తేలనున్న కేరళ, తమిళనాడు, అసోం, పుదుచ్చేరి, పశ్చిమ బెంగాల్ భవితవ్యం
ఎగ్జిట్ పోల్స్‌లో నిఖార్సెంత..?
చెన్నై : ఇటీవల జరిగిన నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతం అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు సోమవారం వెలువడనున్నాయి. కేరళ, తమిళనాడు, అసోం, పుదుచ్చేరి, పశ్చిమబెంగాల్‌లో నేడు ఓట్ల లెక్కింపు ప్రారంభంకానుంది. ఈ ఎన్నికల ఫలితాలు దేశ భవిష్యత్ రాజకీయాలకు దిశానిర్దేశం చేయనున్నాయి. వామపక్షాలు, టీఎంసీ, డీఎంకే, కాంగ్రెస్, బీజేపీలకు ఈ ఫలితాలు కీలకం కానున్నాయి.
పటిష్ట భద్రత
పై రాష్ట్రాల్లో ఓట్ల లెక్కింపు కేంద్రాల్లో మూడంచెల భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేశారు.ఉదయం 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు మొదలవుతుంది. ఓట్ల లెక్కింపు కేంద్రాల్లోకి అనధికార వ్యక్తుల ప్రవేశాన్ని నిరోధించేందుకు, ఎన్నికల సంఘం (ఈసీ) ఈసారి వినూత్నంగా క్యూఆర్ కోడ్ ఆధారిత ఫోటో గుర్తింపు కార్డు విధానాన్ని ప్రవేశపెట్టింది. పశ్చిమ బెంగాల్‌లోని 293 అసెంబ్లీ స్థానాల లెక్కింపు 77 కౌంటింగ్ కేంద్రాల్లో జరగనున్నది. ఈ రాష్ట్రంలో రెండు దశల్లో ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. ఇక్కడ గతంలో ఎన్నడూ లేనట్టు 92.47 శాతం అత్యధిక ఓటింగ్ శాతం నమోదైంది. అలాగే ఇక్కడి దక్షిణ 24 పరగణాల జిల్లాలోని ‘ఫాల్తా’ నియోజకవర్గంలో ఎన్నికల నిర్వహణలో ఉల్లంఘనలు జరిగిన కారణంగా అక్కడి ఎన్నికలను రద్దు చేశారు . ఆ స్థానానికి మే 21న తిరిగి ఎన్నికలు జరగనున్నాయి. అసోంలో 126 అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి 722 మంది అభ్యర్థుల ఎన్నికల భవితవ్యం నేడు వెల్లడికానుంది. ఇక్కడ 40 కౌంటింగ్ కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు జరుగుతున్నది.
కేరళలో రెండు పర్యాయాలుగా అధికారంలో ఉన్న లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్ (ఎల్‌డీఎఫ్) మూడోసారి కూడా అధికారాన్ని కైవసం చేసుకుంటుందని ఆ కూటమి నేతలు ధీమా వ్యక్తంచేస్తున్నారు. ఇక్కడ 140 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో 883 మంది అభ్యర్థులు పోటీపడ్డారు. మొత్తం 140 కౌంటింగ్ కేంద్రాలను కేంద్ర ఎన్నికల సంఘం ఏర్పాటు చేసింది. తమిళనాడులో అధికారంలో ఉన్న డీఎంకే పార్టీ వరుసగా రెండోసారి అధికారాన్ని దక్కించుకోవాలని ఆశిస్తోంది. ఇక్కడి ఎన్నికలువిభిన్నమైన రాజకీయ వాతావరణంలో జరిగాయి. డీఎంకే ప్రధాన ప్రత్యర్థి అయిన ఏఐడీఎంకేతో పాటు, నటుడు, రాజకీయ నాయకుడు విజరు నేతృత్వంలోని టీవీకే వంటి కొత్త పార్టీలు కూడా ఈసారి ఎన్నికల బరిలో నిలిచాయి.
ఎగ్జిట్ పోల్స్‌లో నిఖార్సెంత..?
ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్ ముగిశాక..మోడీ అనుకూల కార్పొరేట్ మీడియా ఎగ్జిట్ పోల్స్‌ను విడుదల చేసింది. అందులో తమకు అనుకూలమైన రీతిలో సీట్లు వస్తాయని ప్రచారం చేసుకున్నాయి. వాస్తవానికి ఇప్పటికీ ఓటరు నాడి ఏమిటో అంతుచిక్కలేదు. ఎగ్జిట్ పోల్స్ ప్రకటించాక కూడా భిన్నమైన ఫలితాలతో అసెంబ్లీ ముఖ చిత్రాలు మారిన చరిత్ర గతంలో ఉంది. అంతిమంగా బ్యాలెట్ బాక్సుల్లో అభ్యర్థులు, పార్టీల భవితవ్యం భద్రంగా ఉంది. ఉదయం 11 గంటలలోపు తొలి ట్రెండ్ ఫలితాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి.



