ఐఐటీలు, ఐఐఎంలు, ఎన్ఐటీలకు సింహభాగం
మిగిలిన 97 శాతం మంది పరిస్థితి ఏంటి?
తప్పుబడుతున్న మేధావులు, విద్యావేత్తలు
న్యూఢిల్లీ : భారత్‌లో ఉన్నత విద్యా వ్యవస్థలో గాఢమైన అసమానతలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మొత్తం విద్యార్థుల్లో కేవలం 2.6 శాతం మందికి సేవలందిస్తున్న ఐఐటీలు, ఐఐఎంలు, ఎన్ఐటీలు వంటి ప్రతిష్టాత్మక సంస్థలు.. ఉన్నత విద్యకు కేటాయించిన ప్రభుత్వ నిధుల్లో 50 శాతానికి పైగా పొందుతున్నాయి. మిగిలిన 97 శాతం మంది విద్యార్థులు తక్కువ నిధులతో నడిచే వందలాది విద్యా సంస్థలపై ఆధారపడాల్సి వస్తోంది.
ప్రవేశ పరీక్షల ఒత్తిడి.. అవకాశాల కొరత
గతేడాది ఐఐటీ జేఈఈ కోసం సుమారు 23 లక్షల మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. అయితే అందుబాటులో ఉన్న సీట్లు 18,191 మాత్రమే. ఇక ఇదే పరిస్థితి నీట్ పరీక్షలోనూ ఉంది. వేలాది మంది విద్యార్థులు ఎయిమ్స్ వంటి ప్రతిష్టాత్మక సంస్థల్లో సీట్ల కోసం పోటీ పడుతున్నారు. ఈ పరీక్షల కోసం విద్యార్థులు రేయింబవళ్లు కష్టపడి చదువుతుంటారు. మంచి ర్యాంకు రావాలనే ఒత్తిడి ఇటు విద్యార్థు లు, అటు వారి తల్లిదండ్రులపై ఉంటుంది. అయితే ఈ ప్రతిష్టాత్మక కోర్సులకు డిమాండ్ చాలా ఎక్కువగా ఉన్నా… అవకాశాలు మాత్రం చాలా పరిమితంగా ఉన్నాయని మేధావులు, విశ్లేషకులు చెప్తున్నారు.
మూడు శాతం మంది విద్యార్థులకు 50 శాతం కంటే ఎక్కువ నిధులు
ఐఐటీలు, ఐఐఎంలు, ఎన్ఐటీలు కలిసి సుమారు 60వేల సీట్లు మాత్రమే అంది స్తున్నాయి. ఇది మొత్తం విద్యార్థులలో మూడు శాతం కంటే తక్కువ. అయినప్పటికీ.. ఈ సంస్థలకు ఉన్న విద్య బడ్జెట్లో 50 శాతం కంటే ఎక్కువ నిధుల కేటాయింపులు జరుగు తున్నాయి. దీనితో మిగిలిన 650కి పైగా విశ్వవిద్యాలయాలు.. 97 శాతం విద్యార్థులకు సేవలందిస్తున్నప్పటికీ తక్కువ నిధులతోనే నడవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి.ప్రస్తుతం దేశంలో 1338 విశ్వవిద్యాలయాలు, 50 వేలకు పైగా కళాశాలలు ఉన్నాయి. మొత్తం నమోదిత విద్యార్థుల సంఖ్య 4.46 కోట్లు. వీరిలో 3.2 కోట్లు రాష్ట్ర ప్రభుత్వ విశ్వవిద్యాలయాల్లో చదువుతున్నారు. ఇదే సమయంలో ఐఐటీలు, ఐఐఎంలు, ఎన్ఐటీల్లో కలిపి సుమారు 10 లక్షల మంది మాత్రమే చదువుతున్నారు.
బడ్జెట్ కేటాయింపులు.. వివరాలు
2026-27 ఆర్థిక సంవత్సరానికి భారత ప్రభుత్వం విద్యకు 1.4 లక్షల కోట్ల బడ్జెట్ కేటాయించింది. అందులో ఉన్నత విద్యకే రూ.55,727 కోట్లు వెళ్లడం గమనార్హం. ఇందులో ఐఐటీలకు రూ.12,123 కోట్లు, ఐఐఎంలకు రూ.292 కోట్లు, ఎన్ఐటీలకు రూ.6260 కోట్లు, ఐఐఎస్సీ బెంగళూరుకు రూ.845 కోట్లు, ఐఐఎస్ఈఆర్లకు రూ.1319 కోట్లు వచ్చాయి. ఈ కేటాయిం పులను చూస్తే ప్రముఖ విద్యా సంస్థలకు అధిక ప్రాధాన్యత ఇచ్చినట్టు తెలుస్తోంది.
పరిశోధనా వ్యయంలో వెనుకబడిన భారత్
భారత్ జీడీపీలో 0.6-0.7 శాతం మాత్రమే పరిశోధన, అభివృద్ధికి ఖర్చు చేస్తోంది. ఇది అమెరికా, చైనా, దక్షిణ కొరియా వంటి దేశాలతో పోలిస్తే చాలా తక్కువ. నిపుణుల ప్రకారం.. కేవలం ఐఐటీలకు ఎక్కువ నిధులు కేటాయించడం ద్వారా భారత్ గ్లోబల్ టెక్నాలజీ రేసులో ముందుకు వెళ్లలేదని అంటు న్నారు. మొత్తం వ్యవస్థను బలోపేతం చేయాల్సిన అవసరాన్ని వారు నొక్కి చెప్తున్నా రు. ఇందుకు నాలుగు కీలక అంశాలను వారు సూచిస్తూన్నారు. పెట్టుబడుల పరిణామం, సంస్థాగత నిర్మాణం, పరస్పర సహకారం, ప్రతిభావృద్ధి వంటివి కీలకమని అంటున్నారు. అలాగే పరిశ్రమల భాగస్వామ్యం, ప్రయివేటు పెట్టుబ డులు, అంతర్జాతీయ సహకారం కూడా అవస రమని వారు సూచిస్తున్నారు. ప్రభు త్వాలు అటువైపుగా చర్యలు తీసుకోవాలని అంటున్నారు.
ఉద్యోగావకాశాలు మరో పెద్ద సమస్య
ఒక నివేదిక ప్రకారం.. ఇంజినీరింగ్ పట్టభద్రుల్లో 85 శాతం మందికి ఉద్యోగాలు లభించడం లేదు. ఉద్యోగం వచ్చిన వారిలో చాలా మందికి తక్కువ జీతం మాత్రమే లభి స్తోంది. అలాగే, 80 శాతంం మంది ఉద్యోగులు తమ నైపుణ్యాలకు అనుగుణంగా పని చేయడం లేదు. భారత్‌లో 56 శాతం మంది మాత్రమే నైపుణ్యం కలిగిన కార్మికులుగా పరిగణించబడుతున్నారు అంటే విద్యా వ్యవస్థ, పరిశ్రమ అవసరాల మధ్య పెద్ద గ్యాప్ ఉంది. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో దేశంలోని ఉన్నత విద్యాసంస్థలకు కేటాయించే నిధుల అసమానతలపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. మూడు శాతం ఉన్న విద్యార్థులకు 50 శాతం నిధులు కేటాయించి, 97 శాతం మంది విద్యా ర్థులను నిర్లక్ష్యం చేయటమేంటని మేధావులు, విద్యావేత్తలు ప్రశ్నిస్తున్నారు. దేశ అభివృద్ధి కోసం మొత్తం విద్యా వ్యవస్థను సమగ్రంగా బలోపేతం చేయాలని వారు సూచిస్తున్నారు.
విద్యలో నాణ్యత తగ్గుదల
దేశంలో విద్యా సంస్థలు పెరిగినా.. స్థూల నమోదు నిష్పతి (జీఈఆర్) 31 శాతంగానే ఉంది. అంటే అందరికీ ఉన్నత విద్య అందడం లేదు. గత దశాబద్దంలో ఐఐటీలు, ఐఐఎంలు, ఎయిమ్స్‌లు సంఖ్యాపరంగా పెరిగిన పరిస్థితి కనిపించినా.. నాణ్యత మాత్రం లోపించిందని విశ్లేషకులు, నిపుణులు చెప్తున్నారు. ఇక ప్రభుత్వ నిధులు తక్కువగా ఉండటంతో అనేక సంస్థలు స్వయం ఆర్థిక విధానాన్ని అనుసరిస్తున్నాయి. దీంతో ఫీజులు పెరిగి, మధ్యతరగతి, పేద విద్యార్థులపై భారం పడుతోందని మేధావులు చెప్తున్నారు.



