Monday, April 27, 2026
E-PAPER
Homeప్రధాన వార్తలుబహుముఖ పోరాటాలతోనే కుల నిర్మూలన

బహుముఖ పోరాటాలతోనే కుల నిర్మూలన

- Advertisement -

సోషలిస్ట్‌ వ్యవస్థ కుల నిర్మూలనతోనే సాధ్యం
దీనికోసం సాంస్కృతికరంగం
ముఖ్య భూమిక పోషించాలి
అన్ని సంఘాలతో కలిసి
ప్రభుత్వంపై ఒత్తిడి తెద్దాం : కేవీపీఎస్‌ సాంస్కతిక ఉత్సవాల ముగింపు సభలో బీవీ రాఘవులు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

కుల భావన, సిద్ధాంతాలకు వ్యతిరేకంగా పోరాడాలని దళిత్‌ శోషణ్‌ ముక్తిమంచ్‌ (డీఎస్‌ఎంఎం) జాతీయ కార్యదర్శి బీవీ రాఘవులు పిలుపునిచ్చారు. కుల నిర్మూలన జరగకుండా మానవ సమానత్వం సాధ్యంకాదనీ, అది జరక్కుండా సోషలిస్ట్‌ వ్యవస్థ సాధ్యం కాదని స్పష్టంచేశారు. కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం (కేవీపీఎస్‌) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.స్కైలాబ్‌బాబు అధ్యక్షతన ఆదివారం హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో రాష్ట్ర స్థాయి కులరహిత సమానత్వ సాంస్కృతిక ఉత్సవాల ముగింపు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా రాఘవులు మాట్లాడుతూ బహుముఖ పోరాటాలతోనే కుల నిర్మూలన జరుగుతుందన్నారు. దానికోసం కుల నిర్మూలన కోరుకునే సంఘాలన్నీ ఐక్యంగా ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు కార్యాచరణ చేపట్టాలని పిలుపునిచ్చారు. దేశంలో మతాలు మారినా, పాలకులు మారినా, స్వాతంత్య్రం తర్వాత పాలించే పార్టీలు మారినా కుల వ్యవస్థ పోలేదని తెలిపారు. కులం పునాది, దాని వేర్లు చాలా వైపులా వ్యాపించి ఉన్నాయనీ, దాన్ని ప్రజల మనసుల్లో నుంచి పెకళించి వేయడం అంత సులభం కాదన్నారు. విజ్ఞాన సమాజం, విద్యావంతులు ఉండే హైదరాబాద్‌ లాంటి మహానగరంలో కూడా కుల వివక్ష కనిపిస్తుందంంటే కుల నిర్మూలన లక్ష్యానికి ఎంత దూరంలో ఉన్నామో అర్థం చేసుకోవాలని అన్నారు.
”కుల భావనకు, కుల సిద్ధాంతాలకు వ్యతిరేకంగా పోరాడాలి. కులం దైవ సృష్టి. అది సమాజ సామరస్యతకు ఉపయోగం. కులం పాటించడం నా జన్మహక్కు… అనే ఆలోచనలను కులం వల్ల ప్రయోజనం ఉన్న కొంత మంది వ్యాపింపజేస్తున్నారు. అలాంటి వారికి కులం వల్ల లాభం లేకుండా చేయాలి. కులవ్యవస్థ ఉంటే తక్కువ వేతనంతో కూలీలు దొరుకుతారు. కార్మికులను, రైతులను విభజించి భూస్వాములు, యజమానులు లాభపడతారు. 1857 వరకు సంస్కరణలకు ప్రయత్నించిన బ్రిటీష్‌ పాలకులు కులంలో వారి ప్రయోజనం చూసుకుని వదిలేశారు. ముస్లీం పాలకుల హయాంలోనూ అదే జరిగింది. స్వాతంత్రం తర్వాత పాలించే పార్టీలు మారినా, కులవ్యవస్థ కొనసాగుతూనే ఉంది. అధికారం, దోపిడీ, పని చేయకుండే సంపద పోగు చేసుకునే వారికి కులంతో లాభం. కులం తనంతట తాను పోదు. ఆ భావజాలాన్ని బద్ధలు కొట్టాలి. అన్ని రంగాల్లోనూ కుల నిర్మూలన కోసం ప్రయత్నాలు జరగాలి. సాంస్కతిక రంగం ఈ దిశగా ఎక్కువ ప్రయత్నాలు చేయాలి. కుల వ్యవస్థపై పోరాటమే అంబేద్కర్‌కు నిజమైన నివాళి. వాయిద్యాలు, జానపద పాటలు నిరక్ష్యరాస్యులైన గ్రామీణుల నుంచి వచ్చాయి. వాటిని వారి కోసమే ఉపయోగించాలి. శతృవు వాటిని కుల వ్యవస్థను కాపాడుకునేందుకు ఉపయోగిం చుకుంటున్నారు. దాన్ని తిప్పికొట్టాలి. అన్ని కులాలు సమానమే అయినప్పుడు అసలు కులమెందుకు? కుల సామరస్యత అనేది బోగస్‌. కుల నిర్మూలనే జరగాలి. అంబేద్కర్‌ కుల నిర్మూలన అంశాన్ని రాజ్యాంగంలో చేర్చేందుకు ప్రయత్నిస్తే నాడు అడ్డుకున్నారు” అని రాఘవులు తన ప్రసంగంలో స్పష్టంచేశారు.

వ్యతిరేక శక్తులను గద్దె దించాలి-జాన్‌వెస్లీ
కులరహిత సమాజ వ్యతిరేక శక్తులను గద్దె దించితేనే కుల నిర్మూలన సాధ్యమవుతుందని కేవీపీఎస్‌ రాష్ట్ర అధ్యక్షులు జాన్‌వెస్లీ తెలిపారు. కులరహిత సమ సమాజం కోసం అందరం కలిసి కట్టుగా పోరాడుదామన్నారు. కుల వ్యవస్థ వద్దంటున్న శక్తులన్ని సంఘటితం కావాలని ఆకాంక్షించారు. నెల రోజులుగా కేవీపీఎస్‌ గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు అనేక కార్య క్రమాలను చేపట్టిందని తెలిపారు. ఆర్‌ఎస్‌ఎస్‌, బీజేపీలు కులాన్ని పెంచిపోషి స్తున్నాయని విమర్శించారు. అంటరానితనం, కుల వ్యవస్థ నిర్మూలించాలని అంబేద్కర్‌ రాజ్యాంగాన్ని ఇస్తే, దాన్నే మార్చాలనీ, నిర్వీర్యం చేయాలనీ, ఇచ్చిన హక్కులను కాలరా యాలనీ, సామాజిక ఉద్యమాలను అణచివేస్తూ, ప్రక్కదారి పట్టిస్తూ మత రాజకీయాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కులరహిత సమాజం కోసం పోరాడే శక్తులు, దోపిడీ రహిత సమాజం కోసం కలిసి రావాలని కోరారు. ఆ దిశగా ఒక కార్యాచరణ రూపొందించుకుని కేవీపీఎస్‌ ముందుకెళ్తుందన్నారు.

బానిస వ్యవస్థకు కులమే కారణం-జేబీ రాజు
భారతదేశంలో బానిస వ్యవస్థకు కులమే కారణమనీ, ఆ కులం పోకుండా సమానత్వం సాధ్యం కాదని ప్రముఖ అంబేద్కర్‌ వాది జే.బీ.రాజు అన్నారు. కుల నిర్మూలనను ఒక ఉద్యమంగా ప్రతి గ్రామంలోకి తీసుకెళ్లాలని సూచించారు. మహద్‌ పోరాటం చేసి మను ధర్మశాస్త్రాన్ని తగులబెట్టిన అంబేద్కర్‌ సంఘ సంస్కర్త మాత్రమే కాదనీ, ఆయనో సామాజిక విప్లవకారుడని చెప్పారు. మార్క్స్‌ ఆశించిన సమ సమాజాన్ని సాధించేందుకు, కుల నిర్మూలన కోసం కేవీపీఎస్‌ చేపట్టిన కార్యాచరణను ఆయన అభినందించారు. సామాజిక విప్లవంతోనే రాజకీయ విప్లవం వస్తుందన్నారు.

