Monday, May 4, 2026
E-PAPER
Homeప్రధాన వార్తలుబస్టాపుల్లో కనీస సౌకర్యాలు కరువు

బస్టాపుల్లో కనీస సౌకర్యాలు కరువు

- Advertisement -

భానుడి భగభగతో అల్లాడుతున్న ప్రయాణీకులు
అయిదుగురు కూర్చుంటే .. మిగతావారు ఎండలోనే నిరీక్షణ
వసతుల కల్పన, చలివేంద్రాల ఏర్పాటుపై పట్టించుకోని వైనం
ఆర్టీసీ, జీహెచ్‌ఎంసీ మధ్య సమన్వయలోపం.. జనం ఆందోళన

నవతెలంగాణ-సిటీబ్యూరో
రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి. ఉష్ణోగ్రతలు 42 నుంచి 45 డిగ్రీలకు చేరుకోవడంతో జనం అల్లాడిపోతున్నారు. ముఖ్యంగా టీజీఎస్‌ఆర్టీసీ బస్సుల కోసం బస్టాపుల్లో వేచి చూసే ప్రయాణికులకు తాగునీరు, నీడ వంటి కనీస వసతులు కరువయ్యాయనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ విషయంలో ప్రయాణికులకు ఉపశమనం కలిగించాల్సిన ఆ సంస్థ, ఇతర ప్రభుత్వ విభాగాల నిర్లక్ష్యంగా వ్యవహరించడంపై ప్రయాణికులు భగ్గుమంటున్నారు. నగరంలోని అనేక బస్‌ స్టాపుల్లో ప్రయాణికులకు కనీస సౌకర్యాలు కరువయ్యాయి. ఎండలో నిలబడలేక ప్రయాణీకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గతంలో ఎండాకాలం వచ్చిందంటే ప్రధాన బస్‌ స్టేషన్లలో, రద్దీగా ఉండే ప్రాంతాల్లో ఆర్టీసీ యంత్రాంగం ‘చలివేంద్రాలు’ ఏర్పాటు చేసేది. కానీ ఈసారి అటు ఆర్టీసీ గానీ, ఇటు జీహెచ్‌ఎంసీ గానీ ఆ దిశగా చర్యలు చేపట్టిన దాఖలాలు కనిపించడం లేదు. బస్‌ షెల్టర్ల వద్ద కనీసం తాగునీటి సదుపాయం కూడా లేదని ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రధాన బస్‌ స్టేషన్లలో తాగునీటి సదుపాయం కల్పిస్తున్నామనీ, తార్నాకతో పాటు ఇతర ప్రాంతాల్లో సత్యసాయి ట్రస్ట్‌, లయన్స్‌ క్లబ్‌ వంటి స్వచ్ఛంద సంస్థల సహకారంతోనే తాగునీటి సౌకర్యం అందుతోందని ఆర్టీసీ అధికారులు చెబుతున్నారు. అలాంటివి ఎక్కడా కనిపించడం లేదని ప్రయాణీకులు అంటున్నారు. వాస్తవానికి నగరంలోని బస్‌ స్టాపుల్లో మాత్రం ఎలాంటి ఏర్పాట్లు లేవని.. బస్‌ షెల్టర్ల నిర్వహణ అంతా జీహెచ్‌ఎంసీ పరిధిలోకి వస్తుందనీ, అక్కడ వసతులు కల్పించాల్సిన బాధ్యత వారిదేనని ఆర్టీసీ అధికారి ఒకరు తెలిపారు.

‘గమ్యం’ యాప్‌..పక్కాగా బస్సుల ట్రాకింగ్‌
ప్రయాణికులకు బస్సుల రాకపోకల సమాచారం అందించేందుకు ప్రవేశపెట్టిన ‘గమ్యం’ యాప్‌ ప్రస్తుతం సరిగ్గా పనిచేయడం లేదనే ఫిర్యాదులు అందుతున్నాయి. ఎండలో బస్సు కోసం ఎంతసేపు వేచి ఉండాలో తెలియక జనం అవస్థలు పడుతున్నారు. అధికారులు మాత్రం ఈ యాప్‌ సాంకేతిక పరంగా ఎంతో పటిష్టంగా ఉందనీ, బస్సుల రాకపోకలను ట్రాక్‌ చేయడంలో ఇది దేశంలోనే అత్యుత్తమంగా నిలుస్తోందని ఆర్టీసీ ఐటీ విభాగం అధికారి వెంకట్‌ రెడ్డి తెలిపారు. మిగతా రాష్ట్రాల ఆర్టీసీ యాప్‌లతో పోలిస్తే తెలంగాణ ‘గమ్యం’ యాప్‌ మరింత కచ్చితత్వంతో పనిచేస్తుందనీ, సాధారణంగా ఇతర యాప్‌లలో బస్సు లోకేషన్‌ సిగల్‌ 20 నుంచి 30 సెకన్లకు ఒకసారి అప్‌డేట్‌ అవుతుందని, కానీ గమ్యం యాప్‌లో ప్రతి 10 సెకన్లకు ఒకసారి సిగల్‌ అప్‌డేట్‌ అయ్యేలా అత్యాధునిక డివైజ్‌లను ఏర్పాటు చేశామని వివరించారు. దీనివల్ల ప్రయాణికులు బస్సు ఎక్కడ ఉందో సెకన్ల వ్యవధిలో తెలుసుకోవచ్చని స్పష్టం చేశారు. నగర పరిధిలో తిరిగే సుమారు 3వేల బస్సులతో పాటు కొత్తగా ప్రవేశపెట్టిన ఎలక్ట్రిక్‌ బస్సులను కూడా గమ్యం యాప్‌లో అనుసంధానం చేయడంతో పాటు దూరప్రాంతాలకు వెళ్లే 1,600 రిజర్వేషన్‌ బస్సుల ప్రయాణికులకు నేరుగా ట్రాకింగ్‌ లింక్‌లను పంపుతున్నట్టు వివరించారు. ఇటీవల సమ్మె జరిగిన సమయంలో రూట్లు, డ్రైవర్ల కేటాయింపులో అనిశ్చితి వల్ల యాప్‌ పనితీరులో కొన్ని ఇబ్బందులు ఎదురయ్యాయని, ప్రస్తుతం అటువంటి సమస్యలేవీ లేవని ఆయన స్పష్టం చేశారు.

సౌకర్యాలు ఏవి?
మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించడంతో బస్సుల్లో రద్దీ విపరీతంగా పెరిగింది. ఆర్టీసీకి ఆదాయం పెరుగుతున్నప్పటికీ, దానికి తగ్గట్టుగా ప్రయాణికులకు సౌకర్యాలు కల్పించడంలో ప్రస్తుత యాజమాన్యం దృష్టి సారించడం లేదని విమర్శలు వినిపిస్తున్నాయి. వీసీ సజ్జనార్‌ ఉన్న సమయంలో ఉన్నంత చొరవ ప్రస్తుత అధికారులు చూపడం లేదని ప్రయాణికులు వాపోతున్నారు. ఇప్పటికైనా జీహెచ్‌ఎంసీ, ఆర్టీసీ అధికారులు సమన్వయంతో వ్యవహరించి, బస్‌ స్టాపుల వద్ద చలివేంద్రాలు ఏర్పాటు చేయాలని, బస్సుల్లో ఎండ తీవ్రతను తగ్గించే చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.

నిప్పుల కొలిమిలా బస్సులు
బస్సుల పరిస్థితి మరింత దారుణంగా తయారైంది. నాలుగైదు రోజులుగైతే ఎండ వల్ల సమస్య చాలా ఇబ్బందిగా ఉంది. రేకులతో ఉండే బస్సు బాడీలు ఎండకు విపరీతంగా వేడెక్కుతుండటంతో, బస్సు లోపల ప్రయాణించడం ప్రయాణికులకు, డ్రైవర్లకు నరకప్రాయంగా మారింది. గతంలో ఎండ తీవ్రతను తగ్గించేందుకు బస్సులపైన తడి గోనె సంచులు వేయడం, నీళ్లు కొట్టడం వంటి చర్యలు చేపట్టేవారు. ఇప్పుడు అలాంటి ఏర్పాట్లు ఏమీ లేకపోవడంతో డ్రైవర్లు వడదెబ్బకు గురయ్యే ప్రమాదం పొంచి ఉంది. రోజురోజుకీ ఎండల తీవ్రత పెరుగుతున్న దృష్ట్యా ప్రయాణికులకు ఉపశమనం కలిగించేలా తక్షణ చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -