Friday, May 1, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంఉస్మానియా ఆస్పత్రిలో అరుదైన చికిత్స

ఉస్మానియా ఆస్పత్రిలో అరుదైన చికిత్స

- Advertisement -

18 నెలల బాలునికి లివర్‌ ట్రాన్స్‌ప్లాంటేషన్‌
10 కిలోల బరువున్న చిన్నారికి.. 240 గ్రాముల లివర్‌ అమర్చిన వైద్యులు : వైద్యులను అభినందించిన ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్‌ రాజనర్సింహ

నవతెలంగాణ – గోషామహల్‌
ఉస్మానియా జనరల్‌ ఆస్పత్రి డాక్టర్లు మరోసారి తమ సత్తా చాటుకున్నారు. గ్లైకోజెన్‌ స్టోరేజ్‌ అనే అరుదైన డిసీజ్‌తో బాధపడుతున్న 18 నెలల చిన్నారికి లివర్‌ ట్రాన్స్‌ప్లాంటేషన్‌ శస్త్రచికిత్స విజయవంతంగా చేశారు. కేవలం 10 కిలోల బరువు ఉన్న బాలునికి.. సుమారు 14 గంటలపాటు శ్రమించి 240 గ్రాముల లివర్‌ అమర్చారు. ప్రస్తుతం బాబు ఆరోగ్యం నిలకడగా ఉందని శస్త్ర చికిత్స బృందానికి నేతృత్వం వహించిన డాక్టర్‌ మధుసూదన్‌ వెల్లడించారు. హైదరాబాద్‌కు చెందిన మహ్మద్‌ ఇర్ఫాన్‌-సాజియా దంపతుల 18 నెలల కుమారుడు అఫన్‌.. కొంతకాలంగా తీవ్ర ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నాడు. తరచుగా ఏడవడం.. మత్తుగా ఉండటం, పొట్ట ఉబ్బరం వంటి లక్షణాలతో ఉన్న బాలున్ని తల్లిదండ్రులు ఉస్మానియా ఆస్పత్రికి తీసుకొచ్చారు. డాక్టర్లు ఆ బాలున్ని పరీక్షించి, వైద్య పరీక్షలు చేయించారు. రక్తంలో షుగర్‌ లెవల్స్‌ చాలా తక్కువగా ఉండటం, కొవ్వు పదార్థాలు అధికంగా ఉండటం, కాలేయం అసాధారణంగా విస్తరించి ఉండటాన్ని గుర్తించారు. బాలుని సమస్యపై మరింత లోతుగా అధ్యయనం చేసి, అతను గ్లైకోజెన్‌ స్టోరేజ్‌ (టైప్‌-×××) అనే అరుదైన వ్యాధితో బాధపడుతున్నట్టుగా నిర్ధారించారు. ఈ వ్యాధి శరీరంలో గ్లైకోజెన్‌ను గ్లూకోజ్‌గా మార్చే ఎంజైమ్‌ లోపంతో ఏర్పడుతుందని, దీని కారణంగా శరీరంలో నిల్వ ఉన్న శక్తిని వినియోగించుకోలేకపోవడం, తరచూ హైపోగ్లైసీమియా, కాలేయం పెద్దగా అవడం, కండరాల బలహీనత వంటి సమస్యలు తలెత్తుతాయని డాక్టర్‌ మధుసూదన్‌ తెలిపారు. దీర్ఘకాలంలో గుండె, మెదడు, కండరాలపై కూడా ప్రభావం చూపే ప్రమాదం ఉంటుందన్నారు.

చిన్నారికి అప్పటికే పరిస్థితి విషమంగా మారడంతో వెంటనే లివర్‌ ట్రాన్స్‌ప్లాంటేషన్‌ చేయాలని డాక్టర్లు నిర్ణయించారు. చిన్నారి తండ్రి నుంచి కొంత భాగం లివర్‌ సేకరించి బాలుడికి అమర్చారు. డాక్టర్‌ మధుసూదన్‌ నేతృత్వంలోని సర్జికల్‌ గ్యాస్ట్రోఎంటరాలజీ విభాగానికి చెందిన వైద్యుల బృందం సుమారు 14 గంటల పాటు ఈ క్లిష్టమైన శస్త్రచికిత్స నిర్వహించి, బాబుకు పునర్జన్మను ప్రసాదించారు. చిన్నారి ఆరోగ్యం నిలకడగా ఉందని, ఇప్పటివరకు ఎలాంటి సంక్లిష్టతలూ లేకుండా కోలుకుంటున్నాడని డా.మధుసూదన్‌ వెల్లడించారు.
కార్పొరేట్‌ ఆస్పత్రుల్లో సుమారు రూ.50 లక్షల వరకూ బిల్లు వేసే ఈ సర్జరీని ప్రభుత్వ సహకారంతో రాజీవ్‌ ఆరోగ్యశ్రీ కింద ఉచితంగా చేశామని ఉస్మానియా సూపరింటెండెంట్‌ డాక్టర్‌ రాకేశ్‌ సహారు తెలిపారు. ట్రాన్స్‌ప్లాంటేషన్‌ అనంతరం అవసరమైన మందులను కూడా ప్రభుత్వం ఉచితంగా అందిస్తుందన్నారు. దేశంలో ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఇలాంటి శస్త్రచికిత్సలు చాలా అరుదుగా జరుగుతాయని, ముఖ్యంగా గ్లైకోజెన్‌ స్టోరేజ్‌ డిసీజ్‌ వంటి అరుదైన వ్యాధులకు లివర్‌ ట్రాన్స్‌ప్లాంటేషన్‌ నిర్వహించడం వైద్య రంగంలో ఒక ముఖ్యమైన మైలురాయి అని డాక్టర్లు తెలిపారు.

మంత్రి అభినందనలు
కేవలం 10 కిలోల బరువున్న చిన్నారికి అత్యంత అరుదైన శస్త్రచికిత్స నిర్వహించి ప్రాణం కాపాడిన ఉస్మానియా డాక్టర్ల బృందాన్ని ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్‌ రాజనర్సింహ అభినందించారు. ప్రభుత్వ ఆస్పత్రుల డాక్టర్ల సామర్థ్యాన్ని మరోసారి నిరూపించారని కొనియాడారు. ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా పనిచేస్తున్న వైద్య సిబ్బందికి అభినందనలు తెలిపారు. ఆరోగ్యశ్రీ ద్వారా లక్షల మంది పేషెంట్లకు ఉచిత వైద్య సేవలు అందుతున్నాయని మంత్రి గుర్తు చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -