ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య
నవతెలంగాణ – ఆలేరు రూరల్
గోలనుకొండ గ్రామం భక్తి కేంద్రంగా అభివృద్ధి చెందుతోందని ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య తెలిపారు. బుధవారం ఆలేరు మండలం గోలనుకొండ గ్రామంలో నవగ్రహ విగ్రహాల ప్రతిష్ఠాపనతో పాటు అభయ ఆంజనేయ స్వామి విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య తన సతీమణి, బీర్ల ఫౌండేషన్ చైర్‌పర్సన్ బీర్ల అనితతో కలిసి కుటుంబ సమేతంగా హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమానికి ముందు ఆయన కుటుంబ సభ్యులతో కలిసి గ్రామంలోని శ్రీ శంభులింగేశ్వర స్వామి దేవాలయాన్ని దర్శించుకుని స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు చేశారు. అనంతరం శాస్త్రోక్తంగా నవగ్రహ విగ్రహాలు, అభయ ఆంజనేయ స్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠించి భక్తులకు దర్శనార్థం అందుబాటులో ఉంచారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామాల్లో ఆధ్యాత్మికతను పెంపొందించేందుకు ఇలాంటి కార్యక్రమాలు ఎంతో దోహదపడతాయని అన్నారు. గోలనుకొండను భక్తి కేంద్రంగా తీర్చిదిద్దుతున్నామని పేర్కొన్నారు. ప్రజలలో ఐక్యత, శాంతి, సౌభ్రాతృత్వం పెంపొందించడంలో దేవాలయాల పాత్ర కీలకమని తెలిపారు.
అనంతరం బీర్ల ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్మించిన నూతన అతిథి గృహాన్ని ఆయన ప్రారంభించారు. గ్రామానికి వచ్చే భక్తులు, సందర్శకులకు సౌకర్యవంతంగా ఉండేలా ఈ అతిథి గృహాన్ని నిర్మించినట్లు తెలిపారు. గ్రామాభివృద్ధికి బీర్ల ఫౌండేషన్ ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందని స్పష్టం చేశారు. కార్యక్రమంలో టిపిసిసి రాష్ట్ర అధికార ప్రతినిధి జనగాం ఉపేందర్ రెడ్డి, సర్పంచ్ ఇందూరి యాదిరెడ్డి, ఉప సర్పంచ్ బాకీ యాదగిరి, శివాలయ కమిటీ చైర్మన్ లగ్గని కుమార్, మాజీ ఎంపీటీసీ లక్ష్మీ రామ్ మల్లయ్య, ఏజీపీ హరిబాబు, గ్రామ శాఖ అధ్యక్షులు భీమగాని శ్రీనివాస్, స్థానిక ప్రజాప్రతినిధులు, గ్రామ పెద్దలు, భక్తులు, బీర్ల ఫౌండేషన్ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.



