Saturday, May 2, 2026
E-PAPER
Homeఎడిట్ పేజిఎగ్జిట్‌ లక్కలు-రాజకీయ చిక్కులు

ఎగ్జిట్‌ లక్కలు-రాజకీయ చిక్కులు

- Advertisement -


అయిదు రాష్ట్రాల ఎగ్జిట్‌ పోల్స్‌తో రాజకీయ చర్చ కొత్త మలుపులు తిరుగుతున్నది.ఇవేవో నిజమైన ఫలితాలే అయినట్టు హడావుడి ఒకవైపు, వాటిని ముందే మరో విధంగా చూపించాలనే వ్యూహాలు మరోవైపు.. రాజకీయ దృశ్యం తికమకగా మారింది.సినిమా కేంద్రమైన తమిళనాడు,నాటకీయ రాజకీయనేత పాలిస్తున్న పశ్చిమబెంగాల్‌ మరింత సందడిగా వున్నాయి. మరి రెండు రోజుల్లో నిజమైన ఫలితాలు వస్తాయని తెలిసినా ఈ లోగానే చేయగలిగినంత చేసేయాలన్నది వీటి పాచికగా గోచరిస్తుంది.పశ్చిమబెంగాల్‌లో మమతా బెనర్జీ ఈ సారి ఓడిపోయి బీజేపీ వచ్చేస్తుందని చెప్పిన ఎగ్జిట్‌ పోల్స్‌కు తోడు ఓట్ల లెక్కింపు కేంద్రాల దగ్గర ధర్నాలతో ఆమె ముందస్తు సంచలనం సృష్టిస్తున్నారు. ఇక తమిళనాడులో నటుడు విజయ్‌ టివికెకు వంద వరకూ స్థానాలొస్తాయని ఒకటి రెండు చానళ్లు అంచనా కట్టడంతో ఏకంగా హోంమంత్రి అమిత్‌ షా రంగంలోకి దిగడం మరింత విపరీతంగా మారింది. ఎందుకంటే ఇప్పటికి ఎన్నోసార్లు ఎగ్జిట్లు అనుకున్నదానికి భిన్నంగా ఫలితాలు వచ్చాయి.పూర్తిగా తలకిందులైన సందర్భాలూ వున్నాయి.అయినా వాటికి బోలెడు ప్రచారం, హడావుడి తప్పడం లేదు.దీనికి చాలా కారణాలున్నాయి గానీ వాటికన్నా ముందు చెప్పుకోవలసింది ఇంకోటి వుంది. ఇటీవలి కాలంలో లక్షల ఓట్ల తొలగింపులు, ఇవిఎంల అవకతవకలతో అసలు ఫలితాలే వివాదాస్పదమవ ుతుంటే ఈ సర్వేలు, ఎగ్జిట్లకు విలువేంటనే
తెలకపల్లి రవి సవాళ్లు కూడా పెరిగాయి. సర్‌ గురించి భారత ఎన్నికల సంఘం(ఈసిఐ)నిర్వాకాల గురించి ఎన్ని విమర్శలు వస్తున్నా, సుప్రీంకోర్టులో కేసులు నడుస్తున్నా ఏమీ జరగనట్టు సర్వేలు, ఒపీనియన్‌ పోల్స్‌,ఎగ్జిట్‌ పోల్స్‌ షరామామూలుగా నడిపించడం మన మీడియా వరవడికి ఒక ఉదాహరణగా నిలుస్తుంది. ఎందుకంటే ప్రధాన మీడియా చాలా కాలంగా మోడీ సర్కారుకు అనుగుణంగా నడుస్తున్నదనే విమర్శలు అంతర్జాతీ యంగానే మూట కట్టుకున్నది.

వరస వైఫల్యాలు
2024 లోక్‌సభ ఎన్నికలకు ముందునుంచి బీజేపీ ఈసారి నాలుగు వందలు దాటేస్తామని టముకు వేసుకుంది.దాన్ని నిజం చేయడానికి సామదానభేద దండోపాయాలకు పాల్పడింది. బడా మీడియా కూడా అది నిజం కాబోతుందన్న వాతావరణం కల్పించేందుకు ప్రయత్నించింది.సర్వే తర్వాత సర్వే పోటాపోటీగా అందుకు తగిన జోస్యాలు చెప్పాయి. బీజేపీ ప్రాయోజిత ప్రత్యేక కథనాలు ప్రచురించాయి.ఎప్పుడూ ఒక్క మీడియా గోష్టి కూడా జరపని మోడీప్రాంతీయ టీవీలకూ, యూట్యూబ్‌ ఛానళ్లకు కూడా ఇంటర్వ్యూలు ఇచ్చేశారు.దానికి తగినట్టే సర్వే సంస్థల దశలవారీ అంచనాలు విడుదల చేయిస్తూ మైండ్‌గేమ్‌కు తెరతీశారు.ముందు చెప్పింది చాలక పోలింగ్‌ ముగిశాక ఎగ్జిట్‌ పోల్స్‌ సమయంలోనే ఈ నాటకం కొనసాగించారు. స్టాక్‌ మార్కెట్‌ దూసుకుపోవడానికి కారణమైనారు. నాలుగు వందలకు పై మాటే కానీ తగ్గేది లేదన్నారు, తీరా చూస్తే బీజేపీకి కనీస మెజార్టి కూడా రాలేదు.240 దగ్గర ఆగిపోయింది.మరోవైపున వందకు కాస్త అటూ ఇటూగా వుంటుందని లెక్కలు కట్టిన ఇండియా వేదిక, ప్రాంతీయ పార్టీల స్కోరు 235 చేరింది. ఈ రెండు శక్తులకూ మధ్య అగాధమైన తేడా వుందనే ప్రచారం ఎంత బూటకమో అర్థమైంది, దీనికి తోడు ఇవిఎం వినియోగంపైనా లెక్కింపుల పైనా బోలెడు ఫిర్యాదులు నమోదైనా ఇంత అత్తెసరు తేడాతోనే ఎన్‌డిఎ అధికారంలోకి వచ్చింది.మోడీకి తిరుగులేదనే ప్రచారానికి గండి పడింది.హ్యాట్రిక్‌ కొట్టలేక చతికిల పడిన మోడీని కృత్రిమంగా పైకి లేపడానికి జాకీలను సమకూర్చింది బడామీడియా.

ఈ ఫలితాల తర్వాత సర్వే సంస్థల పరిస్థితి కుడితిలో పడ్డ ఎలకలా తయారైంది.తాము గొప్పలు పోయిన చానళ్లలోనే మళ్లీ కూచని శోకాలు పెట్టడం కనిపించింది.అతకని సమర్థనలతో సాకులతో తప్పుకోవలసి వచ్చింది.వారిలో మరీ అతి చేసిన యాక్స్‌స్‌ మై ఇండియా అధినేత ప్రదీప్‌ చంద్ర కళ్లనీళ్లు పెట్టుకుని కాళ్లు పట్టుకున్నంత పని చేశారు.గొప్ప వ్యూహకర్తగా ప్రచారం పొందిన ప్రశాంత్‌ కిశోర్‌ కూడా పల్టీ కొట్టారు. ఏపీలో అప్పటి వరకూ సరైన అంచనాలకు పేరు గాంచిన ఒక సర్వే సంస్థ పూర్తిగా బోల్తాపడింది.ఈ వ్యాసకర్తతో పాటు టీవీ చర్చలో పాల్గొంటున్న ఆ సంస్థ అధినేత చడీ చప్పుడు కాకుండా మాయమై పోవడం ఇప్పటికీ గుర్తుంది.ఉమ్మడి ఏపీలో ఆక్టోపస్‌గా పేరు మోసిన ఒక మాజీ ఎంపీ 2018లో తెలంగాణ ఎన్నికలపై అలాగే అంకెలతో సహా ఎగ్జిట్‌ ఫలితాలు చెప్పి కంగుతిన్నారు. వీటిలో రెండు రకాల కారణాలు చూడవలసి వుంటుంది. ఒకటి – ఒక ముందస్తు కోణంతో అంచనాలు చెప్పి గందరగోళపర్చడం. రెండు- కేంద్రం ఎన్నికల సంఘంపై ఆరోపణల అవకతవకల ఫలితమనే సందేహాలు. ఉదాహరణకు ఏపీలో 2019లో వైసీపీ ఘన విజయం ఇవిఎంల మాయ అని టీడీపీ చెబితే 2024లో తమ ఘోర పరాజయం కూడా ఈవిఎంల వల్ల జరిగిందని ఇప్పటికీ వైసీపీ వాదనగా వుంది. (అయితే ఈ రెండు పార్టీలు కూడా అదే బీజేపీకి అనుకూలంగా వుండటం విచిత్రం.)2024లో ఏపీ ఫలితాలను సీట్ల సంఖ్యతో సహా కచ్చితంగా ముందే చెప్పిన కెకెసర్వే తర్వాత రాష్ట్రాలలో దెబ్బతినడం ఇటీవలి ఉదాహరణే.

2024 తర్వాత..సర్‌‌లు…
వీటికి ముందు 2023లో ఛత్తీస్‌‌గఢ్‌లోనూ,2017లో ఉత్తర ప్రదేశ్‌లోనూ కూడా ‌బీజేపీ పెద్ద మెజార్టీతో గెలవడం సర్వేలను వెక్కిరించింది. అయితే 2024లో మోడీ మెజార్టీ కోల్పోయిన తర్వాత బీజేపీ విశ్వాసం సన్నగిల్లడం, ఎన్నికల సంఘంపై ఆరోపణలు ఇంకా తీవ్రమవడం ఒకేసారి జరిగాయి. అప్పటి నుంచి రాష్ట్రాల స్థాయిలో ఎగ్జిట్‌సర్వేలు లెక్కతప్పుతున్నాయి. నిజమైన సందర్భాల్లో కూడా తేడా చాలా వుంటున్నది.2024 చివరలో జరిగిన హర్యానా శాసనసభ ఎన్నికలలో అక్కడ కాంగ్రెస్‌ భారీ మెజార్టీతో గెలుస్తుందని, ప్రభంజనం వుందని చాలా అంచనాలు వెలువడ్డాయి.దాంతో ఆ పార్టీ కూడా పొత్తులను నిర్లక్ష్యం చేసింది.తీరా చూస్తే బీజేపీ మంచి ఆధిక్యతతో గెలవగలిగింది.2025లో బీహార్‌లో బీజేపీ,జేడీయూ,ఎన్‌డిఎ స్వల్ప మెజార్టితో గట్టెక్కవచ్చని సర్వేలు, ఎగ్జిట్లు చెప్పాయి. హర్యానా అనుభవంతో కాంగ్రెస్‌ ఇక్కడ సర్దుబాట్లు చేసుకుంది. కానీ తర్వాత ఎన్‌డిఎకు భారీ మెజార్టీ రావడమే గాక నితిష్‌ కుమార్‌ మూడు మాసాలలోనే తప్పుకోవలసిన స్థితి కలిగింది. హర్యానా తరహాలోనే మహారాష్ట్రలో లోక్‌సభ ఎన్నికల్లో దారుణంగా దెబ్బతిన్న బీజేపీ కూటమి శాసనసభ ఎన్నికలకు వచ్చే సరికి పూర్తి ఆధిక్యత తెచ్చేసుకుని కొన్ని సర్వేలను పూర్వపక్షం చేసింది.కాకపోతే ఈ మూడు రాష్ట్రాల ఎన్నికల నాటికి ఈసిపై ఆరోపణలు బాగా పెరిగిపోయాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు అయిదు రాష్ట్రాలకు వచ్చేసరికి ప్రతిపక్షాలు సిఈసి గ్యానేష్‌ కుమార్‌ను తొలగించాలని బహిరంగంగానే పట్టుపడుతున్న పరిస్తితి. పాండిచ్చేరి అస్సాం, కేరళ, తమిళనాడు, బెంగాల్‌ శాసనసభ ఫలితాలపై అందుకే ముందునుంచి చాలా ఆసక్తి నెలకొంది.సర్వేలు ఎగ్జిట్లు కూడా దానికి తగినట్టే ఉత్కంఠ పెంచాయి. సర్‌ అమలు చేయడానికి చెబుతున్న కారణాలు ఎక్కవగా వర్తించే అస్సాంలో ఆ వూసే తలపెట్టకుండా ఇతరేతర ఎత్తుగడలతో కానిచ్చేశారు.విదేశీ చొరబాటుదార్లు, మియాలు అంటూ బెంగాలీ ముస్లింలపై విద్వేష ప్రచారం తమను గెలిపిస్తుందని బీజేపీ నమ్మకంగా వుంది. సర్వేలు కూడా దానికి అనుకూలంగానే వున్నాయి.చిన్న రాష్ట్రమైన పుదుచ్చేరిలో ఎన్‌ఆర్‌సి-ఎన్‌డిఎ కూటమి గట్టెక్కవచ్చనే అభిప్రాయం బలంగా వుంది.

​ బెంగాల్‌‌లో హైడ్రామా
కేరళ విషయానికి వస్తే ఇప్పటికే పినరాయి విజయన్‌ ప్రభుత్వం రెండోసారి వరుసగా ఎ న్నికవడం ద్వారా యాభై ఏళ్లలో కొత్త రికార్డు నెలకొల్పింది. ప్రజానుకూల పురోగామి విధానాల ఫలితంగా మూడోసారి కూడా రావచ్చనే అంచనాలు కొన్ని వున్నా యుడిఎఫ్‌కు అవకాశాలు మెరుగ్గా వున్నాయని సర్వేలు చెప్పిన దాన్ని పూర్తిగా తోసిపుచ్చ లేకపోవచ్చు. కేరళ,బెంగాల్‌లలో తాను రాకపోయినా ‌సీపీఐ(ఎం) వామపక్షాలు రాకూడదనే లక్ష్యం బీజేపీ ఆరెస్సెస్‌లది. కనుకనే పైకి ఎంతగా పోరాడినట్టు కనిపిస్తున్నా మమతా బెనర్జీతో మ్యాచ్‌ ఫిక్సింగ్‌ జరిగిందనే అత్యధికులు భావించారు.అరవింద్‌ కేజ్రీవాల్‌తో సహా ఎందరో ముఖ్యమంత్రులను జైలు పాలు చేసిన కేంద్రం త్రిశూల వ్యూహం బెంగాల్‌లో కేవలం రాజకీయ హంగామాగానే మిగిలిపోవడానికి కారణం అదే కావచ్చు.సర్‌ విషయంలోనూ కేరళ ఎల్‌డిఎఫ్‌తో పోలిస్తే మమత ప్రభుత్వం భారీ తొలగింపులను అనుమతించింది తప్ప గట్టిగా ఆపింది లేదు. ఆ విధంగా ముస్లిములు, మహిళలు, మతువాల ఓట్లు బారీగా తొలగింపచేయడం ఆమె పట్ల అనుకూలత పెంచడానికేనని వామపక్ష నేతలు చెబుతూ వచ్చారు.కాంగ్రెస్‌ కూడా ఓట్లు చీల్చడానికే కారణమైంది. ఒక విధంగా కేరళలో ‌బీజేపీ చీల్చడం కాంగ్రెస్‌కు దోహడపడితే బెంగాల్‌లో కాంగ్రెస్‌ చీల్చడం బీజేపీ పథకాలకు అనుగుణంగా నడిచింది.హర్యానా,ఢిల్లీతో సహా చాలా చోట్ల కాంగ్రెస్‌ బీజేపీని ఓడించడం కన్నా రాష్ట్రంలో ప్రత్యర్థిని రాకుండా చేయడమే లక్ష్యంగా చేసుకుంది.బెంగాల్‌లో మాత్రం అది మరో విధంగా నడిచింది. అయితే అక్కడ కూడా ఇరుపార్టీలూ పోటీ పడి మతరాజకీయాలు నడిపాయి.ఇప్పటికి అక్కడ మమతా రావచ్చని కొన్ని ఎగ్జిట్‌ సంస్థలు బలంగా చెబుతున్నాయి. 2024లో ఓవర్‌ యాక్షన్‌ చేసిన,ఇప్పుడు కూడా తమిళనాడులో విజయ్‌ పేరిట స్కోరు పెంచుతున్న ప్రదీప్‌ చంద్ర బెంగాల్‌లో ఎగ్జిట్‌ చేయలేదు.మమతా బెనర్జీ ఓట్ల లెక్కింపుపై ముందస్తుగా ఆందోళన చేయడం కూడా నాటకీయంగా వుంది. ఈ నేపథ్యంలో వాస్తవ పలితాల కోసం చూడటమే క్షేమ దాయకం.నీతిబాహ్య రాజకీయాలలో ఏదైనా సంభవమే.

మాయాజాలం వెనుక…
తమిళనాడులో అత్యధిక సర్వేలు డిఎంకె కూటమికి ఆధిక్యత వస్తుందనే చెబుతున్నాయి. సంఖ్యల్లో మాత్రం తేడాలున్నాయి. ముందే చెప్పినట్టు ఒకటి రెండు విజ‌య్‌‌కి భారీగా సీట్లు ఇచ్చినా మెజార్టీ వస్తుందని చెప్పడం లేదు. బెంగాల్‌, తమిళనాడుతో సహా ఎక్కడైనా ఎగ్జిట్లు తీవ్ర వ్యత్యాసాలతో రావడం బెట్టింగ్‌ మాఫియా ప్రభావమేనని కూడా అభిప్రాయాలున్నాయి. స్టాక్‌ మార్కెట్‌లోనూ ప్రకంపనలు తీసుకొస్తారు.ఆ రెండు రోజులు కావలసినంత హంగామా చేసి తము గెలిచే వారమన్న భావన కలిగిస్తారు. బడా మీడియానే మోడియాగా మారిపోయినప్పుడు ఈ సర్వేసంస్థలు మార్కెటింగ్‌ ఏజెన్సీలను లోబర్చుకోవడం ఎంత పని? మైండ్‌గేమ్‌లో భాగంగానే ఈ తతంగాలను పరిగణించవలసి వుంటుంది.కొన్నిసార్లు యాదృశ్చికత (ఛాన్స్‌ఫ్యాక్టర్‌) కూడా పనిచేయొచ్చు.కనుక తుది ఫలితం ఎలా వుంటుందో వివరాలేంటో మరొక్క రోజు వేచి చూద్దాం.
తెలకపల్లి రవి

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -