ఇటీవల తెలంగాణలో ఇద్దరు యూట్యూబర్లు రావణ్, కేవీఆర్‌ల అరెస్టు, ఏపీలో ఉపా కేసుల నమోదు అనేక రాజ్యాంగ ప్రశ్నలు లేవనెత్తాయి. చట్టానికి ఎవరూ అతీతులు కారు, అంతవరకు నిజమే! కానీ,ఆ చట్టాన్ని చాపలా చుట్టి అధికారం సంకలో పెట్టుకున్నప్పుడే అనేక ప్రశ్నలు తలెత్తు తాయి. రాజకీయ పార్టీలకు ఏకపక్ష అను సంధానమైన మీడియా వలన ప్రజల తరపున ప్రశ్నించే మీడియా కూడా సమస్యలెదుర్కొంటోంది. ఫలితంగా జర్నలిజం పరిధి, భాషాపై కూడా ఇప్పుడు అనుమానపు నీలినీడలు కమ్ముకొంటున్నాయి. జోసఫ్ అలియాస్ రావణ్. ఆయన ప్రశ్న అనబడే యూట్యూబ్‌లో లేవనెత్తిన ప్రశ్నల గురించి అదే రోజు అదుపులోకి తీసుకున్నారు. ఆయన ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాజీ ప్యాన్‌గా చెప్పుకుంటారు. ఆయన చేసిన తప్పు ఏమిటంటే? ఒకప్పుడు పవన్ కళ్యాణ్ వాడిన పరుష భాషనే ఇమిటేట్ చేసి దానిపై ప్రశ్నల వర్షం కురిపించాడు. ఆయన మీడియా పేరు కూడా ప్రశ్నే కనుక ప్రశ్నించాడు. ప్రశ్న తప్పుకాదు. ప్రశ్నించడం నేరం కాదు? ప్రజాస్వామ్యం బతకాలంటే ప్రశ్న ఉండాల్సిందే. కానీ ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. పవన్ కళ్యాణ్‌ను విమర్శించాడని ఆయన కార్యకర్తలు చేసిన ఫిర్యాదుపై ఆయన్ను ఏపీ పోలీసులు అరెస్టు చేసి పిఠాపురం కోర్టులో హాజరు పరిచారు.
బెయిల్ రాగానే మళ్లీ సబ్బవరంలో అరెస్టు, మళ్లీ బెయిల్,ఈసారి పాయకరావు పేటలో, మళ్లీ బెయిల్, కాకినాడ రూరల్‌లో అరెస్టు, ఇలా బెయిల్ వచ్చిన వెంటనే అదే కేసులో పదేపదే ఎన్నిసార్లు అయినా అరెస్టు చేయవచ్చుననే రాజ్యాంగ సత్యాన్ని ఏపీ పోలీసులు కనిపెట్టేశారు! ఇది కొత్తదేమీ కాదు, గతంలో పోలీ సులు అనవాయితీగా అనుసరించిన అటవీక న్యాయమే! ఇలా కాస్తా ఎక్కువసార్లు చేయడం వలన ఎబ్బెట్టుగానే ఉంది. అరెస్టు ఉద్దేశ పూర్వకమని నిర్థారణ అవుతూనే ఉంది. ఒకే అంశంపైనే ఒకే తరహా కేసులో వందల మంది పార్టీ కార్యకర్తలు ఫిర్యాదు చేస్తే వందలసార్లు అరెస్టు చేస్తారా? ఒకవేళ అదే నిజమయితే ఇది రాజ్యాంగం సవరించుకో వలసిన అంశమే. ఒక వైపు పౌరహక్కును కాపాడు తూ కోర్టు బెయిల్ ఇస్తుంటే పోలీసులు మళ్లీ మళ్లీ అరెస్టు చేయడం ఏ రాజ్యాంగ విలువలు కాపాడేందుకు? ఇప్పుడు బెయిల్ రాకుండా ఉపా చట్టం ప్రయో గించారు. ఆయన చేసిన దేశద్రోహం ఏమిటి? నిజంగా ప్రజలు ఇచ్చిన ఫిర్యాదులన్నింటినీ పోలీసు వ్యవస్థ ఇలాగే ఎఫ్‌ఐఆర్ చేస్తుందా? ఒకవేళ చేసినా విచారణ లేకుండానే కేసు నమోదు చేసుకుంటారా?
అన్నింటికీ మించి కాపులు అధికంగా ఉన్న నియోజకవర్గాల్లోనే కేసు నమోదు చేసి రావణ్‌ను ఉంచడం, ఓ గుంపు అతన్ని కొట్టే పేరుతో స్టేషన్ మీదకు దూసుకు రావడం, పోలీసులను సైతం లెక్క చేయకుండా నెట్టివేసి గోడలు దూకడం, నిర్భంధంలో ఉన్న వ్యక్తిపై దాడిచేయ బూనడం ఏరకమైన న్యాయం? చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకునే ప్రయత్నం నాన్ బెయిలబుల్ నేరం కాదా? ఒకే ఒక్క మాటపై పదే పదే రావణ్‌ను అరెస్టు చేస్తున్న పోలీసులు, తమపై దొమ్మిలకు వచ్చిన పవన్ సేనపై ఆంధ్రా పోలీసులు ఎంతమందిపై ఎన్నికేసులు నమోదు చేశారు ప్రకటించగలరా? వీడియో అవిడెన్సులు స్పష్టంగా ఉన్నాయి కదా! సాయికృష్ణ లాకప్ డెత్ తర్వాత కాపుల్లో పవన్ కళ్యాణ్ కోల్పోయిన ప్రతిష్టను, తిరిగి రావణ్ అరెస్టు, పోలీసుస్టేషన్ పైదాడుల ద్వారా భర్తీ చేసుకొనే రాజకీయ ఎత్తుగడ కోసం చట్టాన్ని ఇంత చవక బారుగా వాడుకుంటారా? ఇది పవన్ కళ్యాణ్ ప్రతిష్టను పెంచుతుందా? చంద్రబాబు రాజకీయ లౌక్యానికి పరాకాష్టనా? ఇలాంటి ప్రశ్నలు సంధించిన ప్రతిపక్షాల ఆరోపణల్లో ఎంతోకొంత నిజం లేకపోలేదు. ప్రశ్న రావణ్ విషయంలో అనుసరిస్తున్న వైఖరి, ప్రజలవాక్ స్వాతంత్ర్యతకు గొడ్డలి పెట్టు, ప్రజల ప్రశ్నించేతత్వాన్ని చంపుతుంది. పరోక్షంగా పత్రిక స్వేచ్ఛను కాలరాస్తోంది. పాత్రికేయులను భయపెట్టి చర్య, అన్నింటికీ మించి కేసులు, కోర్టులు, చట్టాలు విశ్వసనీయత కాపాడవ లసిన ప్రభుత్వాలే అవి సన్న గిల్లేలా చేస్తున్నాయి.
ప్రశ్న రావణ్ నిర్భంధంలో ఉండి వేస్తున్న ప్రశ్నలు చాలా బలమైనవి. తనను అరెస్టు చేయడం, మూక దాడులు నుండి కాపాడటం కోసం ఐదువందల మంది పోలీసులు రోజువారి వినియోగం దుర్విని యోగం కాదా? అది ప్రజల సొమ్మే కదా? అంటే ప్రజలు సొమ్ము తమ ప్రతిష్ట కోసం దుర్వినియో గం చేసే హక్కు రాజకీయ పక్షాలకు ఎవరిచ్చారు,అనేది ఆయన వేసిన అతిపెద్ద ప్రశ్న? అంతేకాదు, నన్ను తేలిక గా చంపేయగలరు, కానీ నా ప్రశ్నను మీరు చంపల ేరు? అదీ ఆయన ప్రధాన ప్రశ్న. వాస్తవమే కదా? శాసన సభ్యులైన, పార్లమెంటు సభ్యులైన చట్టాలు చేయడం వరకే వారి పని,ఇక అలాంటి రాజ్యాంగ బద్ద చట్టాలు అమలు చేసే ప్రధాన బాధ్యత ప్రభుత్వానిది, కార్యనిర్వాహణ శాఖది. కానీ, ఆధునిక ప్రభుత్వాలు ఎప్పుడో తమ పరిదులు దాటాయి. తమ పనిని ప్రజలకోసం కాకుండా , వ్యక్తిగత రాజకీయ స్వార్థం విస్తరణకు పెట్టుబడిగా వాడుకొంటున్నాయి. సిబిఐ, ఈడి,ఐటి, ఎలక్షన్ కమిషన్,కోర్టులు తదితర స్వతంత్ర రాజ్యంగా సంస్థలు అన్నింటినీ అధికార సుస్థిరత కోసం వాడుకొంటున్నారనే విమర్శలు లేకపోలేదు.
అంతేకాదు పశ్చిమబెంగాల్ బీజేపీ కొత్త ముఖ్యమంత్రి సువేందు అధికారి మరింత ముందుకు పోయి అరెస్టు చేస్తే ఏడాదిపాటు ఎవరడిగే అవకాశం లేని కొత్త చట్టం తయారు చేస్తున్నారట! ఇలా ఉంది దేశంలో ప్రజలు హక్కుల పరిస్థితి? ఏప్రభుత్వం అయినా రాజ్యాంగ సంస్థలు చేతిలోకి తీసుకోవడం అంటే నిరంకుశత్వం,అటు తర్వాత నియంతృత్వం వైపు ప్రయాణం చేయడమే. ఇప్పుడు ఈ చౌకబారు రాజకీయ క్రీడ రాష్ట్రాలకు ఎగబాకింది.ఇది ప్రజాస్వామ్యం అనబడే పదానికి విరుద్ధమైన ఆలోచనా విధానం మాత్రమే. కనుక ప్రశ్నను చంపాలనుకోవడం జవాబు చెప్పలేని అసమర్థ విధానంలో అంతర్భాగమే! కనుక ప్రశ్నను పశ్నలా కాపాడుకుందాం. అది ప్రజలకున్న ప్రాథమిక హక్కు. దాన్ని పాలకులు కాల రాయాలని చూసినా పరాభవమేతప్ప మరో భావం చరిత్రలో లేనేలేదు. ప్రశ్న ఆలోచనల మొలక! ప్రశ్న స్వేఛ్ఛ సంకేతం. ప్రశ్న ప్రజల నిరంతర హక్కుల పరిరక్షణ ఆకాంక్ష.
ఎన్.తిర్మల్, 9441864514