కుల నిర్మూలనకు ప్రయత్నించాలి- డాక్టర్‌ అప్పికట్ల భరత్‌ భూషణ్‌
కులరహిత సమాజం కోసం ప్రయత్నించాలని రిటైర్డ్‌ ఐఆర్టీఎస్‌ అధికారి డాక్టర్‌ అప్పికట్ల భరత్‌ భూషణ్‌ సూచించారు. ఈ సందర్భంగా ఆయన తన అనుభవాలను ప్రస్తావించారు. కులరహిత సమాజం ఒక భ్రమ అనిపిస్తున్నా, దాని నిర్మూలనా ప్రయత్నం ఆపకూడదన్నారు. దానికోసం పోరాడేవారికి మద్దతు ఇవ్వాలన్నారు. నేటితరంలోని అణగారిన వర్గాలకు పుచ్చలపల్లి సుందరయ్య లాంటి నాయకులు అవసరమని చెప్పారు.

కుల వివక్ష రూపం మార్చుకుంది-స్కైలాబ్‌బాబు
కుల వివక్ష రూపం మార్చుకుందే తప్ప సమాజం నుంచి పూర్తిగా తొలగిపోలేదని కేవీపీఎస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.స్కైలాబ్‌బాబు అన్నారు. గ్రామాల్లో ప్రత్యక్షంగా, పట్టణాల్లో పరోక్షంగా కనిపిస్తూనే ఉందన్నారు. కులాంతర వివాహాలు చేసుకున్న వారి పట్ల కులదుహరంకార హత్యలు, దాడులు జరుగుతున్నా, హిందూ సమ్మేళనాలు నిర్వహిస్తున్న నాయకులు ఎందుకు మాట్లాడరని ప్రశ్నించారు. గరికపాటి నరసింహారావు, చినజీయర్‌ స్వామిలు కులాన్ని పొగుడ్తూ మాట్లాడే మాటలను స్కైలాబ్‌బాబు ఎండగట్టారు. కులం లేని సమాజం కోసం కమ్యూనిస్టులు, ప్రగతిశీల శక్తులు, ఇతరులు కలిసి రావాలని కోరారు. కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీలు పేదలు, దళితులు, అణగారిన వర్గాలకు ఇచ్చిన హామీలు అమలు చేయకుండా అణచివేస్తున్నాయని విమర్శించారు. దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా వర్తించదని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై కేంద్ర ప్రభుత్వమే ధర్మాసనానికి వెళ్లాలని సూచించారు. హిందూ సమ్మేళనాల్లో మనిషిని మనిషిగా గుర్తిస్తారా? అని ప్రశ్నించారు. కుల నిర్మూలన కోసం గ్రామ స్థాయి నుంచి ఇతర సంఘాలతో కలిసి ఐక్య ఉద్యమాలు చేస్తామన్నారు.

కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ చెరుపల్లి సీతారాములు, కల్చరల్‌ కమాండర్‌ మాస్టార్జీ, ఎస్‌సీజెడ్‌ఐఈఎఫ్‌ నాయకులు తిరుపతయ్య, ఐద్వా రాష్ట్ర కార్యదర్శి మల్లు లక్ష్మి, ఏఐఏడబ్ల్యూయూ రాష్ట్ర కార్యదర్శి ఆర్‌.వెంకట్రాములు, టీపీఎస్కే రాష్ట్ర కన్వీనర్‌ జి.రాములు, సుందరయ్య విజ్ఞాన కేంద్రం కార్యదర్శి ఎస్‌. వినరు కుమార్‌, విజ్ఞాన దర్శిని రాష్ట్ర అధ్యక్షులు బొల్లి ఆదాంరాజ్‌, కల్లు గీత కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఎం.వి. రమణ, రజక వృత్తిదారుల సంఘం రాష్ట్ర కార్యదర్శి పైళ్ల ఆశయ్య, క్షౌర వృత్తిదారుల సంఘం రాష్ట్ర కార్యదర్శి చెన్నారం మల్లేష్‌, ప్రజా నాట్య మండలి రాష్ట్ర కార్యదర్శి కట్ట నరసింహా, డీవైఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్షులు కోట రమేశ్‌, ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర కార్యదర్శి టి.నాగరాజు, ఎన్పీఆర్డీ రాష్ట్ర కార్యదర్శి ఎం.అడివయ్య, తెలంగాణ సాహితి రాష్ట్ర సహాయ కార్యదర్శి సలీమా, బంధు సొసైటీ అధ్యక్షులు పల్లాల వీరస్వామి, అంబేద్కర్‌ యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు సీహెచ్‌. అవిలయ్య, ప్రముఖ వైద్యులు డాక్టర్‌ రామస్వామి, కుల నిర్మూలన సంఘం పూర్వ అధ్యక్షులు సీఎల్‌ఎన్‌ గాంధీ, మాదిగ ఇంటలెక్చువల్‌ ఫోరం రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్‌ అవినాష్‌ రాజేందర్‌, డీబీఎఫ్‌ జాతీయ కార్యదర్శి పి.శంకర్‌, రిటైర్డ్‌ వైద్య ఉద్యోగి, ప్రముఖ విశ్లేషకులు శివకుమార్‌, టీజేఎసీ కన్వీనర్‌ కోల జనార్దన్‌, టీజీఎస్‌ రాష్ట్ర కార్యదర్శి ఆర్‌.శ్రీరాంనాయక్‌, జై భీమ్‌ మహాసేన, జాతీయ అధ్యక్షులు రాజ్యాంగం అంజన్న, జైభీమ్‌ రాజ్యాంగం మహాసేన రాష్ట్ర అధ్యక్షులు గట్టు అశోక్‌, నో క్యాస్ట్‌ ఇండియా అధ్యక్షులు విప్లవ్‌ తదితరులు మాట్లాడారు.
సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్‌, కేవీపీఎస్‌ రాష్ట్ర ఆఫీసు బేరర్లు పాలడుగు నాగార్జున, మీసాల కురుమయ్య, మస్ను ప్రకాశ్‌ కరత్‌, తిప్పారపు సురేష్‌, పెద్దావురం అశోక్‌, దుర్గం దినకర్‌, మంద సంపత్‌, ఉప్పులి మల్కయ్య, నిర్వహణ కమిటీ ఎం. మహేందర్‌, బి. సుబ్బారావు, ఎం.కపాసాగర్‌, ఎన్‌. బాలపీరు, దర్శనం రమేష్‌, ఎం. శ్రావణ్‌కుమార్‌, మద్దిమడుగు వెంకటేష్‌ తదితరులు పాల్గొన్నారు.

మతం మారినా కులం పోలేదు-మహ్మద్‌ అబ్బాస్‌
భారతదేశంలో కులానికి వ్యతిరేకంగా వచ్చిన ఇస్లాం, క్రైస్తవ మతాలు, భక్తి ఉద్యమాలతో పాటు విదేశాల్లోకి కూడా కులం వచ్చి చేరిందని ఆవాజ్‌ రాష్ట్ర కార్యదర్శి మహ్మద్‌ అబ్బాస్‌ ఆందోళన వ్యక్తం చేశారు. సనాతనమే మనువాదమనీ, అదే కులవ్యవస్థకు పునాది అనీ, సమాజ అసమానతలకు కూడా అదే మూలమని వివరించారు. రాజ్యాంగం మత స్వేచ్ఛనిస్తే, దాన్ని అమలు చేయాల్సిన పాలకులు దానికి విరుద్ధంగా బలవంతపు మతమార్పిడుల పేరుతో ఆ స్వేచ్ఛను హరిస్తున్నారని విమర్శించారు. కుల నిర్మూలన కోసం కేవీపీఎస్‌తో కలిసి పోరాడుతామన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -