కార్మిక నేత బాసుదేవ్‌ ఆచార్య అనారోగ్యంతో మృతి

– ఆయన మృతి కార్మికోద్యమానికి తీరని లోటు
– ఎస్సీసీకేఎస్‌-సీిఐటీయూ
నవతెలంగాణ-కొత్తగూడెం
కార్మికోద్యమ నేత, సీఐటీయూ ఆలిండియా నాయకులు, ఆల్‌ ఇండియా కోల్‌ వర్కర్స్‌ ఫెడరేషన్‌ (ఏఐసీడబ్ల్యూఎఫ్‌) అధ్యక్షులు, మాజీ పార్లమెంటు సభ్యులు కామ్రేడ్‌ బాసుదేవ్‌ ఆచార్య (81) సోమవరం హైదరాబాద్‌లో అనా రోగ్యంతో మృతి చెందారు. వారికి కుమారుడు వెంకట్‌, ఇద్దరు కూతుర్లు జయశ్రీ, తనుశ్రీ ఉన్నారు. ఆయన సతీమణి రాజలక్ష్మి ఆచార్య గత నెల అక్టోబర్‌ 10న అనారోగ్యంతో మరణించారు. బాసుదేవ్‌ ఆచార్య మృతికి సింగరేణి కాంట్రాక్ట్‌ కార్మికుల సంఘం (ఎస్సీసీకేఎస్‌) తెలంగాణ రైల్వే కాంటాక్ట్‌ వర్కర్స్‌ యూనియన్‌ (టీఆర్‌సీసీడబ్ల్యూయూ) సంతాపాన్ని ప్రకటిస్తుందని, వారి కుటుంబ సభ్యులకు సానుభూతిని తెలియజేస్తుందని యూనియన్ల రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, సిఐటియు రాష్ట్ర కార్యదర్శి బి.మధు ప్రకటనలో తెలిపారు. కామ్రేడ్‌ వాసుదేవ ఆచార్య మృతి భారత కార్మికో ద్యమానికి తీరనిలోటన్నారు. బెంగాల్‌ ప్రజలు, కార్మికులు బాసుదా అని ప్రేమగా పిలుచుకునే కామ్రేడ్‌ బాసుదేవ్‌ ఆచార్య 1942 జూలై 11న పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రంలోని పురిలియ జిల్లా బెరో గ్రామంలో జన్మించారు. బాసుదేవ్‌ ఆచార్య తన జీవితాంతం పేద ప్రజల అభ్యున్నతి కోసం పనిచేశారు.1989 నుండి 2014 వరకు 7 సార్లు పార్లమెంట్‌ సభ్యునిగా ఎన్నికై దేశ ప్రజలకు, కార్మిక వర్గానికి సేవలందించారు. అనేక కార్మిక పోరాటాలను, కార్మి కోద్యమాలను నిర్మించారు. పార్లమెంటు సభ్యుడుగా, రైల్వే పార్లమెంటు స్టాండింగ్‌ కమిటీ మెంబర్‌గా, రైల్వే కాంట్రాక్ట్‌ వర్కర్స్‌ యూనియన్‌ అధ్యక్షుడిగా రైల్వే కాంట్రాక్ట్‌ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం అనేక పోరాటాలను నిర్వహించారు. రైల్వేలో హాకర్స్‌గా, హమాలీలగా పనిచేస్తున్న లక్షలాది మంది అసంఘటిత కార్మికుల సంక్షేమం కోసం ఆయన కృషి చేశారు. బొగ్గు రంగంలో బలమైన కార్మిక ఉద్యమాన్ని నిర్మించారు. ఆల్‌ ఇండియా కోల్‌ వర్కర్స్‌ ఫెడరేషన్‌ (ఏఐసీడబ్ల్యూఎఫ్‌) అధ్యక్షుడిగా నేడు బొగ్గు రంగంలో కార్మికులకు మెరుగైన వేతన ఒప్పందాలను సాధించడంలో, కాంట్రాక్ట్‌ కార్మికుల ప్రత్యేక వేతనాలను నిర్ణయించడంలో తన వంతు కృషిని చేశారు. బొగ్గు బ్లాక్‌ల ప్రైవేట్‌కి వ్యతిరేకంగా, నిర్వాసితుల సమస్యల మీద అనేక పోరాటాల నిర్వహించారు. ఆయన పెద్ద నాయకుడిగా వున్నా, పార్లమెంటు సభ్యుడిగా వున్నా అతి నిరాడంబరంగా సామాన్యమైన జీవితం గడిపాడు. నిరంతరం సామాన్యుడిగా కార్మికులలో కలిసి వుండేవాడు. ఏ మాత్రం అహం, గర్వంలేని నాయకుడు. 1970లో సిఐటియు ఏర్పడిన నాటినుండి నేటి వరకు వివిధ స్ధాయిలలో బాధ్యతలు నిర్వహించారు. అనేక సంఘాలను, పోరాటాలను నిర్మించారు. సెంటర్‌ ఆఫ్‌ ట్రేడ్‌ యూనియన్స్‌ (సిఐటియు)ఆల్‌ ఇండియా ఉపాధ్యక్షుడిగా 2020 వారకు పనిచేసారు. ప్రస్తుతం సిఐటియు ఆల్‌ ఇండియా కార్యదర్శివర్గ శాశ్వత ఆహ్వానితుడిగా, ఆల్‌ ఇండియా కోల్‌ వర్కర్స్‌ ఫెడరేషన్‌ (ఏఐసీడబ్య్లూఎఫ్‌) అధ్యక్షుడిగా పనిచేస్తున్నారు. ఆయన మృతి కార్మికోద్యమానికి తీరని లోటని మధు పెర్కోన్నారు.

Spread the love