Wednesday, July 1, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంమోకిలలో గజం రూ.1.09 లక్షలు

మోకిలలో గజం రూ.1.09 లక్షలు

- Advertisement -

హెచ్‌ఎండీఏ వేలానికి అపూర్వ స్పందన
హాట్‌‌ కేకుల్లా అమ్ముడుపోయిన 
100 ప్లాట్లు
సగటు ధర రూ. 75,640గా నమోదు
అత్యల్పం రూ.66.500..
రెండ్రోజులపాటు కొనసాగిన 
ఆన్‌‌లైన్‌ ఈ-వేలం
ప్రభుత్వ ఖజానాకు రూ. 231.65 కోట్లు
పశ్చిమ హైదరాబాద్‌లో 
రియల్ ‘జోరు’


నవతెలంగాణ-సిటీబ్యూ​రో

హైదరాబాద్‌ పశ్చిమ కారిడార్‌లో భూముల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. హెచ్‌ఎండీఏ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లి మండలం ‘మోకిల’ లేఅవుట్ మూడో విడత ఈ-వేలం ప్రక్రియ విజయవంతమైంది. ఈనెల 29, 30 తేదీల్లో నిర్వహించిన ఈ వేలంలో గృహ కొనుగోలుదారులు, ఇన్వెస్టర్లు పోటీ పడటంతో ధరలు రికార్డు స్థాయికి చేరాయి. చదరపు గజం ధర గరిష్టంగా రూ. 1,09,500 పలికి రియల్ ఎస్టేట్ వర్గాలను ఆశ్చర్యపరిచింది.

​హాట్ కేకుల్లా 100 ప్లాట్లు
రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లి మండలంలోని మోకిలలో సుమారు 165 ఎకరాల్లో 1,321 ప్లాట్లతో ఈ భారీ వెంచర్‌ను హెచ్‌ఎండీఏ తీర్చిదిద్దింది. తాజాగా నిర్వహించిన మూడో విడత వేలంలో మొత్తం 100 నివాస ప్లాట్లు ఉండగా.. పూర్తిగా అమ్ముడయ్యాయి. ఈ ప్లాట్లు 300 నుంచి 500 చదరపు గజాల విస్తీర్ణంలో ఉన్నాయి. ప్రభుత్వం చదరపు గజానికి కనీస ధర రూ.50వేలుగా నిర్ణయించగా, బిడ్డర్ల మధ్య తీవ్ర పోటీతో సగటు ధర రూ. 75,640కి చేరింది. కనిష్ట ధర కూడా రూ. 66,500గా నమోదైంది. ఈ ఒక్క వేలం ద్వారానే ప్రభుత్వానికి రూ. 231.65 కోట్ల భారీ ఆదాయం సమకూరింది. ఇదిలావుంటే, మోకిల లేఔట్‌కు సంబంధించి గతంలో నిర్వహించిన వేలం ఫలితాలతో పోలిస్తే ఇప్పుడు ధరలు భారీగా పెరిగాయి. ఆగస్టు 2023లో నిర్వహించిన తొలి విడత వేలంలో కనీస ధర రూ. 25వేలు ఉండగా, సగటున రూ. 80,397 పలికింది. రెండో విడతలో 300 ప్లాట్లకుగాను 139 ప్లాట్లు అమ్ముడుపోయాయి. ప్రస్తుత మూడో విడతలో మాత్రం కనీస ధరనే రూ. 50వేలుగా నిర్ణయించినప్పటికీ, అన్ని ప్లాట్లు హాట్ కేకుల్లా అమ్ముడవడం విశేషం.

​హెచ్‌ఎండీఏకు కాసుల వర్షం
మోకిల మాత్రమే కాకుండా, ఈ నెల 24న జరిగిన మేడిపల్లి లేఅవుట్ వేలంలో కూడా హెచ్‌ఎండీఏకు మంచి ఫలితాలు వచ్చాయి. మేడిపల్లిలో 63 ప్లాట్ల విక్రయం ద్వారా రూ. 119.83 కోట్లు రాగా.. మోకిల, మేడిపల్లి కలిపి ఈ జూన్ నెలలో మొత్తం రూ. 351.48 కోట్ల ఆదాయం ప్రభుత్వ ఖజానాకు చేరింది.

​అభివృద్ధికి కేరాఫ్ అడ్రస్..
నార్సింగి-శంకర్‌పల్లి ప్రధాన రహదారికి కేవలం 2 కిలోమీటర్ల దూరంలో 165 ఎకరాల్లో ఈ వెంచర్‌ను హెచ్‌ఎండీఏ తీర్చిదిద్దింది. 100 అడుగుల మెయిన్ బీటీ రోడ్లు, 60 అడుగుల అంతర్గత రోడ్లు, అత్యాధునిక అండర్ గ్రౌండ్ డ్రయినేజీ, విద్యుత్ కేబుల్ వ్యవస్థతో పాటు సుందరమైన పార్కులు, పచ్చదనంతో కూడిన మోడల్ శాటిలైట్ టౌన్‌షిప్.ఐటీ కారిడార్‌కు సమీపంలో ఉండటం, మౌలిక వసతులు అంతర్జాతీయ ప్రమాణాలతో ఉండటంతో ఇన్వెస్టర్లు ఇక్కడ పెట్టుబడులకు మొగ్గు చూపుతున్నారు.

​మరింత ఊపందుకోనున్న అభివృద్ధి
హెచ్‌ఎండీఏ అభివృద్ధి చేసిన లేఅవుట్లపై మార్కెట్‌లో ఉన్న నమ్మకానికి ఈ వేలం నిదర్శనమని అధికారులు తెలిపారు. పశ్చిమ అభివృద్ధి కారిడార్‌లో ఈ సక్సెస్ మరింత ఊపునిస్తుందని, రాబోయే రోజుల్లో ఇక్కడ మౌలిక సదుపాయాల కల్పన మరింత వేగవంతం చేస్తామని హెచ్‌ఎండీఏ పేర్కొంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -