Sunday, May 3, 2026
E-PAPER
Homeఎడిట్ పేజిరుజువు ‌కోసం…

రుజువు ‌కోసం…

- Advertisement -

‘తను తానేనని నిరూపించుకోవడం మనిషి నిరంతర యాతన మరొక అంతులేని తంతు. అనవసరానికి అవసరానికి అత్యవసరానికి రుజువులు అడిగే దేశంలో.. శవాలు లేచి నడచి రావడంలో వింతేమీ లేదు. అమానవీయత రాజకీయమై అలవికాని నిబంధనలు రాజ్యాన్నేలుతున్నప్పుడు, సమాధుల నుండి కుళ్లిన ధృవీకరణ పత్రం లేచిరాక తప్పడం లేదు’ మాటూరి సమతా సాహితి దు:ఖ కవితా పంక్తులివి. వాస్తవ ఘటనకు అద్దం పడుతున్న ఆవేదనాక్షరాలు. ఇప్పటికే సంఘటనేమిటో మీకు అర్థమయ్యే ఉంటుంది. బహుశా మనకు ఒక సాధారణ సమస్యగానే తోచి కూడా ఉంటుంది. ఎందుకంటే, ఇలాంటివి ఎన్ని చూడలేదు మనం! ఒకవైపు ఏఐ టెక్నాలజీతో, రోబోలతో, చాట్‌జీపీటీలతో, మానవ మేధస్సును, ఉద్వేగాలను సైతం అనుకరించి, అనుసరించి దాటి పైపైకి ఎగబాకుతున్న నవయుగం ఒకవైపు, ఒక ప్రశ్నకు, సమస్యకు ఎట్లా సమాధానం వెతకాలో తెలియని, తెలిసినా పరిష్కరించుకోలేని నిస్సహాయక, నిత్య దారిద్య్ర సమూహం ఇంకొకవైపు. ఇదీ వైరుధ్యాల భారతం!

ఇప్పుడు విజ్ఞానం ఎంతో సులువైంది, కానీ జీవితం ఎంతో బరువైపోతోంది. మనమెవరమో మనమే నిరూపించుకోవాలి. మన ఆనవాలును గుర్తించ నిరాకరిస్తారు. నేనీ దేశం వాడినో కాదో కూడా నేనే సాక్ష్యాలతో ఇప్పుడు నిరూపించుకోవాలి. అంతేకాదు, నాపైన నేరం మోపబడుతుంది. జైల్లో నిర్బంధించబడతాను. అప్పుడు కూడా నాపై మోపిన నేరం నేను చేయలేదని సాక్ష్యాలతో సహా నిరూపించుకోవాలి (ఉపా) లేదంటే, వాళ్లు ఆరోపించిన నేరస్తున్నయిపోతాను. శిక్షకు అర్హున్నయిపోతాను. ఓటర్ల జాబితాలో పేర్లు తొలగడమేకాదు, పౌరసత్వమూ రద్దు చేయబడుతుంది. నేను భారతీయున్నే అని ఎంత మొత్తుకున్నా ఎవడూ వినడు. నేను బతికున్నానన్నా వినడు. నేను చచ్చాననీ చెప్పిన రుజువేమిటంటాడు. ఈ దేశంలోనే రెండోరకం ప్రజలకు ఈ ప్రశ్నలన్నీ చుట్టుముడుతాయి. మొదటి రకం మనుషులకు ఇవేమీ వర్తించవు!

దీనికి సంబంధించిన నగ్న సంఘటన ఒకటి ఒరిస్సాలో జరిగింది. సామాజిక మాధ్యమాలలో ఫోటోలు, వార్తలు వైరల్‌ అవుతున్నవి. చాలా హృదయ విదారకంగా కనిపిస్తున్నాయి. ఒడిస్సాలోని కెఓంజార్‌కు చెందిన ఒక పేద ఆదివాసీ అతడు. అతనిపేరు జీతుముండా. అతనికి ఒక చెల్లి ఉండింది. రెండు నెలల క్రితం పాపం అనారోగ్యంతో చనిపోయింది. ఆమె ఉన్నపుడు, తన పశువులను అమ్మగా వచ్చిన డబ్బును, తన బ్యాంకు ఖాతాలో దాచుకున్నది. బ్రతికున్న ఒకే ఒక్క అన్న జీతూ, బ్యాంకు వాళ్ల దగ్గరికి వెళ్లి మా చెల్లి దాచుక్ను డబ్బు నా అవసరాలకు కావాలని, ఇవ్వమని అడిగాడు. బ్యాంకు వాళ్లు, ఖాతాదారులు వస్తేనే ఇస్తామని సెలవిచ్చారు. చెల్లి చనిపోయిందని పదిసార్లు చెప్పాడు. వాళ్లు పెద్దగా పట్టించుకోలేదు. నాలుగుసార్లు బ్యాంకు చుట్టూ తిరిగాడు. ఆఖరికి వాళ్లు ఆమె చనిపోయిన ‘డెత్‌ సర్టిఫికెట్‌’, సక్సెషన్‌ సర్టిఫికెట్‌ (నామినీ, వారసుడు) కావాలన్నారు. అవేమిటో, ఎక్కడ దొరుకుతాయో ఆ ఆదివాసీకి తెలియదు. తిరిగీ తిరిగీ.. చెల్లి చనిపోయిన రుజువు కావాలి కదా! అని ఒక రోజు చెల్లి సమాధిని తవ్వి, ఎముకల గూడుగా మిగిలిన చెల్లి అస్థిపంజరాన్ని భుజం మీద వేసుకుని, ఎండలో మైళ్లకు మైళ్లు నడిచి బ్యాంకు వద్దకు చేరుకున్నాడు. ఒంటి మీద అతనికి కప్పుకునే గుడ్డాలేదు. అధికారులముందు.. ఇదిగో మా చెల్లి చనిపోయిందని చూపించాడు. ఇంత దారుణమైన భారతదేశం ఒకవైపు మనల్ని దు:ఖితులను చేస్తున్నది. అప్పుడుగాని అధికారులు కదలలేదు. కలెక్టరు కలుగజేసుకుని అతని డబ్బును ఇప్పించారు. దారిద్య్రంలో మగ్గే, అక్షర జ్ఞానం లేని, గ్రామీణ ఆదివాసీకి సర్టిఫికెట్లు తెచ్చుకోవటం సాధ్యమా? ఈ విషయం అధికారులకు తెలియదా! ప్రజా ప్రతినిధులకూ తెలియదా! ప్రభుత్వాలు, పరిపాలన, చట్టాలు, విధానాలు అన్నీ ఎవరికోసం? ప్రజల కోసం కాదా? అదే ఈ నిబంధనలన్నీ ధనికుల, కార్పొరేట్ల విషయానికి వచ్చే సరికి మొత్తం సులవై, సులభమైపోతాయి. పేదల విషయానికొస్తే రూల్స్‌ అన్నీ గట్టిపడి, హృదయ రహితంగా మారిపోతాయి. ఇదే రెండు భారతాలు. అనిల్‌ అంబానీలు, విజయమాల్యాలు, నీరవ్‌ మోడీలు బ్యాంకుల నుండి అక్రమంగా డబ్బు తరీసుకోగలరు. ఎగ్టొట్టి దేశం విడిచి హాయిగా వెళ్లిపోగలరు. ఏ చట్టమూ వారిని అడ్డుకోదు. ఒక్క జీతు ముండాకు కష్టమైన పనిగా మారుతుంది. అదీ వాస్తవాన్ని నిరూపించుకోవటం! ఒక ఆదివాసీ మహిళ రాష్ట్రపతిగా ఉంది. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రీ ఆదివాసీనే! కానీ అక్కడి ఆదివాసీ ప్రజల బతుకులు ఏమీ మారలేదు. తమ కులంవాడో, జాతివాడో, ప్రాంతంవాడో అందలమెక్కగానే ఆ వర్గమంతా ఏమీ మారదు అనటానికి ఇదో ఉదాహరణ. ఈ బతుకు మారటానికి పోరాటమొక్కటే మార్గం!

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -