Monday, April 27, 2026
E-PAPER
Homeఆటలుకోల్‌కతా సూపర్‌!

కోల్‌కతా సూపర్‌!

- Advertisement -

– లక్నోపై సూపర్‌ ఓవర్లో గెలుపు
– నైట్‌రైడర్స్‌ 155/7, సూపర్‌జెయింట్స్‌ 166/8

ఐపీఎల్‌లో ఈ శనివారం భారీ స్కోర్లు ధమాకా అభిమానులను అలరించగా.. ఆదివారం స్వల్ప స్కోర్ల థ్రిల్లర్‌ ఊర్రూతలూగించింది. లక్నో ఎకానా స్టేడియంలో సూపర్‌జెయింట్స్‌, నైట్‌రైడర్స్‌ తొలుత పూర్తి మ్యాచ్‌లో సమవుజ్జీలుగా నిలిచాయి. సునీల్‌ నరైన్‌, రింకు సింగ్‌ మేనియాతో సూపర్‌ ఓవర్లో నైట్‌రైడర్స్‌ ఘన విజయం సాధించింది. లక్నో సూపర్‌జెయింట్స్‌కు సీజన్లో ఇది ఆరో ఓటమి.

నవతెలంగాణ-లక్నో
సూపర్‌ ఓవర్‌కు దారితీసిన థ్రిల్లర్‌లో లక్నో సూపర్‌జెయింట్స్‌పై కోల్‌కతా నైట్‌రైడర్స్‌ ఘన విజయం సాధించింది. సూపర్‌ ఓవర్లో తొలుత సునీల్‌ నరైన్‌ మాయకు నికోలస్‌ పూరన్‌ (0), ఎడెన్‌ మార్‌క్రామ్‌ (0) డకౌట్‌ కావటంతో మూడు బంతుల్లోనే లక్నో పోరాటం ముగిసింది. ఛేదనలో ప్రిన్స్‌ యాదవ్‌ వేసిన తొలి బంతినే రింకు సింగ్‌ (4) బౌండరీకి తరలించి నాటకీయతకు తెరదించాడు. దీంతో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ సీజన్లో రెండో విజయం ఖాతాలో వేసుకుంది. అంతకుముందు, రింకు సింగ్‌ (83 నాటౌట్‌, 51 బంతుల్లో 7 ఫోర్లు, 5 సిక్స్‌లు) అజేయ అర్థ సెంచరీతో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ తొలుత 20 ఓవర్లలో 7 వికెట్లకు 155 పరుగులు చేసింది. ఛేదనలో కెప్టెన్‌ రిషబ్‌ పంత్‌ (42, 38 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్‌), ఎడెన్‌ మార్‌క్రామ్‌ (31, 27 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్‌), ఆయుశ్‌ బదొని (24, 19 బంతుల్లో 2 సిక్స్‌లు) రాణించటంతో లక్నో సూపర్‌జెయింట్స్‌ 20 ఓవర్లలో 8 వికెట్లకు 155 పరుగులు చేసింది. 20 ఓవర్ల ఆటలో ఇరు జట్ల స్కోర్లు సమం అయ్యాయి.

సమిష్టిగా మెరిసినా..
లక్నో సూపర్‌జెయింట్స్‌ లక్ష్యం 156 పరుగులు. సొంతగడ్డ ఎకానె పిచ్‌ స్వభావంపై ఆ జట్టుకు మెరుగైన అవగాహన అదనపు బలం. కానీ ఛేదనలో సూపర్‌జెయింట్స్‌ ఆరంభం నుంచి తడబాటుకు గురైంది. ఓపెనర్‌ మిచెల్‌ మార్ష్‌ (2), నికోలస్‌ పూరన్‌ (9), ముకుల్‌ చౌదరి (1) దారుణంగా నిరాశపరిచారు. ఎడెన్‌ మార్‌క్రామ్‌ (31), రిషబ్‌ పంత్‌ (42) పరుగుల వేటలో ఆకట్టుకున్నారు. సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌పై దాదాపు ఇదే పరిస్థితుల్లో అజేయ అర్థ సెంచరీతో జట్టును గట్టెక్కించిన రిషబ్‌ పంత్‌.. ఈసారి లక్నోలో నిరాశపరిచాడు. సునీల్‌ నరైన్‌ ఓవర్లో పంత్‌ వికెట్‌ పడటంతో.. సూపర్‌జెయింట్స్‌ తీవ్ర ఒత్తిడిలో పడింది. ఆయుశ్‌ బదొని ఆఖర్లో సూపర్‌జెయింట్స్‌ ఆశలు ఆవిరి కాకుండా చూశాడు. ఆఖరు ఓవర్లో లక్నోకు 17 పరుగులు అవసరం కాగా.. కార్తీక్‌ త్యాగి రెండు నో బాల్స్‌తో సూపర్‌జెయింట్స్‌ శిబిరంలో ఉత్సాహం నింపాడు. ఆఖరు బంతికి ఏడు పరుగులు అవసరమైన దశలో మహ్మద్‌ షమి సిక్సర్‌ బాది మ్యాచ్‌ను టై చేశాడు. ఇంపాక్ట్‌ ప్లేయర్‌ హిమ్మత్‌ సింగ్‌ (19) ఆఖరు ఓవర్లో అవుటైనా.. సూపర్‌జెయింట్స్‌ను రేసులోనే నిలిపాడు. కోల్‌కతా నైట్‌రైడర్స్‌ బౌలర్లలో వరుణ్‌ చక్రవర్తి, వైభవ్‌ అరోరాలు రెండేసి వికెట్లు పడగొట్టారు. సునీల్‌ నరైన్‌, కామెరూన్‌ గ్రీన్‌ స్వల్ప స్కోర్ల మ్యాచ్‌లో పరుగులు కట్టడి చేసి బ్యాటర్లపై ఒత్తిడి పెంచారు.

రింకు సింగ్‌ ఒక్కడే
తొలుత బ్యాటింగ్‌ చేసిన కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు ఏదీ కలిసి రాలేదు. లక్నో సూపర్‌జెయింట్స్‌ బౌలర్‌ మోషిన్‌ ఖాన్‌ (5/23) ఐదు వికెట్ల ప్రదర్శనతో నిప్పులు చెరిగాడు. దీంతో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ బ్యాటింగ్‌ లైనప్‌ కుప్పకూలింది. ఓపెనర్లు టిమ్‌ సీఫర్ట్‌ (0), అజింక్య రహానె (10), రఘువంశీ (9), రోవ్‌మాన్‌ పావెల్‌ (1), అనుకూల్‌ రారు (0), రమణ్‌దీప్‌ సింగ్‌ (6), సునీల్‌ నరైన్‌ (4 నాటౌట్‌) తేలిపోయారు. 11 ఓవర్లలో 73 పరుగులకు 6 వికెట్లు కోల్పోయిన కోల్‌కతా నైట్‌రైడర్స్‌ వంద పరుగులు చేసినా గొప్పే అనిపించింది. ఈ దశలో రింకు సింగ్‌ (83 నాటౌట్‌) ఒంటరి పోరాటం చేశాడు. ఆరు ఫోర్లు, ఓ సిక్సర్‌తో 42 బంతుల్లో అర్థ సెంచరీ సాధించాడు. కామెరూన్‌ గ్రీన్‌, రమణ్‌దీప్‌ సింగ్‌, సునీల్‌ నరైన్‌లు తడబడినా… ఈ ముగ్గురితో రింకు సింగ్‌ వరుసగా 42, 20, 62 పరుగుల భాగస్వామ్యాలు నిర్మించాడు. దీంతో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ 20 ఓవర్లలో 7 వికెట్లకు 155 పరుగులు చేసింది. సహచర బ్యాటర్లు పరుగులు చేసేందుకు ఆపసోపాలు పడిన పిచ్‌పై రింకు సింగ్‌ బాధ్యతాయుత బ్యాటింగ్‌తో ఆకట్టుకున్నాడు. ఐదు సిక్స్‌లు, ఏడు ఫోర్లతో అజేయంగా 83 పరుగులు చేశాడు. ఇన్నింగ్స్‌ ఆఖరు రెండు ఓవర్లలో 43 పరుగులు పిండుకున్న రింకు సింగ్‌.. ఇరు జట్ల మధ్య వ్యత్యాసంగా నిలిచాడు. ఆఖరు ఓవర్లో 26 పరుగులు ఇచ్చిన సూపర్‌జెయింట్స్‌.. అందుకు భారీ మూల్యమే చెల్లించుకుంది.
సంక్షిప్త స్కోరు వివరాలు
కోల్‌కతా నైట్‌రైడర్స్‌ : 155/7 (రింకు సింగ్‌ 83 నాటౌట్‌, కామెరూన్‌ గ్రీన్‌ 34, మోషిన్‌ ఖాన్‌ 4/23, జార్జ్‌ లిండె 1/18)
లక్నో సూపర్‌జెయింట్స్‌ : 155/8 (రిషబ్‌ పంత్‌ 42, ఎడెన్‌ మార్‌క్రామ్‌ 31, ఆయుశ్‌ బదొని 24, వైభవ్‌ అరోరా 2/24, వరుణ్‌ చక్రవర్తి 2/33)

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -