Wednesday, July 1, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంఉద్యమ కెరటం యార్లగడ్డ జోయ

ఉద్యమ కెరటం యార్లగడ్డ జోయ

- Advertisement -

నివాళులర్పించిన ప్రముఖులు, సీపీఐ(ఎం), ప్రజాసంఘాల నాయకులు
ఎన్‌ఐఆర్‌ ఆస్పత్రికి భౌతికకాయం అప్పగింత

తాడేపల్లి :
ఉద్యమ కెరటం యార్లగడ్డ జోయని, అనేక సందర్భాల్లో తన సత్తా చాటిన ఆమె ఓ తరానికి ఆదర్శ నేతగా నిలుస్తారని సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు తమ్మినేని వీరభద్రం అన్నారు. ఆమె భౌతికకాయాన్ని వీరభద్రంతోపాటు పలువురు ప్రముఖులు, సీపీఐ(ఎం), ప్రజాసంఘాల నాయకులు మంగళవారం సందర్శించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా గుంటూరు జిల్లా తాడేపల్లి బైపాస్‌ ‌రోడ్‌‌లోని అమరావతి ఐకాన్‌ ‌‘బి’ బ్లాక్‌ ‌వద్ద నిర్వహించిన సంతాప సభకు సీపీఐ(ఎం) కృష్ణా జిల్లా కార్యదర్శి డివి కృష్ణ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా తమ్మినేని వీరభద్రం మాట్లాడుతూ.. జోయతో తనకుగల అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. డబ్బు, పదవి, ప్రాణాలు మీద తీపి ఉన్నవాళ్లు కమ్యూనిస్టులుగా పనికిరారని, ఎనిమిది పదుల జీవితంలోనూ చివరిదాకా యర్లగడ్డ జోయ అత్యుత్తమ కమ్యూనిస్టుగా జీవించారని చెప్పారు. రాజకీయాలంటే సంపాదనగా మారిన ఈ రోజుల్లో ఎర్రజెండాకు జీవితం అంకితం చేసిన మహనీయురాలని కొనియాడారు. సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు మాట్లాడుతూ..

ధనిక కుటుంబంలో పుట్టి కడవరకూ పేదల కోసం, కష్టజీవుల కోసం, మహిళల కోసం, రైతాంగ సమస్యలపై జోయ పనిచేశారని అన్నారు. ఉమ్మడి కృష్ణా జిల్లాలో సుబాబుల్ రైతుల సమస్యలపైన, మద్దతు ధర కల్పించాలని పలు రాష్ట్రస్థాయి ఉద్యమాలకు ఆమె దిక్సూచిగా నిలిచారని తెలిపారు. నెల్లూరు జిల్లా ధూబగుంటలో ప్రారంభమైన సారా వ్యతిరేక ఉద్యమంలో నందిగామ ప్రాంతంలో ఆమె ముందుండి పనిచేశారని గుర్తు చేశారు. రైతు అదునుకు పైరు వేసినట్లు, కొత్త విత్తనాలు గుర్తించినట్లు, కార్యకర్తలను గుర్తించి తయారు చేయడంలో ఆమె దిట్టని కొనియాడారు. సామాజిక సేవా కార్యక్రమాల్లోనూ ఆమె పెద్ద ఎత్తున పాల్గొనే వారిని తెలిపారు. ఉద్యమాల్లో, పార్టీలో సీనియర్‌ అయినా, ఏ బాధ్యతల్లో ఉన్నాగాని ఒక సామాన్య కార్యకర్తగా, నిరాడంబరంగా మెలగటం ఆమె గొప్పతనానికి నిదర్శనమని చెప్పారు. మాజీ హోం మంత్రి వసంత నాగేశ్వరరావు మాట్లాడుతూ… ఒకే కుటుంబంలో వివిధ రకాల భావజాలం గల రాజకీయ పార్టీలున్న నేపథ్యం అరుదని, ఇలాంటి కుటుంబంలో జోయ.. చివరిదాకా కమ్యూనిస్టుగా ఉండటం గొప్ప విషయమని అన్నారు.

ప్రజాశక్తి ఎడిటర్ బి.తులసీదాస్ మాట్లాడుతూ… జోయ కమ్యూనిస్టుగా ఉండటమే గాక, కుటుంబంలో ప్రతి సందర్భంలో తనదైన ముద్ర వేసుకున్నారని అన్నారు. ప్రజాశక్తి పత్రిక తెప్పించటంలోనూ, చందాదారులకు సక్రమంగా అందుతుందా? లేదా? అని ఆరా తీసేవారని గుర్తు చేశారు. చనిపోయే ముందు వరకూ ఆమె ప్రజాశక్తి పత్రికను చదివేవారన్నారు. కృష్ణా జిల్లా పూర్వ కార్యదర్శి తులసీరావు.. జోయ ధీర వనిత అని, గొప్ప ఉద్యమ నాయకురాలని కొనియాడారు. పాల కేంద్రం డైరెక్టర్‌‌గా కేంద్రాన్ని ఎంతో అభివృద్ధి చేశారని, యువకులను పార్టీ సభ్యులుగా తీర్చిదిద్దడంతో పాటు తన కుటుంబం మొత్తాన్ని పార్టీ వైపు నడిపించారని చెప్పారు. ఐద్వా రాష్ట్ర కార్యదర్శి సావిత్రి మాట్లాడుతూ.. మహిళా సమస్యలపై నిరంతరం పనిచేయడంతో పాటు తనలాంటి వారిని పనిచేయించే విధంగా భవిష్యత్తు మార్గ నిర్దేశం చేశారని అన్నారు. రైతుసంఘం రాష్ట్ర నాయకులు వై.కేశవరావు మాట్లాడుతూ.. యార్లగడ్డ జోయ ధీర వనితని, రైతు ఉద్యమాల్లో ఆమె పని చేశారని గుర్తు చేసుకున్నారు. సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి సుబ్బరావమ్మ మాట్లాడుతూ… ప్రజలకు, కార్మిక వర్గానికి కష్టాలు వచ్చినప్పుడు వారి తరుపున ఎలా నిలబడి పనిచేయాలో ఆమె నుంచి నేర్చుకుందామని చెప్పారు.

ఎంసీపీఐ నాయకులు వెంకటరెడ్డి మాట్లాడుతూ.. జోయ గొప్ప అధ్యయనశీలి అని కొనియాడారు. వైసీపీ రాష్ట్ర కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ… సమాజం కోసం పనిచేసే అరుదైన వ్యక్తుల్లో జోయ ఒకరిని, భావితరాలు ఆమెను ఆదర్శంగా తీసుకోవాలన్నారు. వైసీపీ ఎమ్మెల్సీ అరుణ్ కుమార్ మాట్లాడుతూ… జోయ ఎప్పుడూ ప్రజల గురించే ఆలోచించేవారని, అసమానతలు లేని సమాజం కోసం పోరాడారని గుర్తు చేశారు. విజయవాడ ఎంబి విజ్ఞాన కేంద్రం కార్యదర్శి పిన్నమనేని మురళీకృష్ణ మాట్లాడుతూ… తాను యువజన సంఘంలో పనిచేస్తున్న రోజుల్లో జోయతో పనిచేసే అవకాశం కలిగిందని గుర్తు చేశారు. కష్టాలు, కన్నీళ్లు, ఒడిదుడుకులు ఎన్ని వచ్చినా ఎర్రజెండా నీడన నిలబడి మాకు అందరికీ ఆమె స్ఫూర్తినిచ్చారని కొనియాడారు. ప్రజాశక్తి ఎడిటోరియల్ బోర్డు సభ్యులు శాంతిశ్రీ మాట్లాడుతూ.. తమ కుటుంబంతో జోయా అమ్మకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. నివాళులర్పించిన వారిలో సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సిహెచ్ బాబూరావు, మహిళా నాయకులు పి.స్వరూపరాణి, పి.విజయతోపాటు కృష్ణా, గుంటూరు జిల్లాల నుంచి సీపీఐ(ఎం) , ప్రజాసంఘాల శ్రేణులు, జోయ పరిచయస్తులు, వివిధ పార్టీల నాయకులు ఉన్నారు. అందరికీ జోయ కుమారుడు, ప్రజాశక్తి సీజీఎం అచ్యుతరావు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం భౌతికకాయాన్ని మంగళగిరిలోని ఎన్ఆర్ఐ ఆస్ప్రతికి అప్పగించారు. అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి బి. వెంకట్‌, ఏఐకేఎస్‌ అఖిల భారత కార్యదర్శి విజ్జుకృష్ణన్‌, ‌సీపీఐ(ఎం) రాష్ర్ట కార్యదర్శి వర్గసభ్యులు ఉమా మహేశ్వరరావు, ఐద్వా రాష్ర్ట పూర్వ సహాయ కార్యదర్శి అరుణ సంతాపం తెలిపారు. కుటుంబసభ్యులకు తమ సానుభూతి తెలియజేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -