కేంద్ర మంత్రి
డాక్టర్ జితేంద్ర సింగ్
సీఎస్ఐఆర్-ఐఐసీటీలో అధునాతన ఆర్ అండ్ డీ కేంద్రాల ప్రారంభం
నవతెలంగాణ–ఉస్మానియా యూనివర్సిటీ
వికసిత్ భారత్–2047 లక్ష్య సాధనలో శాస్త్రీయ పరిశోధనలు, స్వదేశీ సాంకేతికతల అభివృద్ధి కీలక పాత్ర పోషిస్తాయని కేంద్ర శాస్త్ర, సాంకేతిక శాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. హైదరాబాద్ తార్నాకలోని సీఎస్ఐఆర్–ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ (ఐఐసీటీ)ని మంగళవారం ఆయన సందర్శించారు. 200 మంది విద్యార్థులకు వసతి కల్పించే ఆధునిక హాస్టల్ భవనానికి శంకుస్థాపన చేశారు. ఫ్లోరో కెమికల్స్ అడ్వాన్స్‌డ్ ఆర్‌అండ్‌డీ సెంటర్, టెక్స్ టైల్స్ పరిశ్రమ వ్యర్థ జలాల వికేంద్రీకృత శుద్ధి కేంద్రం, సస్టైనబుల్ ఇంజినీరింగ్ కాంప్లెక్స్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ.. పరిశోధనలను పరిశ్రమలకు ఉపయోగపడే విధంగా మార్చడం ద్వారా దేశ అర్థికాభివృద్ధిలో వేగం పెరుగుతుందన్నారు. స్వదేశీ సాంకేతికత అభివృద్ధి, స్టార్టప్ ప్రోత్సాహం, సాంకేతిక వాణిజ్యీకరణకు కేంద్ర ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందన్నారు.
దేశ అవసరాలకు అనుగుణంగా శాస్త్రవేత్తలు మరింత ప్రభావవంతమైన పరిశోధనలు చేపట్టాలని సూచించారు. నేటి ప్రపంచంలో వ్యర్థం అనేదే లేదని, రీసైక్లింగ్, వృత్తాకార ఆర్థిక వ్యవస్థ, వ్యర్థం నుంచి సంపద సృష్టించడమే భవిష్యత్‌కు అవసరమన్నారు. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయడంలో సీఎస్ఐఆర్-ఐఐసీటీ పాత్రను కొనియాడారు. ఐఐసీటీ డైరెక్టర్ డా. డి.శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. వికసిత్ భారత్ 2047, ఆత్మ నిర్భర్ భారత్, మేక్ ఇన్ ఇండియా లక్ష్యాలకు అనుగుణంగా ఐఐసీటీలో ప్రారంభించిన ప్లోరో కెమికల్స్ ఆధునాతన ఆర్అండీ కేంద్రం, వస్త్ర పరిశ్రమ వ్యర్థ జలాల వికేంద్రీకృత శుద్ధి కేంద్రం, సస్టైనబుల్ ఇంజినీరింగ్ పర్యావరణ సాంకేతికలలో భారత సామర్థ్యాలను మరింత బలోపేతం చేయడమే కాకుండా ఒక మైలురాయిగా నిలుస్తాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీఎస్ఐఆర్ ప్రయోగశాలలు డైరెక్టర్లు, ప్రముఖ శాస్త్రవేత్తలు, జాతీయ శాస్త్రీయ సంస్థల ప్రతినిధులు, పరిశ్రమల ప్రముఖులు, పరిశోధక విద్యార్థులు పాల్గొన్నారు.
శాస్త్రీయ పరిశోధనలే కీలకం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



