– యూరియా వినియోగం తగ్గించాల
– రుద్రూర్ వరి పరిశోధన స్థానం శాస్త్రవేత్తల
నవతెలంగాణ-కమ్మర్ పల్లి
వేల్పూర్ మండలం రామన్నపేట్ గ్రామ పంచాయతీ కార్యాలయంలో శనివారం రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు కార్యక్రమంలో భాగంగా వ్యవసాయ శాఖ సమన్వయంతో రుద్రూర్ ప్రాంతీయ చెరుకు, వరి పరిశోధన స్థానం శాస్త్రవేత్తలు అవగాహనా కార్యక్రమం నిర్వహించారు. ఈ అవగాహన కార్యక్రమంలో కీటక శాస్త్రవేత్త ఎం.సాయి చరణ్ మాట్లాడుతూ రైతులందరు తప్పనిసరిగా నేల పరీక్షలు చేయించుకోవాలని, అవసరం మేరకే యూరియా వినియోగించి పంట సాగు ఖర్చు తగ్గించుకోవాలని సూచించారు. యూరియా అధిక వాడకం వల్ల పంటలలో రసం పీల్చే పురుగులు, వరిలో సుడి దోమ, బాక్టీరియా ఎండాకు తెగులు ఉధృతి అధికమవుతుందని తెలిపారు.
పొలంలో కాండం తోలుచు పురుగు యొక్క ఉధృతి ఆర్థిక పరిమిత స్థాయిని దాటినప్పుడు మాత్రమే రసాయన మందులు వినియోగించాలన్నారు.చీడ పీడల నుండి రక్షించడం కోసం కేవలం రసాయన మందుల్ని విచక్షణారహితంగా పిచికారి చేయకుండా సమగ్ర సస్య రక్షణ చర్యలు పాటించాలని సూచించారు. మండల వ్యవసాయ అధికారి బి.రాజు మాట్లాడుతూ పంటకి సాగు నీరు అవసరం మేరకు అందించాలని, రైతులు సేంద్రియ పద్ధతులను ఉపయోగించి ఆరోగ్యకరమైన దిగుబడులను పొందవచ్చని తెలిపారు. ఆయిల్ ఫామ్ సాగు అవశ్యకతను, అధిక రసాయనాల వాడకం ద్వారా కలిగే ఆరోగ్య సమస్యలు, ఉద్యాన శాఖ అందిస్తున్న పలు పథకాలను గురించి అవగాహన కార్యక్రమంలో వివరించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ బెల్దారి నవీన్, వ్యవసాయ అధికారి ఎస్. వైష్ణవ్, వ్యవసాయ విస్తరణ అధికారులు షబ్బీర్, యు.ప్రశాంత్, సిఅర్ పి శ్రీనివాస్, సొసైటీ మాజీ చైర్మన్ శోభన్ రెడ్డి, రైతులు, గ్రామస్తులు, తదితరులు పాల్గొన్నారు.



