ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు పలు పార్శ్వాలను తడిమాయి. హెచ్చరికలు, సందేశాలూ ఇస్తున్నాయి. పశ్చిమబెంగాల్, అసోం, పుదుచ్చేరి.. మూడు రాష్ట్రాల్లో బీజేపీ అధికారం చేజిక్కించుకోవడంతో దేశంలో మితవాద శక్తుల పెరుగుదలకు ఆస్కారం కలిగింది. ఇంకో వైపు పశ్చిమబెంగాల్, తమిళనాడు, కేరళం రాష్ట్రాలలో పాలక పార్టీల, కూటములను ప్రజలు ఓడించి మార్పును కోరుకున్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా నికరంగా నిలబడి పోరాడుతున్న కేరళం, తమిళనాడు ప్రభుత్వాల ఓటమి ప్రజాస్వామ్య, ప్రగతిశీల ప్రజలకు ఆందోళన కలిగిస్తుంది. మరెక్కడా ఉనికిని పెంచుకోలేని కాంగ్రెస్‌కు కేరళంలో గెలుపు ఊతకర్రగా పని చేస్తుంది. అక్కడ బీజేపీని ఎదురొడ్డి సైద్ధాంతికంగా సవాల్ చేస్తున్న ఎల్‌డిఎఫ్‌పై కాంగ్రెస్ గెలవడం గమనార్హం. వామపక్షాల సుదీర్ఘ పోరాటాల ఫలితంగానే కేరళంలో బీజేపీ తన ప్రభావం చూపలేక పోయింది. మూడు సీట్లకే ఆ కూటమి పరిమితమైంది. కేరళంలో వరుసగా రెండు తడవలు అసాధారణంగా గెలిచిన వామపక్ష ప్రజాతంత్ర సంఘటన (ఎల్‌డిఎఫ్) ప్రభుత్వం ఈ తడవ ఓడిపోవడం లౌకిక, ప్రజాతంత్ర పోరాటాలకు ఎదురుదెబ్బ. కేంద్రంలోని బీజేపీ ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఎదుర్కొని ప్రజల సంక్షేమం, హక్కుల కోసం ఎల్‌డిఎఫ్ సర్కార్ అవిరళ కృషి చేసింది.
సమాఖ్య స్ఫూర్తికి తూట్లు పొడిచి రాష్ట్రాల హక్కులను కాలరాస్తున్న మోడీ ప్రభుత్వాన్ని ఎండగట్టడంలో ముందు పీఠిన నిలబడింది. ఇక్కడ కాంగ్రెస్ నేతృత్వంలోని యుడిఎఫ్ గెలుపునకు బీజేపీ సహకరించినట్లు తెలుస్తోంది. అయినప్పటికీ మంచి ఓటింగ్‌ను, సీట్లను లెఫ్ట్ పొందగలిగింది.తమిళనాడు ఫలితం అనూహ్యం. ప్రముఖ సినీ నటుడు విజయ్ కొత్తగా పెట్టిన టివికె పార్టీకి వందకుపైన సీట్లొచ్చాయి. మరికొందరిని కలుపుకొని ఆయనే కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నట్లు వార్తలొస్తు న్నాయి. ఎవరు టివికెకి మద్దతి స్తారో త్వరలోనే తెలిసిపోతుంది. తాము బీజేపీ సిద్ధాంతానికి వ్యతిరేకమని, ఇదే సమయంలో డిఎంకె తమకు రాజకీయ శత్రువని విజయ్ ఎన్నికల్లో ప్రకటించి ప్రచారం చేశారు. పలు ప్రజాకర్షక పథకాల హామీలూ ఇచ్చారు. ప్రజలకు ఇచ్చిన మాటకు విజయ్ కట్టుబడి ఉండాలి. తమిళనాడులో డిఎంకె పరాజయం చెందగా, ఆ పార్టీ చీఫ్ ఎంకె స్టాలిన్ స్వయంగా ఓటమి పాలవడం, ఆయన ప్రభుత్వంపై ప్రజల్లో నెలకొన్న వ్యతిరేకత తెలుపుతోంది. రెండేళ్ల కింద జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో డిఎంకె కూటమి క్లీన్ స్వీప్ చేసింది. అంతలోనే డిఎంకెపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తం కావడానికి రాజకీయ సమీకరణాలు, సామాజిక అంశాలు ప్రముఖంగా పని చేశాయని అర్థమవుతుంది.బీజేపీ ఎంతగా గింజుకున్నా తమిళనాట ప్రాంతీయ ద్రవిడ పార్టీల ప్రాబల్యం ముందు నిలబడలేదని ఓటర్లు మరోసారి నిరూపితం చేశారు.పశ్చిమబెంగాల్‌లో మమత పార్టీ టిఎంసి అవినీతిమయమైంది. ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడంలో, శాంతిభ్రదతలను పరిరక్షించడంలో ఘోరంగా విఫలమైంది.
బీజేపీ మత విద్వేషాలు రెచ్చగొట్టి మెజార్టీ మతం ఓట్లను సమీకరించడంలో సక్సెస్ అయింది. బంగ్లాదేశ్ నుంచి అక్రమ చొరబాటు అంశాన్ని రాజకీయంగా ఉపయోగపెట్టుకుంది. అసోంలో ఇటువంటి మతోన్మాద కుయుక్తులతోనే అధికారాన్ని బీజేపీ నిలబెట్టుకుంది. కేంద్రపాలిత రాష్ట్రం పుదుచ్చేరిలో ఎన్‌ఆర్ కాంగ్రెస్‌తో కలిపి అధికారాన్ని కాపాడుకుంది.తమిళనాడులో వామపక్షాలకు నాలుగు సీట్లు, బెంగాల్‌లో ఒక సీటు, గుర్తించదగిన ఓటింగ్‌ను సీపీఐ(ఎం), వామపక్షాలు దక్కించుకున్నాయి. ఎన్నికల కమిషన్ (ఈసి), సహా కేంద్ర సంస్థల దుర్వినియోగం, డబ్బు, కండబలం, మద్యం ప్రవాహంలో సీపీఐ(ఎం), వామపక్షాలు చూపించిన పెర్ఫార్మెన్స్ చెప్పుకోదగినది.ఈ ఎన్నికల్లో ఎస్.ఐ.ఆర్. అమలు ప్రతిపక్షాల ఓటమికి, బీజేపీ గెలుపునకు దోహదపడినట్లు తెలుస్తోంది. తాజా ఎన్నికల ఫలితాల దన్నుతో బీజేపీ, మితవాద శక్తులు మరింత విజృంభించే ప్రమాదం పొంచి ఉంది. లౌకికవాద పరిరక్షణకు యావత్ దేశ ప్రజానీకం అప్రమత్తం కావాల్సిన సమయమిది.
హెచ్చరికలు-సందేశాలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



