Wednesday, April 29, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంఇందిరమ్మ ఇండ్లపై కలెక్టర్లకు మరిన్ని అధికారాలు

ఇందిరమ్మ ఇండ్లపై కలెక్టర్లకు మరిన్ని అధికారాలు

- Advertisement -

దరఖాస్తు ఎప్పుడు చేసుకున్నా
అర్హత ఉంటే ఇల్లు ఇస్తాం
ఇండ్ల మంజూరు నిరంతర ప్రక్రియ
ఉమ్మడి జిల్లాలకు ప్రత్యేక అధికారులు
సాదాబైనామాలపై ఆర్డీవోలదే తుది నిర్ణయం
తహశీల్దార్‌ కార్యాలయాలకు నూతన భవనాలు
ప్రతి జిల్లా కేంద్రంలో అత్యాధునిక వసతులతో సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయం
సర్వేతోనే భూవివాదాలకు శాశ్వత పరిష్కారం : మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని మరింత వేగవంతంగా , పారదర్శకంగా అమలు చేయడానికి అధికార వికేంద్రీకరణ చేసి జిల్లా కలెక్టర్లకు మరిన్ని బాధ్యతలు అప్పగిస్తున్నట్టు రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార పౌరసంబంధాల శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఈ పథకానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని జిల్లా హౌసింగ్‌ అధికారులతో ప్రతి వారం సమీక్షించాలని కలెక్టర్లను ఆదేశించారు. ప్రజా ప్రతినిధులతో సమన్వయం చేసుకుని, ఎక్కడ ఎలాంటి సమస్యలు రాకుండా చూడటానికి ప్రతి ఉమ్మడి జిల్లాకు ఒక ప్రత్యేక అధికారిని నియమిస్తున్నట్టు వెల్లడించారు. సోమవారం హౌసింగ్‌, రెవెన్యూ అంశాలపై హైదరాబాద్‌లోని హౌసింగ్‌ కార్పొరేషన్‌ ప్రధాన కార్యాలయంలో ఉమ్మడి నిజామాబాద్‌, ఆదిలాబాద్‌ జిల్లాల ఇన్‌ఛార్జి మంత్రులు, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, జిల్లా కలెక్టర్లు, అడిషనల్‌ కలెక్టర్లు, హౌసింగ్‌ అధికారులతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. నియోజకవర్గాల వారీగా సమీక్ష నిర్వహించారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు ప్రస్తావించిన అంశాలపై అక్కడికక్కడే స్పందించి తగిన ఆదేశాలు ఇచ్చారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఇందిరమ్మ ఇండ్ల మంజూరు అనేది నిరంతర ప్రక్రియ అని తెలిపారు. గతంలో దరఖాస్తు చేసుకోని వారు, ఇప్పుడు దరఖాస్తు చేసుకున్నా అర్హత ఉంటే మంజూరు చేస్తామని తెలిపారు. ప్రజా ప్రతినిధులు ఇచ్చిన సూచనలు, సలహాలను కూడా పరిగణన లోనికి తీసుకుంటామని చెప్పారు. వారు కూడా ఈ అంశంపై విస్తృతంగా భాగస్వామ్యులు కావాలని కోరారు. రాజకీయాలకు అతీతంగా నియోజకవర్గానికి 3,500 ఇండ్లను మంజూరు చేశామనీ, ఆయా లబ్ధిదారులు త్వరితగతిన ఇండ్లను నిర్మించుకునేలా ఎమ్మెల్యేలు ప్రత్యేక చొరవ చూపాలని అన్నారు. వివిధ కారణాలతో ఇండ్లు నిర్మించుకోలేని వారు, తమకు ఇల్లు అవసరం లేదని తెలియచేస్తే వారి స్థానంలో మరొకరికి కేటాయించాలని మంత్రి సూచించారు. ఇంటి బేస్‌మెంట్‌ నిర్మాణం పూర్తి అయిన తరువాత లక్ష రూపాయలు మంజూరు చేయాలన్నారు. అయితే వివిధ సాంకేతిక కారణాలతో బిల్లులు రానివారికి తక్షణమే నిధులు విడుదల చేయాలని అధికారులను ఆదేశించారు. పేదల అభివృద్ధి, సంక్షేమం విషయంలో అధికారులు మానవతా ధృక్పథంతో వ్యవహరించాలని సూచించారు.
గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అక్కడక్కడా నిర్మించి, అసంపూర్తిగా వదిలేసిన డబుల్‌ బెడ్‌ రూం ఇండ్లను పూర్తి చేయాలనీ, అలాగే మంచినీరు, కరెంటు, డ్రైనేజి వంటి మౌలిక వసతులను కల్పించాలని సూచించారు. ఇండ్లు ఏ స్థాయిలో ఉన్నా తక్షణమే లబ్ధిదారులకు కేటాయించాలని అధికారులను ఆదేశించారు. పట్టణ ప్రాంతాల్లో స్థలాల కొరతను దృష్టిలో పెట్టుకుని 400 చదరపు అడుగులకు తగ్గకుం డా, 600 చదరపు అడుగులకు మించకుండా జి ప్లస్‌ వన్‌ పద్ధతిలో ఇండ్లను నిర్మించుకునేలా వెసులుబాటు కల్పించామని చెప్పారు.

భూ సర్వేతోనే పరిష్కారం
భూసర్వేతోనే భూవివాదాలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందనీ, ఈ దిశగా ప్రభుత్వం ఇప్పటికే చర్యలు చేపట్టిందని మంత్రి తెలిపారు. రాష్ట్రంలోని ఐదు మండలాల్లో ప్రయోగాత్మకంగా సర్వే మ్యాపుతో రిజిస్ట్రేషన్‌ చేస్తున్నామనీ, రిజిస్ట్రేషన్‌ పూర్తి అయిన తరువాత సర్వే మ్యాపు నెంబరు, భూదార్‌ నెంబరును కేటాయిస్తున్నట్టు తెలిపారు. సాదాబైనామాలకు సంబంధించి వీలైనంత త్వరగా దరఖాస్తులను పరిష్కరిస్తామని వివరించారు. కొనుగోలుదారుడు ఒక్కడే డిక్లరేషన్‌ ఇస్తే సరిపోతుందనీ, ఈ దరఖాస్తుల పరిష్కారాన్ని మరింత వేగవంతం చేయడానికి వీలుగా ఆర్డీవోలకే అధికారాలను దఖలు పరిచినట్టు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా దశలవారీగా, తహశీల్దార్‌ కార్యాలయాలను నిర్మిస్తామని పొంగులేటి చెప్పారు. తొలి విడత లో శిధిలావస్థకు చేరిన ఆఫీసులను తొలగించి వాటి స్థానంలో కొత్తవి నిర్మిస్తామని మంత్రి వెల్లడించారు. అలాగే ప్రతి జిల్లా కేంద్రంలో అత్యాధునిక వసతులతో సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాల యాలను నిర్మిస్తున్నట్టు తెలిపారు. ఇందుకు అవసరమైన ప్రతిపా దనలను రూపొందిం చాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. దశాబ్దాల నుంచి రెవెన్యూ, ఫారెస్టు, ఎండోమెంట్‌, వక్ఫ్‌ మధ్య సరిహద్దు వివాదాలు ఉన్నాయనీ, ఉమ్మడి సర్వే నిర్వహించి ఇలాంటి సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలని ఆదేశించారు. సమీక్షలో నిజామాబాద్‌ ఇంఛార్జి మంత్రి ధనసరి అనసూయ (సీతక్క), ఆదిలాబాద్‌ ఇంఛార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు, మంత్రి జి.వివేక్‌, ప్రభుత్వ సలహాదారులు పి.సుదర్శన్‌ రెడ్డి, పోచారం శ్రీనివాస రెడ్డి, మహ్మద్‌ షబ్బీర్‌ అలీ, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, రెవెన్యూ కార్యదర్శి డి.ఎస్‌. లోకేష్‌ కుమార్‌, హౌసింగ్‌ సెక్రెటరీ వి.పి.గౌతం తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -