మంత్రి శ్రీధర్ బాబుకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపిన రేగులగూడెం సర్పంచ్ ఆమని సురేష్
నవతెలంగాణ – కాటారం
మంథని నియోజకవర్గ అభివృద్ధికి రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు వరాల జల్లు కురిపించారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కాటారం సహా పది మండలాల్లో సీసీ రోడ్లు, డ్రైనేజీ నిర్మాణాలకు (SC కంపోనెంట్) క్రింద మొత్తం రూ.15 కోట్ల నిధులు ఆయన మంజూరు చేయించారు. కాటారం మండలానికి ప్రత్యేకంగా రూ.2.50 కోట్ల నిధులు కేటాయించడం ద్వారా గ్రామీణ మౌలిక వసతుల అభివృద్ధికి ముందడుగు పడింది. ఆదివారంపేట, చిద్నేపల్లి, దామెరకుంట, కాటారం, ప్రతాపగిరి, రేగులగూడెం వంటి గ్రామాలకు గణనీయంగా నిధులు లభించగా, మిగతా గ్రామాలకు కూడా అవసరాన్ని బట్టి కేటాయించారు.
ఈ నిధులతో గ్రామాల్లో సీసీ రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థలు మెరుగుపడి, ముఖ్యంగా వర్షాకాలంలో ఎదురయ్యే సమస్యలు తగ్గనున్నాయి. రవాణా సౌకర్యం సులభతరం కావడంతో పాటు గ్రామాల పరిశుభ్రత, ప్రజల ఆరోగ్య పరిస్థితులు కూడా మెరుగుపడతాయని అధికారులు అభిప్రాయపడుతున్నారు. మంథని నియోజకవర్గ పరిధిలోని కాటారం, మహాముత్తారం తదితర మండలాలకు ఈ స్థాయిలో నిధులు రావడం అభివృద్ధి పట్ల ప్రభుత్వ నిబద్ధతకు నిదర్శనమని స్థానికులు పేర్కొంటున్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామ సర్పంచులు, ప్రజాప్రతినిధులు మంత్రి శ్రీధర్ బాబుకు కృతజ్ఞతలు తెలిపారు. పనులను వేగవంతంగా పూర్తి చేసి ప్రజలకు ప్రయోజనం చేకూర్చాలని కోరారు.
ఈ సందర్భంగా రేగులగూడెం గ్రామ సర్పంచ్ పాగే ఆమని సురేష్ మాట్లాడుతూ.. గ్రామాలను అభివృద్ధి పథంలో నడిపించేందుకు మంత్రి శ్రీధర్ బాబు నిధులు విడుదల చేయడం నియోజక వర్గ అభివృద్ధిపై ఆయనకు ఉన్న చిత్తశుద్ధి స్పష్టంగా కనిపిస్తోందని అన్నారు. ప్రతిపైసా గ్రామాభివృద్ధికై ఖర్చు చేస్తామని తెలిపారు. గ్రామీణాభివృద్ధి దిశగా కాటారం మండలం మరింత ముందుకు సాగేందుకు ఈ నిధులు ఉపయోగపడతాయని చెప్పారు. నిధుల విడుదల పట్ల స్థానిక కాంగ్రెస్ నాయకులు హర్షం వ్యక్తం చేశారు.



