నవతెలంగాణ – పరకాల
రైతులు పండించిన మొక్కజొన్నను కొనుగోలు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి గాదె ప్రభాకర్ రెడ్డి విమర్శించారు. సోమవారం పరకాల పట్టణంలోని వ్యవసాయ మార్కెట్‌ను సందర్శించిన ఆయన, వరి, మొక్కజొన్న రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హనుమకొండ జిల్లాలో ధాన్యం, మక్కల కొనుగోళ్లు ప్రకటనలకే పరిమితమయ్యాయని, క్షేత్రస్థాయిలో ఎక్కడా కొనుగోళ్లు జరగడం లేదని మండిపడ్డారు.
గత 20 రోజులుగా కొనుగోలు కేంద్రాల వద్ద రైతులు పడిగాపులు కాస్తున్నారని, ఒకపక్క అకాల వర్షాలు, మరోపక్క తీవ్రమైన ఎండలతో అన్నదాతలు అల్లాడుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ప్రభుత్వం సకాలంలో స్పందించకపోవడం వల్ల రైతులు ప్రైవేటు వ్యాపారులకు క్వింటాకు రూ. 1700 చొప్పున అమ్ముకుంటూ, దాదాపు రూ. 700 వరకు నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం గన్ని సంచులు, తాగునీరు వంటి కనీస సౌకర్యాలు కూడా కల్పించలేదని ధ్వజమెత్తారు.
పరకాల మార్కెట్‌లో పేరుకుపోయిన మొక్కజొన్న సంచులను వెంటనే గోదాములకు తరలించాలని, కలెక్టర్ స్వయంగా కొనుగోలు కేంద్రాలను పర్యవేక్షించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి ప్రతి గింజా కొనుగోలు చేయాలని, లేని పక్షంలో ఈ నెల 11వ తేదీన జిల్లా కలెక్టరేట్ ఎదుట భారీ ఆందోళన చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) నాయకులు సారంపల్లి వాసుదేవ రెడ్డి, బొట్ల చక్రపాణి, రాగుల రమేష్, బొచ్చు కళ్యాణ్ తదితరులు పాల్గొన్నారు.




