అమరచింత మండల పరిధిలోని ప్రభుత్వ విద్యాసంస్థల పరిశీలన
విద్యార్థులను సమస్యలు అడిగి తెలుసుకున్న సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ
నవతెలంగాణ -ఆత్మకూర్
‘చదువులు ఎలా సాగుతున్నాయి? సమస్యలు ఏమున్నాయి? విద్యా బోధన ఎలా సాగుతోంది..? మౌలిక సదుపాయాలున్నాయా’ అని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. అలాగే, వంటగదిలో భోజనాన్ని, కూరలను పరిశీలించారు. మరుగుదొడ్లను పరిశీలించారు. శుక్రవారం వనపర్తి జిల్లా అమరచింత మండల పరిధిలోని పామిరెడ్డిపల్లి గ్రామ శివారులో ఉన్న కస్తూర్బా గాంధీ బాలికల జూనియర్ కళాశాలను శుక్రవారం సీపీఐ(ఎం) నాయకులతో కలిసి ఆయన సందర్శించారు. తరగతి గదిలోకి వెళ్లి విద్యార్థులతో మాట్లాడారు. అనంతరం జాన్‌వెస్లీ మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ కళాశాలలు, పాఠశాలలను బలోపేతం చేయాలని, రాష్ట్ర బడ్జెట్‌లో 20 శాతం నిధులు విద్యారంగానికి కేటాయించాలని డిమాండ్ చేశారు. కస్తూర్బా జూనియర్ కళాశాలలో దాదాపు 400 మంది బాలికలు చదుకుంటున్నారని తెలిపారు. హిందీ ఉపాధ్యాయ పోస్టు ఖాళీగా ఉందని, లైబ్రరీ, ల్యాబ్ సౌకర్యం లేక విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పారు. విద్యాలయానికి కాంపౌండ్ వాల్ లేదనీ, విష సర్పాలు సంచరిస్తున్నాయని విద్యార్థులు భయాందోళనకు గురవుతున్నారన్నారు.
మంచినీటి సమస్య తీవ్రంగా ఉందని, ఫిల్టర్ మెషిన్ పనిచేయకపోవడంతో బోర్ నీళ్లు తాగాల్సి వస్తోందని, వెంటనే ఫిల్టర్ మెషిన్‌ను మరమ్మతు చేయించాలని సంబంధిత అధికారులను కోరారు. మంచాలు లేక బాలికలు నేలపైనే పడుకుంటున్నారని తెలిపారు. అధ్యాపకులు కూడా తక్కువ వేతనాలతో విధులు నిర్వహిస్తున్నారన్నారు. ప్రభుత్వం ఖాళీగా ఉన్న ఉపాధ్యాయుల పోస్టులను భర్తీ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రభుత్వ పాఠశాలలు ప్రారంభం కాకముందే అన్ని వసతులూ కల్పించామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చెప్తుండగా.. వాస్తవంగా మాత్రం పరిస్థితులు భిన్నంగా ఉన్నాయని అన్నారు. విద్యార్థులు ఇష్టంగా చదివి ఉన్నత స్థానాలకు ఎదగాలని జాన్‌వెస్లీ సూచించారు. ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో ఎక్కువగా పేద, మధ్యతరగతి విద్యార్థులే ఉంటారని, తల్లిదండ్రుల కలలను సాకారం చేయాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి పుట్ట ఆంజనేయులు, కార్యదర్శివర్గ సభ్యులు ఎండీ జబ్బర్, ఎండీ మహమూద్, జీఎస్ గోపి, ఎస్.అజరు, వెంకటేష్ రాఘవేంద్ర, షారుక్, పామిరెడ్డిపల్లి ఉపసర్పంచ్ దేవర్ల వెన్నెల, శంకర్, డిసి. మాధవి, రవి, శ్యాంసుందర్, బుచ్చన్న, రాజు, ఫయాజ్, చంటి పాల్గొన్నారు.



