్పత్రి లేక హైదరాబాద్‌కు వెళ్లాల్సిన దుస్థితి
మిర్యాలగూడ డిస్పెన్సరీలో కేవలం రోగ నిర్ధారణే.. సీఎం పర్యటనపైనే కార్మిక కుటుంబాల ఆశలు
పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతున్న నల్లగొండ జిల్లాలో లక్ష మందికి పైగా ఈఎస్ఐ కార్మికులు ఉన్నా స్థానికంగా ఆ ఆస్పత్రి లేదు. వారికి అందాల్సిన ప్రాథమిక సంక్షేమ సేవలూ అందడం లేదు. జిల్లాలో మొత్తం 864 పారిశ్రామిక కేంద్రాలు, 352 పరిశ్రమలు ఉండగా, సుమారు 49,398 మంది కార్మికులు పనిచేస్తున్నారు. ప్రభుత్వ అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగులు 50,000 మందికిపైగా ఉన్నప్పటికీ జిల్లాలో పూర్తి స్థాయి ఈఎస్ఐ ఆస్పత్రి లేదు. దీని వల్ల వైద్యం కోసం దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది.
నవతెలంగాణ -నల్లగొండ ప్రాంతీయ ప్రతినిధి
దామరచర్ల, మర్రిగూడ, త్రిపురారం, పెద్దవూర, మల్లేపల్లి, చిట్యాల, నార్కట్‌పల్లి, కట్టంగూర్, నకిరేకల్, కేతేపల్లి, మిర్యాలగూడ తదితర ప్రాంతాల్లో పారిశ్రామిక కార్యకలాపాలు విస్తృతంగా కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ నెల 28న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నల్లగొండకు రానుండటంతో ఈఎస్‌ఐ ఆస్పత్రి ఏర్పాటుపై ప్రకటన చేయాలని కార్మికులు కోరుతున్నారు. కార్మికుల డిమాండ్‌ను కేంద్రం దృష్టికి తీసుకెళ్లాలని డిమాండ్ చేస్తున్నారు.
డిస్పెన్సరీ పేరుకే..
మిర్యాలగూడలో ఉన్న ఈఎస్ఐ డిస్పెన్సరీలో ఇద్దరు వైద్యులు, ఇద్దరు నర్సులు, కొంతమంది సిబ్బంది మాత్రమే ఉన్నారు. ఇక్కడ రోగ నిర్ధారణ పరీక్షలు మాత్రమే నిర్వహిస్తున్నారని, చికిత్స సేవలు అందుబాటులో లేవని కార్మికులు చెబుతున్నారు. అత్యవసర పరిస్థితుల్లోగానీ, ప్రత్యేక వైద్యం అవసరమైన సందర్భాల్లోగానీ రోగులను హైదరాబాద్‌కు రిఫర్ చేయడం తప్ప మరో మార్గం లేదంటున్నారు.
వైద్యం కోసం హైదరాబాద్ బాట
ఈఎస్ఐ కార్డు ఉన్నప్పటికీ చికిత్స కోసం వందల కిలోమీటర్లు ప్రయాణించి హైదరాబాద్ వెళ్లాల్సి వస్తోందని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రయాణ ఖర్చులు, వేతన నష్టం, కుటుంబ సభ్యుల ఇబ్బందులు కలిసి అదనపు భారంగా మారుతున్నాయని చెబుతున్నారు. అత్యవసర పరిస్థితుల్లో చాలామంది ప్రయివేట్ ఆస్పత్రులను ఆశ్రయించి అప్పుల పాలవుతున్నారని కార్మిక సంఘాల నాయకులు చెబుతున్నారు.
క్రమం తప్పకుండా చందాలు ..
ప్రతి నెలా ఈఎస్ఐ, పీఎఫ్ కింద కార్మికుల వేతనాల నుంచి నిధులు మినహాయింపులు జరుగుతున్నప్పటికీ, ఆ మేరకు సేవలు అందడం లేదని కార్మికులు ఆవేదన చెందుతున్నారు. దాదాపు యాభై వేల మంది కార్మికులు ఉన్న జిల్లాకు ఒక పూర్తి స్థాయి ఈఎస్ఐ ఆస్పత్రి లేకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమని విమర్శిస్తున్నారు.
పీఎఫ్ సేవల్లోనూ ఆరోపణలు
ఉద్యోగుల భవిష్యనిధి (పీఎఫ్) సేవలు ప్రయివేట్ ఏజెన్సీల ఆధ్వర్యంలో కొనసాగుతున్నాయని, రుణాలు, క్లెయిమ్‌ల పరిష్కారంలో కమీషన్లు డిమాండ్ చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కార్మికుల సమస్యల పరిష్కారానికి పారదర్శక వ్యవస్థ ఏర్పాటు చేయాలని కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
ఇద్దరు మంత్రులున్నా..
ఉమ్మడి నల్లగొండకు ఇద్దరు మంత్రులు ఉన్నారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్‌రెడ్డి ఉన్నారు. వీరు సీనియర్ నేతలు. శాసన మండలి చైర్మెన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి నల్లగొండ వారే. జానారెడ్డి లాంటి సీనియర్ నేతలు ఉన్నారు. అయినా జిల్లా కేంద్రంలో ఈఎస్‌ఐ ఆస్ప్రతి లేకపోవడం గమనార్హం. గత ప్రభుత్వంలోనూ దీని మీద ఆలోచన చేయలేదు. ఇప్పటికైనా ఈఎస్‌ఐ ఆస్పత్రి ఏర్పాటుకు కృషి చేయాలని కార్మికులు కోరుతున్నారు.
పూర్తి స్థాయి ఈఎస్ఐ ఆస్పత్రి మంజూరు చేయాలి
నల్లగొండ జిల్లాలో పూర్తి స్థాయి ఈఎస్ఐ ఆస్పత్రి ఏర్పాటు చేయాలి. మిర్యాలగూడ డిస్పెన్సరీని ఆస్పత్రిగా అప్‌గ్రేడ్ చేయాలి. నిపుణులైన వైద్యులు, సిబ్బందిని నియమించాలి. పారిశ్రామిక ప్రాంతాల్లో ఈఎస్ఐ వైద్య సేవలను విస్తరించాలి. పీఎఫ్ సేవల్లో అవినీతి ఆరోపణలపై విచారణ జరపాలి. కార్మికులకు ఒకే చోట ఈఎస్ఐ, పీఎఫ్ సేవలు అందుబాటులోకి తీసుకురావాలి. దాదాపు లక్ష మంది కార్మికుల ఆరోగ్య భద్రత ప్రశ్నార్థకంగా మారిన నేపథ్యంలో ప్రభుత్వం, ఈఎస్ఐ అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలి.
ఎండీ సలీం,
సీఐటీయూ జిల్లా కార్యదర్శి



