Tuesday, July 7, 2026
E-PAPER
Homeఎడిట్ పేజిఅమెరికా–ఇరాన్ ఒప్పందం: శాంతి వైపా? మరో యుద్ధం వైపా?

అమెరికా–ఇరాన్ ఒప్పందం: శాంతి వైపా? మరో యుద్ధం వైపా?

- Advertisement -

నాలుగు నెలలనుండి ఇరాన్‌పై, అగ్రరాజ్యం అమెరికా, ఇజ్రా యిల్ దేశాలు సాగించిన అక్రమయుద్ధానికి ముగింపు పలుకుతూ జూన్ 17న అమెరికా, ఇరాన్‌ల మధ్య కుదిరిన ‘అవగాహనా ఒప్పం దం’తో ప్రపంచదేశాలు, ప్రజలంతా ఊపిరి పీల్చుకున్నారు. ఎందుకంటే ఈ యుద్ధ ప్రభావం ఆ దేశాలపైనేగాక ప్రపంచమంతటా ప్రభావం చూపుతుంది. డీజిల్, పెట్రోల్, గ్యాస్, ఎరువులతో సహా ఇంకా అనేక వస్తువులకు కొరత ఏర్పడి ధరలు విపరీతంగా విపరీతంగా పెరిగాయి. అవి ఇంకా పెరిగే ప్రమాదం ఏర్పడింది. ప్రపంచ మొత్తం వినియోగంలో ఇరవై శాతం ఆయిల్, గల్ప్ దేశాల నుండి ‘హార్ముజ్ జలసంధి’ ద్వారా ప్రయాణించి వివిధ దేశాలకు చేరుతుంది. అయితే అమెరికా తనపై సాగిస్తున్న అక్రమ యుద్ధానికి నిరసనగా ఇరాన్ అంతర్జాతీయ చట్టం ప్రకారం తనకు హక్కులున్న ‘హార్ముజ్ జలమార్గా’న్ని మూసివేసింది. ఇరాన్ నౌకలను అడ్డుకునే పేరుతో అమెరికా కూడా తన నావికా దళంతో మరో ‘బ్లాకేడ్‌’ నిర్మించి ఈ మార్గం బయట అడ్డుగోడ నిర్మించింది. దీంతో ఆయిల్ సంక్షోభం ఏర్పడి ప్రపంచం అతలాకుతలమైంది. మన దేశంలో సుమారు లీటరుకు పది రూపాయలు డీజిల్, పెట్రోల్‌లపై రేట్లు పెంచేశారు. రైతన్నలకు ఎరువులు దూరమయ్యాయి. ఆఫ్రికా ఖండంలో కరువు పరిస్థితులేర్పడ్డాయి. ఈ స్థితిలో అమెరికా-ఇరాన్‌ల మధ్య పాకిస్తాన్ మధ్యవర్తిగా జరిపిన చర్చలు, ‌పద్నాలుగు అంశాలతో అవగాహనా ఒప్పందం కుదిరింది. అయితే ఈ ఒప్పందం అమలులో అమెరికా వైపునుండి వారం తిరగకుండానే ఆటంకాలు ప్రారంభమయ్యాయి.

ఒప్పందానికి ఆటంకాలేమిటి? ఎందుకు?
ఒప్పందంలో వెంటనే అమలు జరగాల్సిన రెండు ముఖ్యాంశాలను అమెరికా ఉల్లంఘిం చింది. ఒప్పందం ప్రకారం ‘హార్ముజ్ జలమార్గం నుంచి ఇరాన్ అనుమతి’తో మాత్రమే నౌకలు ప్రయాణించాలి. కానీ అమెరికా దీనిని ఉల్లం ఘించి అనుమతి లేని దారిలో నౌకలను తీసుకెళ్లే ప్రయత్నంతో ఇరాన్ ఒక ఓడపై కాల్పులు జరిపింది. దీనికి ప్రతీకారంగా అమెరికా తిరిగి ఇరాన్ భూభాగాలపైన క్షిపణులతో దాడి చేసింది. దీనికి ప్రతిగా ఇరాన్ మళ్లీ బహ్రెయిన్, కువైట్ దేశాల్లోని అమెరికా స్థావరాలపైన దాడులకు పాల్పడింది. ఈ పరిణామం మళ్లీ ఇరుదేశాల మద్య ఉద్రిక్తతలకు దారితీసింది. ఒప్పందంలోని మరో ముఖ్యాంశం లెబనాన్‌ దేశం పైన అమెరికా తొత్తు ఇజ్రాయిల్ సాగిస్తున్న దాడులను వెంటనే ఆపటంతో పాటు, ఇప్పటికే ఆక్రమించుకున్న దక్షిణ లెబనాన్ భూభాగాల నుండి సైన్యాలను ఉపసంహరించాలి. దీనికి అమెరికా భాద్యత వహించాలి అనేది. కానీ ఇజ్రాయిల్ దాడులాపలేదు. రోజూ దాడులు సాగుతూనే ఉన్నాయి. ఆక్రమించిన భూభాగాలను వదలబోనని కూడా ప్రకటించింది. దీని వెనక అమెరికా హస్తం ఉంది. మరోవైపు ఇరాన్‌ను ధ్వంసం చేస్తామని, తిరిగి యుద్ధం కొనసాగిస్తామని ట్రంప్ ప్రకటనలు చేస్తున్నాడు. ఉపాధ్యక్షుడు వాన్స్ కూడా యుద్ధాన్ని విరమించటం తాత్కాలికమేననీ, బలం కూడగట్టుకుని తిరిగి ఇరాన్‌ను ఆక్రమిస్తామని బాహాటంగా ప్రకటించాడు.

తిరిగి యుద్ధం వస్తుందా?
ఒప్పందాలు కుదుర్చుకోవటం, తిరిగి వాటిని తిరగదోడటం అమెరికాకు వెన్నతో పెట్టిన విద్య. గతంలో ఇలా అనేకం జరిగాయి గాబట్టి ఇరాన్‌పై అమెరికా మళ్లీ యుద్ధం ప్రారంభిస్తారనీ, తిరిగి జలమార్గాలు మూసుకు పోయి ఆయిల్ కొరతతో సంక్షోభంలోకి కూరుకుపోతామనే భయంతో అనేక దేశాలు వణికిపోతున్నాయి. కానీ యుద్ధం వెంటనే ప్రారంభ మయ్యే అవకాశాలు లేవనే వాదనలూ, అంచనాలూ ప్రపంచ వ్యాప్తంగా జాన్ మెర్సైమర్, జెఫ్రీ సాచ్స్, పెప్ ఎక్సోబార్, సిఐఎ మాజీ అధికారి లారా, విజయ్ ప్రసాద్ లాంటి నిపుణులు, మేధావులు ఎక్కువ మంది విశ్లేశిస్తున్నారు. చెదురు,ముదురు ఘటనలు, కొన్ని ఒప్పంద ఉల్లంఘనలు జరగవచ్చేమోగాని, భారీ స్థాయిలో అమెరికా-ఇరాన్ యుద్ధం వెంటనే జరగటానికి అవకాశాలు తక్కువ. ఈ అంచనాకు కొన్ని కారణాలున్నాయి.

అమెరికా కపటత్వం
తానే స్వయంగా ప్రతిపాదించి, రాజీ చర్చలు, ఒప్పందాలు జరిపి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తిరిగి ఉల్లంఘనలకు ఎందుకు పాల్పడుతున్నాడు? యుద్ధం ద్వారా తాను ప్రకటించిన లక్ష్యాలు నెరవేరేవి కావని ఆయనకు బాగా అర్థమై, యుద్ధం కొనసాగించలేకపోవటం ఒకవైపు, పైగా ఈ యుద్ధం వల్ల ప్రపంచం ఆర్థిక సంక్షోభం అంచుల్లోకి చేరి ప్రపంచ దేశాల ఒత్తిడి ఆయనపై ఎక్కువవటం, పెరిగిన ధరలతో ఉక్కిరి,బిక్కిరై ఇరాన్‌తో ఒప్పందం కుదుర్చుకున్నాడు. కానీ అంగీకరించిన అంశాలను బట్టి ఈ ఒప్పందం అమెరికా ఓటమి తప్ప మరొకటి కాదని అమెరికాలోనే తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. ప్రజావ్యతిరేకత ట్రంప్ పట్ల మరింత పెరిగింది. దీంతో ఒప్పదం లేదనీ, తిరిగి యుద్ధం ప్రారంభిస్తామనే కపట నాటకానికి ట్రంప్ తెరలేపాడు.

