Monday, May 4, 2026
E-PAPER
Homeకరీంనగర్కరీంనగర్‌లో పట్టపగలే తుపాకుల మోత

కరీంనగర్‌లో పట్టపగలే తుపాకుల మోత

- Advertisement -

పీఎంజే జ్యువెలరీలో ‘సినిమా ఫక్కీ’లో రక్తపాతం..భారీ దోపిడీ
కస్టమర్ల ముసుగులో వచ్చి రెచ్చిపోయిన ఐదుగురు దుండగులు
నగలు దోచుకుంటూ.. అడ్డుకున్న సిబ్బందిపై విచక్షణారహితంగా కాల్పులు
రక్తపు మడుగులో నలుగురు ఉద్యోగులు.. ఒకరి పరిస్థితి విషమం
పారిపోతూ గాలిలోకి ఫైరింగ్‌..దొరికిన కీలక ఆధారాలు
రంగంలోకి దిగిన ఐజీ, సీపీ..

ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా హై అలర్ట్‌, నాకాబందీ
బాధితులకు అండగా నిలిచిన రాజకీయ నేతలు, మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌కు తరలింపు

నవతెలంగాణ – కరీంనగర్‌ ప్రాంతీయ ప్రతినిధి / కరీంనగర్‌ క్రైమ్‌
కరీంనగర్‌ నగరం నడిబొడ్డున, ప్రశాంతంగా గడిచిపోతున్న ఆదివారం ఉదయం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. జ్యోతినగర్‌లోని అత్యంత రద్దీ ప్రాంతంలో ఉన్న ప్రముఖ పీఎంజే జ్యువెలరీ షోరూమ్‌లో పట్టపగలు తుపాకుల మోత మోగింది. అత్యంత పకడ్బందీగా, పక్కా స్కెచ్‌తో కస్టమర్ల ముసుగులో లోపలికి ప్రవేశించిన ఐదుగురు దుండగులు క్షణాల్లోనే తుపాకులతో భయానక వాతావరణం సష్టించారు. హాలీవుడ్‌ క్రైమ్‌ థ్రిల్లర్‌ను తలపించేలా అడ్డుకోబోయిన సిబ్బందిపై విచక్షణారహితంగా కాల్పులకు తెగబడి, నెత్తుటేరులు పారించి, పెద్ద ఎత్తున బంగారు ఆభరణాలతో పరారయ్యారు. ఈ దుస్సాహస ఘటన యావత్‌ తెలంగాణలో కలకలం రేపగా, దొంగల వేట కోసం పోలీస్‌ యంత్రాంగం నగరవ్యాప్తంగా నాకాబందీ విధించి జల్లెడ పడుతోంది. ఉదయం 10.45 గంటల ప్రాంతం. సిబ్బంది లాకర్ల నుంచి నగలు తీసి డిస్‌ప్లేలో పెడుతున్నారు. పక్కాగా రెక్కీ నిర్వహించిన దొంగలు.. అత్యంత అనువైన సమయం చూసి దాడికి దిగారు. రెండు బైక్‌లపై (బ్లాక్‌ పల్సర్‌, వైట్‌ అపాచీ) ఐదుగురు వ్యక్తులు వచ్చారు. ముందుగా ఒకరు లోపలికి వచ్చి 20 గ్రాముల చైన్‌ కావాలని అడిగాడు. సిబ్బంది చూపిస్తున్న క్రమంలోనే మిగతా నలుగురు లోపలికి ప్రవేశించారు. కస్టమర్ల ముసుగులో వచ్చిన వారు క్షణాల్లో తుపాకులు బయటకు తీశారు. భయానక వాతావరణం సష్టించి, షట్టర్లు మూసేసి షోరూమ్‌ను తమ గుప్పిట్లోకి తీసుకున్నారు.
ప్రాణాలకు తెగించిన సిబ్బంది..

నెత్తురోడిన షోరూమ్‌
లోపలికి రాగానే దొంగలు సిబ్బంది చేతులు వెనక్కి కట్టేసి లాకర్లు తెరవాలని బెదిరించారు. వాష్‌రూమ్‌లో భయంతో దాక్కున్న ఓ మహిళను సైతం బయటకు లాక్కొచ్చి నింపాదిగా నగలు బ్యాగుల్లో సర్దుకున్నారు. అయితే, ఈ క్రమంలో షోరూమ్‌ మేనేజర్‌, సెక్యూరిటీ, ఇతర సిబ్బంది ప్రాణాలకు తెగించి వారిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఊహించని ఈ పరిణామంతో ఖంగుతిన్న దొంగలు విచక్షణారహితంగా 7 నుంచి 8 రౌండ్ల కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో నలుగురు ఉద్యోగులు బుల్లెట్‌ గాయాలతో రక్తపు మడుగులో కుప్పకూలారు. వీరిలో ఒకరి తలకు గాయం కావడంతో పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.

పారిపోతూ గాలిలోకి ఫైరింగ్‌.. దొరికిన కీలక ఆధారాలు

నగలు దోచుకున్న అనంతరం దుండగులు బయటకు పరుగులు తీశారు. అప్పుడు కూడా గాయాలతోనే సిబ్బంది వారిని వెంబడించగా, దొంగలు గాలిలోకి కాల్పులు జరుపుతూ బైక్‌లు స్టార్ట్‌ చేశారు. ఆ కంగారులో ఒక దొంగ కిందపడిపోగా, నగలున్న ఓ బ్యాగ్‌ కూడా అక్కడే పడిపోయింది. అంతేకాకుండా, వారి తుపాకీకి చెందిన మ్యాగజైన్‌, మూడు ఖాళీ బుల్లెట్‌ షెల్స్‌, ఒక కత్తి ఘటనా స్థలంలో పడిపోయాయి. వారు హిందీ, తెలుగు మాట్లాడుతున్నారని, ఉత్తరాదికి చెందిన అంతర్రాష్ట్ర ముఠాగా అనుమానిస్తున్నారు. వీరు సిరిసిల్ల వైపు పరారైనట్లు పోలీసులు గుర్తించారు.

పోలీసుల వేట ముమ్మరం.. నలుదిక్కులా నాకాబందీ

సమాచారం అందుకున్న వెంటనే ఐజీపీ చంద్రశేఖర్‌ రెడ్డి, కరీంనగర్‌ సీపీ గౌష్‌ ఆలం హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్లూస్‌ టీమ్‌, డాగ్‌ స్క్వాడ్‌ రంగంలోకి దిగాయి. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా మాస్కులు లేని నలుగురు నిందితుల ఫొటోలను పోలీసులు విడుదల చేశారు. ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా సరిహద్దులను దిగ్బంధించి హై అలర్ట్‌ ప్రకటించారు. ఘటనా స్థలంలో దొరికిన మ్యాగజైన్‌, తూటాలు కంట్రీ మేడ్‌ వెపన్స్‌వా? లేక ఎక్కడైనా కొనుగోలు చేశారా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.

బాధితులకు నేతల భరోసా..
ఈ ఘటన జరిగిన సమయానికి సమీపంలోనే ఉన్న కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజరు కుమార్‌ వెంటనే షోరూమ్‌ వద్దకు చేరుకున్నారు. సిబ్బంది చూపిన తెగువను ప్రశంసించిన ఆయన, మెరుగైన వైద్యం కోసం బాధితులను హైదరాబాద్‌ తరలిస్తున్నట్లు వెల్లడించారు. అలాగే, హుజూరాబాద్‌ ఎమ్మెల్యే, కాంగ్రెస్‌ డీసీసీ అధ్యక్షులు మేడిపల్లి సత్యం, ఎమ్మెల్యేలు గంగుల కమలాకర్‌, పాడి కౌశిక్‌ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్‌ తదితరులు స్థానిక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించారు. కాంగ్రెస్‌ నేత వెలిచాల రాజేందర్‌ రావు స్పందిస్తూ.. ప్రభుత్వం తరఫున అన్ని విధాలా ఆదుకుంటామని, పోలీసులు అహర్నిశలు శ్రమిస్తున్నారని, ప్రజలు ఆందోళన చెందవద్దని భరోసా ఇచ్చారు.

ప్రజలకు పోలీసుల విజ్ఞప్తి
సీసీటీవీ ఫుటేజీలో కనిపించిన వ్యక్తులను ఎవరైనా గుర్తించినా, లేదా బ్లాక్‌ కలర్‌ పల్సర్‌ బైక్‌, వైట్‌ కలర్‌ అపాచీ బైక్‌లపై అనుమానాస్పదంగా సంచరిస్తున్న వ్యక్తులు కనిపించినా.. వెంటనే డయల్‌ 100 లేదా 8712670744, 8712670745 నంబర్లకు సమాచారం అందించాలని కరీంనగర్‌ పోలీసులు జిల్లా ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -