కొనుగోలు కేంద్రాల ఏర్పాటులో మార్క్‌ఫెడ్ విఫలం
నవతెలంగాణ – మహబూబ్‌నగర్ ప్రాంతీయప్రతినిధి
ఈఏడాది అంచనాలకు మించి మొక్కజొన్న పంట దిగుబడి వచ్చింది. మార్కెట్లు, రోడ్లు ఎక్కడ చూసినా మక్క నిల్వలు కనిపిస్తున్నాయి.. దిగుబడికి సరిపడా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం.. కాంటాలు పెట్టడంలో మార్క్‌ఫెడ్ విఫలమైందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. మొదట మండలానికి ఒక కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేస్తామని చెప్పి సగం మండలాల్లోనే పెట్టారు. ఎటు చూసినా మొక్కజొన్నల కుప్పలు, లోడైన ట్రాక్టర్లు, లారీలు కనిపిస్తున్నాయి. కాంటాలు కాక రైతులు కల్లాల్లోనే కావలి ఉంటున్నారు. వర్శం వస్తే.. ఊహించని రీతిలో మక్కలకు నష్టం వాటిల్లే అవకాశాలున్నాయని రైతు సంఘాల నాయకులు తెలిపారు.
నాగర్‌కర్నూల్ జిల్లాలో లక్షా 80 వేల ఎకరాలు సాగు కాగా, వనపర్తి జిల్లాలో 2,41,516 ఎకరాల్లో వేశారు. గద్వాలలో 496 ఎకరాలు, మహబూబ్‌నగర్ జిల్లాలో 37700 ఎకరాలు, నారాయణపేట జిల్లాలో 1.42 లక్షల ఎకరాలలో మొక్కజొన్న సాగు చేశారు. ఎర్ర, నల్ల భూముల్లో ఎకరాకు 40 క్వింటాళ్ల దాక పంట దిగుబడి వచ్చింది. నాగర్‌కర్నూల్ మార్కెట్‌లో ఇప్పటి వరకు మార్క్‌ఫెడ్ ద్వారా 6199 మంది రైతుల నుంచి 7,47,867 బ్యాగులు అంటే 8445 మెట్రిక్ టన్నుల మొక్కలను కొనుగోలు చేశారు. నాగర్‌కర్నూల్ మార్కెట్ ఇప్పటికే నిండిపోయింది. కాలు పెట్టసందు లేకుండా మక్కలు పోశారు. గన్నీ బ్యాగులు అందుబాటులో లేవు. హామాలీలు సరిపడా లేరు. చెరువు సమీపంలో ఉండటంతో వర్షం వస్తే.. చెరువు నీళ్లు మార్కెట్‌లోకి వచ్చే అవకాశాలు ఉండటంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
మార్కెట్ నిండింది.. మొక్కజొన్న తేవద్దు
నాగర్‌కర్నూల్ మార్కెట్‌లో మక్కలు పోయడానికి స్థలం లేదు. ఇప్పుడే పంటను తీసుకురావొద్దు.. నాలుగైదు రోజులు ఆగి మొక్కజొన్న తీసుక రావాలి. రైతులు ఇంటిదగ్గర తమ కల్లాల్లోనే మొక్కజొన్న పంట వర్షాలకు తడవకుండా జాగ్రత్తగా ఉంచాలి. నాగర్‌కర్నూల్ నియోజ కవర్గంలోనే అధికంగా కొనుగోలు చేశాం. మార్క్‌ఫెడ్ కొనుగోలు కేంద్రాలలో గన్ని బ్యాగులు, హమాలీల కొరత తీర్చి రైతులకు మొక్కజొన్న కొనుగోళ్లకు వీలు కల్పిస్తున్నాం. పండించిన ప్రతి గింజనూ కొనుగోలు చేస్తాం.-తమీణ, మార్క్‌ఫెడ్ ఎండీ, నాగర్‌కర్నూల్ జిల్లా
మార్కెట్‌లో రోడ్ల నిండా మక్కలే..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