ఒబామా ఒప్పందం పోలిక
రెండేండ్ల పాటు చర్చలు జరిపి ఒబామా కాలంలో(2015) అమెరికా ఇరాన్‌తో అణ్వస్త్రనిరోధంతో పాటు, ఇతర అనేక అంశాలతో ఒక ఒప్పందం కుదుర్చుకుంది. కానీ ట్రంప్ అధికారంలోకి వచ్చాక, తన భేషజాన్ని ప్రదర్శిస్తూ ఒబామా ఒప్పందం అమెరికాకు నష్టమనీ, తాను మంచి ఒప్పందం సాధిస్తాననీ ప్రగల్బాలు పలికి ఆ ఒప్పందాన్ని ఏకపక్షంగా రద్దు చేసాడు. ఆ తర్వాత ఇప్పటివరకూ చర్చలు జరిగిన ప్రతిసారీ చివరి నిమిషంలో చర్చలు వదిలేసి అమెరికా అర్థంతరంగా ఇరాన్‌పై దాడులు చేసింది. ఒప్పందం అనేది కాకుండా ఇరాన్ పాలననే మార్చేయాలని, తమ తొత్తు ప్రభుత్వాన్ని అక్కడ ఏర్పాటు చేయాలనేదే అమెరికా లక్ష్యం. అందుకే ఈ యుద్దం జరిగింది. యుద్దంలో ఓడిపోయి ఇరాన్‌కు అనుకూలమైన షరతులతో ఒప్పదంపైన సంతకాలు చేయక తప్పలేదు. ఇపుడు ఒబామా ఒప్పందంతో దీన్ని పోల్చి, ఇంటా బయటా ట్రంప్ విమర్షలెదుర్కొంటున్నాడు. ఈ అవమానభారంతో పాటు, నవంబర్‌లో జరిగే మద్యంతర ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ మరింత బలహీన పడకూడదనే ఉద్ధేశంతో కూడా అమెరికా ఇపుడీ కపట ప్రకటనలు చేస్తోంది.

అమెరికాలో ఆర్ధిక, ఆయిల్ సంక్షోభాలు!
ధరలు, అప్పులు పెరగటం, వివిధ దేశాల ‘డీడా‌‌లరైజేషన్’ ప్రయత్నాలతో అమెరికాలో ఆర్థిక సంక్షోభ పరిస్థితులేర్పడాయి. దాంతోపాటు ఇపుడీ యుద్ధంతో అమెరికాలో ‘ఆయిల్ సంక్షోభం’ కూడా రాబోతోంది. అమెరికా అవసరాలు తీరాలంటే రోజూ కోటి 25లక్షల బారెళ్ల క్రూడ్ ఆయిల్ కావాలి. దీన్ని డీజిల్, పెట్రోల్, విమాన ఇంధనాలుగా రిపైనరీలలో అభివృద్ధి చేస్తారు. క్రూడాయిల్‌ 3రకాలలో ‘హై క్రూడాయిల్‌’ మాత్రమే ఈ ఇంధనాల తయారీకి అవసరం. అది అమెరికాలో పెద్దగా ఉత్పత్తి కాదు. అందువల్ల గల్ఫ్, ఇతర దేశాలపై ఆధారపడక తప్పదు. 100బ్యారల్స్ క్రూడ్ ఆయిల్‌తో 70బ్యారల్స్ మాత్రమే ఈ ఇంధనాలు తయారవుతాయి. ఆ లెక్కన అమెరికాకు రోజుకు కోటి 70లక్షల బారల్స్ క్రూడాయిల్ అవసరమౌతుంది. కానీ ఆ దేశంలో ఉన్న వ్యూహాత్మక నిల్వలు వాళ్లే చెప్పిన లెక్కల ప్రకారం జులై మ‌ధ్య వరకూ మాత్రమై సరిపోతాయి. అందువల్ల యుద్ధం ఆపటం ద్వారా హార్ముజ్‌ జలమార్గం తెరవటం అమెరికాకు తప్పనిసరి. ఇపుడు జరిగిన యు‌ద్ధ విరమణ తరువాత కూడా ఈ మార్గం నుండి జరిగిన రవాణాలో అమెరికాకు రవాణా జరిగింది చాల తక్కువ. యూరప్‌కు దాదాపు ఒక్క ట్యాంకూ వెళ్లలేదు. జరిగిన రవాణా అంతా ఆసియా దేశాలకు ముఖ్యంగా చైనా, జపాన్, ద.కొరియా, ఇండియా ఇతర కొన్ని దేశాలకే జరిగింది. అంతేగాక ‘హార్ముజ్‌’ దాటిన తరువాత కూడా ఆ టాంకర్ అమెరికా చేరటానికి 42రోజులు పడుతుంది.

అమెరికా మిలటరీ క్యాంపులు ఖాళీ
ఒప్పందంలో మరో ముఖ్యాంశమైన ‘పశ్చిమాసియాలో అమెరికా దళాల ఉపసంహరణ’ ప్రారంభం జరుగుతోంది. ఆ దేశ యు‌ద్ధమంత్రి ‘హెగ్ సెత్‌’ ఇప్పటికే అలాంటి ఆదేశాలు ఇచ్చారు. ముఖ్యంగా బహ్రెయిన్ దేశంలో ఉన్న అమెరికా ఐదవ నావికాదళం (ఫిప్త్ ఫ్లీట్) దాదాపు ఖాళీ అయినట్లే. ఇప్పటికే దాని రోజువారీ కార్యకలాపాలు నిలిపివేసారు. సౌదీ అరేబియా, కతార్ ఇంకా కొన్ని దేశాల్లో కూడా ఈ క్రమం ప్రారంభమైంది.

పశ్చిమాసియా భవిష్యత్తు
యుద్ధం ముగిసాక పశ్చిమాసియా భవిష్యత్తు గురించి ఇపుడు ప్రధానంగా ఆ దేశాల మ‌ధ్య పరస్పర చర్చలు సాగుతు న్నాయి. ఇప్పటివరకూ అమెరికాతో రక్షణ ఒప్పందాలలో ఉన్న ఈ దేశాలు ఇపుడు అమెరికా స్థావరాల వల్ల తమకు రక్షణ లేకపోగా అవే తమపై దాడులకు కారణమవుతున్నాయనే వాస్తవాన్ని గ్రహించాయి. అందు వల్ల తామంతా ఒకటిగాఏర్పడి తమ రక్షణ తామే చూసుకునేట్లుగా చర్చలు సాగుతున్నాయి. మొదట కొన్ని దేశాలు సందేహించినా, అమెరికా ఈ ఏక్యత ఏర్పడకుండా చూడాలని ప్రయత్నించినా ఈ దేశాల మధ్య ఐక్యత ఏర్పడే అవకాశాలే ఎక్కువ. ఒప్పంద సమయంలోనేగాక ఈ ‘సెక్యూరిటీ’ చర్చల్లో అణ్వాయుధ దేశమైన పాకిస్తాన్ కూడా ముఖ్యపాత్ర వహిస్తోంది. వీరికి అండగా చైనా, రష్యాలు ఉన్నాయి. పశ్చిమాసియాలో జరుగు తున్న ఈ ముఖ్యమైన పరిణామం ఆ దేశాలకే పరిమితమయ్యేదీ కాదు. అలాగే ఆ దేశాలతోనే ప్రారంభమయిందీ కాదు. ప్రపంచవ్యాప్తంగా అమెరికన్ సామ్రాజ్యవాదానికి, దాని అడ్డగోలు ఆంక్షలకు వ్యతిరేకంగా వెల్లువెత్తుతున్న తిరుగుబాటు ఇది. ఈ క్రమం మరింత ప్రభలం కావటం అనివార్యం. ‘ఊరందరిదీ ఒక దారైతే.. ఉలిపి కట్టెది మరో దారి’ అన్నట్లుగా ఇండియా మాత్రం అమెరికా అడుగులకు మడుగులొత్తుతూ ప్రపంచ రాజకీ యాలలో అప్రదిష్టపాలవుతున్నది.

ఖొమైనీ అంత్యక్రియలు
ఫిబ్రవరి 28న ఒక వైపున చర్చలు సాగుతుండగానే అమెరికా, ఇజ్రాయిల్‌లు కుట్రపూరితంగా చేసిన దాడి ఫలితంగా చనిపోయిన ఇరాన్ ‘సుప్రీం లీడర్ అయితుల్లా ఖొమైనీ’ అంత్యక్రియలు ఈ నెల 5నుండి 9వరకూ జరుగుతున్నాయి. ఈ కార్యక్రమంలో వంద దేశాల నుండి ప్రభుత్వ నేతలతోబాటు అనేక మంది ప్రముఖులు హాజరౌతున్నారు. దాదాపు రెండు కోట్ల మంది ప్రజలు పాల్గొంటారని అంచనా. మన ప్రధాని మోడీకి కూడా ఆహ్వానం అందింది. కానీ ఆయన హాజరు కావటం లేదు. ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని పశ్చి మాసియాలో మనం కోల్పోయిన ప్రతిష్టను కొంతమేరకైనా తగ్గించుకుని ఉంటే బాగుండేది.

తమ్మినేని వీరభద్రం

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -