Monday, May 4, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంఒప్పందం చేసుకోండి..లేకుంటే విపత్తే

ఒప్పందం చేసుకోండి..లేకుంటే విపత్తే

- Advertisement -

ట్రంప్ బెదిరింపులు
దౌత్యమా..యుద్ధమా.. నిర్ణయించుకోవాల్సింది అమెరికానే : ఇరాన్
కాల్పుల విరమణ ఉన్నప్పటికీ, యుద్ధం ముంచుకొచ్చే ప్రమాదం

నవ తెలంగాణ – జనరల్ డెస్క్
అమెరికా, ఇరాన్‌ల మధ్య కాల్పుల విరమణ ఉన్నప్పటికీ, ఉద్రిక్తతలు ఏమాత్రం తగ్గడం లేదు. ఒకవేళ ఒప్పందం కుదరకపోతే, ఇరాన్‌పై మళ్లీ దాడి చేయవచ్చని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ స్పష్టంగా పేర్కొన్నారు. దీంతో పాటు మూడు కీలక అంశాలైన అణు కార్యక్రమం, హార్ముజ్ దిగ్బంధనం, భద్రతా హామీలు వంటి అంశాలపై ఇప్పటికీ ప్రతిష్టంభన కొనసాగుతోంది. మరోవైపు ట్రంప్ ను ఏమాత్రం నమ్మలేమని ఇరాన్ అంటోంది. సముద్రపు దొంగల్లాంటి వాళ్లమంటూ ప్రకటనతో కూడా ఇరాన్ మరింత అప్రమత్తమైంది. అందుకే మా వ్యూహాల్లో మేం ఉన్నామంటూ ప్రతిస్పందిస్తోంది. దీంతో యుద్ధం జరగవచ్చనే భయాన్ని రేకెత్తిస్తోంది.
ఇరాన్ బలహీనం, ఒప్పందం తప్పనిసరి
ప్రతి వారం కొత్త సవరణలతో ప్రతిపాదనలు వస్తున్నా, ఏవీ ఆమోదం పొందడం లేదు. ఇరాన్ ఒకప్పుడు ఉన్నంత బలంగా ఇప్పుడు లేదని ట్రంప్ అంటున్నారు. ఆయన ప్రకారం, వారికి ఒప్పందం కావాలి. వారు పూర్తిగా బలహీనపడ్డారు. తమ నాయకుడు ఎవరో కూడా వారికి అర్థం కావడం లేదు. వారు నిస్సహాయులు. అని యూఎస్ అధ్యక్షుడు పేర్కోంటున్నారు. ఒప్పందం కుదరకపోతే ఏమి జరుగుతుందనేదే అతిపెద్ద ప్రశ్న. సైనిక చర్య ఒక ప్రత్యామ్నాయం అని ట్రంప్ స్పష్టంగా పేర్కొన్నారు.
“నేను ఇప్పుడే చెప్పలేను, కానీ వారు తప్పుడు నిర్ణయం తీసుకుంటే, అది సాధ్యమే” అని ఆయన అన్నారు. అమెరికా దాడి చేసే అవకాశాన్ని తెరిచి ఉంచుకుంటోందని ఇది స్పష్టంగా సూచిస్తోంది. ఇదిలా ఉండగా, హార్ముజ్ జలసంధిపై ఉద్రిక్తతలు తీవ్రమవుతూనే ఉన్నాయి. అమెరికా దిగ్బంధనం ఇరాన్ ఆర్థిక పరిస్థితిపై ప్రభావం చూపింది.
సైనిక చర్యకు అవకాశం ఉంది : ట్రంప్
ఇరాన్‌పై సైనిక చర్యకు అవకాశం ఉన్నదని ట్రంప్ సూచనప్రాయంగా చెప్పారు. ‘వారి ప్రవర్తన సరిగా లేకపోతే, వారు చెడ్డ పని చేస్తే ఏం చేయాలో చేస్తాం. సైనిక చర్యకు అవకాశం ఉంది కచ్చితంగా’ అని ఆయన ఫ్లోరిడాలో తెలిపారు. కాగా ఇరాన్‌పై యుద్ధం చేయడానికి తనకు కాంగ్రెస్ అనుమతి అవసరం లేదని ట్రంప్ స్పష్టం చేశారు. అమెరికా చట్టం ప్రకారం సైనిక చర్య చేపట్టాలంటే దేశాధ్యక్షుడికి ప్రతినిధిసభ అనుమతి తప్పనిసరి. అయితే ట్రంప్ తాజాగా కాంగ్రెస్ సభ్యులకు లేఖ రాస్తూ యుద్ధ అధికారాల చట్టానికి తాను కట్టుబడి ఉండాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పారు. ఇరాన్‌తో కుదుర్చుకున్న కాల్పుల విరమణ ఒప్పందం ఏప్రిల్ 7వ తేదీ నుంచి కొనసాగుతోందని, కాబట్టి ఫిబ్రవరి 28న ప్రారంభమైన శత్రుత్వం ముగిసిందని గుర్తు చేశారు. ఇదిలావుండగా హార్ముజ్ జలసంధి మీదుగా ప్రయాణించేందుకు ఇరాన్‌కు వ్యక్తులు కానీ, కంపెనీలు కానీ టోల్ చెల్లిస్తే తమ ఆంక్షలను ఉల్లంఘించినట్లు అవుతుందని అమెరికా ఆర్థిక శాఖ ఓ నోటీసులో హెచ్చరించింది.
అమెరికా దిగ్బంధాన్ని తప్పించుకున్న ఇరాన్ సూపర్ ట్యాంకర్
జాతీయ ఇరాన్ ట్యాంకర్ కంపెనీ (ఎన్ఐటీసీ)కి చెందిన అతి పెద్ద ముడి చమురు రవాణా నౌక సూపర్‌ట్యాంకర్ అమెరికా దిగ్బంధాన్ని దాటుకొని ఆసియా – పసిఫిక్ ప్రాంతంలోకి విజయవంతంగా ప్రవేశించింది. ఈ నౌకలో 1.9 మిలియన్ బ్యారల్స్ ముడి చమురు ఉంది. ఈ ట్యాంకర్ ప్రస్తుతం ఇండొనేషియాలోని లాంబక్ జలసంధి మీదుగా రియావూ ద్వీపసమూహం వైపు ప్రయాణిస్తోంది. ఈ నౌక వారం రోజుల క్రితం శ్రీలంక తీరంలో కన్పించిందని ట్యాంకర్ ట్రాకర్స్.కామ్ తెలిపింది. కనీసం 52 నౌకలు అమెరికా దిగ్బంధాన్ని విజయవంతంగా ఉల్లంఘించాయని ఇరాన్ ప్రభుత్వ మీడియా గత నెల 29న తెలియజేసింది.
నేర స్వభావాన్ని అంగీకరించారు : ట్రంప్ ‘సముద్ర దొంగతనం’ వ్యాఖ్యపై ఇరాన్
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తన నేర స్వభావాన్ని నేరుగానే అంగీకరించారని ఇరాన్ తెలిపింది. ఇరాన్ నౌకలపై అమెరికా నౌకాదళ చర్యలను ట్రంప్ ‘సముద్ర దొంగతనం’తో పోల్చారు. దీనిపై ఇరాన్ ఘాటుగా స్పందిస్తూ ఈ విషయంలో ఐక్యరాజ్యసమితి జోక్యం చేసుకోవాలని కోరింది. సముద్రంలో చట్టవిరుద్ధ ప్రవర్తనను ట్రంప్ బహిరంగంగానే సమర్ధిస్తున్నారని ఆయన వ్యాఖ్యలు సూచిస్తున్నాయని ఇరాన్ విదేశాంగ ప్రతినిధి ఇస్మాయిల్ బాఖై విమర్శించారు. ‘ఇరాన్ నౌకలను చట్టవిరుద్ధంగా స్వాధీనం చేసుకోవడాన్ని సముద్ర దొంగతనంగా ట్రంప్ బహిరంగంగానే అభివర్ణించారు. అంటే తాము సముద్ర దొంగల మాదిరిగా ప్రవర్తిస్తున్నామని ఆయన చెబుతున్నారు. ఇక్క మాట తూలడమంటూ ఏమీ లేదు. వారి చర్యలు అంతర్జాతీయ సముద్రయాన నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయి. ఇది వారి నేర స్వభావాన్ని బాహాటంగానే బయటపెడుతోంది. అంతర్జాతీయ సమాజం, ఐరాస సభ్య దేశాలు, ఐరాస సెక్రటరీ జనరల్ జోక్యం చేసుకొని ట్రంప్ చర్యలను ఖండించాలి’ అని ఆయన అన్నారు. అంతకుముందు ట్రంప్ మాట్లాడుతూ ‘మేము నౌకలను స్వాధీనం చేసుకున్నాం. సరకు రవాణా నౌకలను స్వాధీనం చేసుకున్నాం. ఇది చాలా లాభదాయకమైన వ్యాపారం. మేము సముద్రపు దొంగల వంటివారం. కానీ మేము ఆటలు ఆడం’ అని చెప్పారు.

ఇరాన్ తాజా ప్రతిపాదనలో ఏముంది?
అమెరికాకు పాకిస్తాన్ ద్వారా ఇరాన్ 14 సూత్రాల శాంతి ప్రతిపాదనను పంపిందని టెహ్రాన్ వార్తా సంస్థలు తస్నిమ్, ఫార్స్ అంతకుముందు తెలియజేశాయి. ఇరాన్ తన అణు కార్యక్రమాన్ని పూర్తిగా నిలిపివేసే వరకూ ఒప్పందం కుదుర్చుకునే ప్రశ్నే లేదని ట్రంప్ ఇప్పటికే అనేక సందర్భాలలో స్పష్టం చేశారు. ఇరాన్ తాజా ప్రతిపాదన ప్రకారం…ఇరాన్ పరిసర ప్రాంతాల నుంచి అమెరికా దళాలు వైదొలగాలి. హార్ముజ్ జలసంధి దిగ్బంధాన్ని తొలగించాలి. ఇరాన్ ఆస్తులపై ఫ్రీజింగ్‌ను తొలగించాలి. యుద్ధంలో జరిగిన నష్టానికి పరిహారం చెల్లించాలి. ఆంక్షలు ఎత్తివేయాలి. లెబనాన్‌పై ఇజ్రాయిల్ జరుపుతున్న దాడులు సహా అన్ని రకాల ఘర్షణలను నిలిపివేయాలి. హార్ముజ్ జలసంధిపై నియంత్రణకు సంబంధించి కొత్తగా ఓ యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలి. కాగా అణు అంశాలు పరిష్కారం కావడానికి ముందే హార్ముజ్‌ను తెరవాలని కూడా ఇరాన్ ప్రతిపాదించిందని రాయిటర్స్, ఇతర వార్తా సంస్థలు తెలిపాయి. తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందం కంటే యుద్ధాన్ని ముగించేందుకు సమగ్ర పరిష్కారాన్ని సాధించడానికే ప్రాధాన్యత ఇవ్వాలని ఇరాన్ సూచిస్తోంది. రెండు నెలల పాటు కాల్పుల విరమణను కొనసాగించాలని అమెరికా ప్రతిపాదించగా అందుకు ఇరాన్ ఇష్టపడడం లేదు. అన్ని కీలక అంశాలను 30 రోజుల్లో పరిష్కరించుకోవాలని పట్టుబడుతోంది. ముఖ్యంగా మధ్యప్రాచ్యంలో భద్రత, ఆర్థిక అంశాలపై ఇరాన్ దృష్టి పెట్టింది. అమెరికా – ఇజ్రాయిల్ దాడుల కారణంగా జరిగిన నష్టానికి పరిహారం చెల్లించాలని ఇరాన్ మొదటి నుంచీ కోరుతూనే ఉంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -