నవతెలంగాణ – ఆత్మకూరు
హనుమకొండ జిల్లా ఆత్మకూరు మండలం గుడెప్పాడ్ వ్యవసాయ మార్కెట్ (హాకా)లో రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. హైదరాబాద్ అగ్రికల్చర్ కో-ఆపరేటివ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మక్కలు కొనుగోలు కేంద్రానికి ప్రభుత్వం టెండర్‌ను గుత్తేదారు పి.శ్రీనివాస్ కు కేటాయించారు. సోమావారం నుంచి మొక్కలు కొనుగోలు పూర్తిగా ఆగిపోయింది. ఆరుకాలం కష్టపడి పండించిన పంటను మార్కెట్‌కు తీసుకొచ్చిన రైతులు లారీలు రావడం లేదు, స్టాక్ పెట్టే స్థలం లేదు, సాకులు చెప్పి ఇబ్బంది పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
అధికారులకు విన్నవించినా ఫలితం లేకపోవడంతో, రైతులు ఏకంగా 163వ జాతీయ రహదారిపై కూర్చుని ధర్నా చేశారు. హాకా అధికారుల నిర్లక్ష్యం, గతంలో లేని విధంగా నూతన సోసైటీ పెట్టి రైతులను విస్మరించడం తగునా? అని తీవ్రంగా ప్రశ్నిస్తున్నారు. హాకా అధికారులు రైతుల రక్తాన్ని ఆర్థిక ప్రయోజనాలకు బలిగా చేస్తున్నారా? ఈ ప్రశ్నకు సమాధానం ఇవ్వాల్సిన అధికారులు మౌనంగా ఉన్నారు.
వెంటనే జిల్లా ఉన్నతాధికారులు స్పందించి మక్కలు కొనుగోలు చేపట్టాలని రైతులు డిమాండ్ చేశారు. స్థానిక పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని రైతులను శాంతింపజేసి ధర్నా ముగింపజేశారు. అయితే, ఈ సంఘటనపై వివరణ కోరినా హాకా అధికారి సుదర్శన్ రెడ్డి ఫోన్లు రిసీవ్ చేయడం లేదు. రైతుల ఆకలి, ఇబ్బందులు పట్టించుకోకుండా అధికారులు ఎంతసేపు మౌనం పాటిస్తారు.?



