Thursday, May 7, 2026
E-PAPER
Homeఎడిట్ పేజిసంక్షోభం-సామ్రాజ్యవాద వ్యూహం

సంక్షోభం-సామ్రాజ్యవాద వ్యూహం

- Advertisement -

నయా ఉదారవాద విధానాల అమలుతో ప్రపంచ పెట్టుబడిదారీ వ్యవస్థ ముందు దారి ఇప్పుడు మూసుకు పోయింది. దీనికి కారణం ఏమిటో వివరిస్తాను. నయా ఉదారవాద విధానాల అమలులో భాగంగా సంపన్న పెట్టుబడిదారీ దేశాల నుండి పెట్టుబడి మూడవ ప్రపంచ దేశాలకు మళ్లింది. ఇది ఆ విధానపు ఒక ప్రధాన లక్షణం. దాని వలన సంపన్న పెట్టుబడిదారీ దేశాల్లో వేతనాలు పెరగకుండా తొక్కిపెట్టడం సాధ్యపడింది. అక్కడి కార్మికులు తమ కన్నా చాలా తక్కువ స్థాయిలో వేతనాలు ఉన్న మూడవ ప్రపంచ దేశాల కార్మికులతో పోటీ పడవలసిన స్థితి ఏర్పడింది. అదే సమయంలో మూడవ ప్రపంచ దేశాలలో ప్రవేశించిన కొత్త టెక్నాలజీ ఫలితంగా అక్కడి కార్మికుల ఉత్పాదకత బాగా పెరిగింది. కాని అక్కడి నిరుద్యోగం మాత్రం కొనసాగుతూనే వచ్చింది. దీని ఫలితంగా ఆ మూడవ ప్రపంచ దేశాల కార్మికుల వేతనాలూ బాగా హీన స్థితిలోనే కొనసాగుతూ వచ్చాయి. ప్రపంచం మొత్తం మీద కార్మికుల నిజ వేతనాల్లో పెరుగుదల ఏమీ లేకపోగా, ప్రతీ చోటా ఉత్పాదకత మాత్రం పెరిగింది. దాని ఫలితంగా ఉత్పత్తి అయిన సంపదలో ఏర్పడిన మిగులులో పెట్టుబడిదారుల వాటా ప్రపంచం మొత్తం మీద పెరిగింది. ప్రతీ దేశంలోనూ పెరిగింది. కార్మికుల ఆదాయాల్లో అత్యధిక భాగాన్ని వారు వినియోగిస్తారు. అదే పెట్టుబడిదారుల లాభాలు ఎంత పెరిగినా, వారి వినియోగం అదే మోతాదులో పెరగదు. ఇప్పుడు కార్మికుల ఆదాయాల వాటా తగ్గి. పెట్టుబడిదారుల లాభాల వాటా పెరిగినందున ఉత్పత్తి అయిన సంపద చెల్లకుండా మిగిలిపోతుంది. దీనినే అధికోత్పత్తిగా ఆర్థిక వేత్తలు పరిగణిస్తారు. ఎప్పుడైతే మార్కెట్‌లో సరుకులు అమ్ముడు పోకుండా మిగిలి పోతాయో, అప్పుడు వాటి ఉత్పత్తిని తగ్గించి వేస్తారు. దాంతో ఆ మేరకు కార్మికుల ఉద్యోగాలు కూడా తగ్గిపోతాయి. నిరుద్యోగం స్థాయి పెరిగిపోతుంది. అమెరికాలో రియల్‌ ఎస్టేట్‌ బుడగ పేలిపోయినప్పటి నుంచీ (2008) ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో జరుగుతున్నది ఇదే.

ఆర్థిక మాంద్య నెలకొనడం, నిరుద్యోగం స్థాయి పెరగడడం-వీటిని బట్టే పెట్టుబడిదారీ వ్యవస్థ ముందు దారి మూసుకు పోయిందని నిర్ధారించలేం. ఈ ఇబ్బందులను అధిగమించడానికి ప్రభుత్వాలు ఏమీ చేయలేని స్థితిలో ఉండిపోవడాన్ని బట్టి ముందు దారి మూసుకుపోయిందని చెప్పగలం. ఇలా ఆర్థిక మాంద్యం నెలకొన్నప్పుడు, నిరుద్యోగం పెరిగిపోయినప్పుడు ప్రభుత్వాలు జోక్యం కల్పించుకునే విధానాన్ని కీన్స్‌ ప్రతిపాదించి వున్నాడు. అయితే ఇప్పుడు నయా ఉదారవాద విధానాల వలన ప్రభుత్వాలు అలా జోక్యం కల్పించుకోలేని స్థితిలో పడ్డాయి. స్థూల డిమాండ్‌ను పెంచడానికి ప్రభుత్వ వ్యయాన్ని పెంచాలి. ఆ అదనపు వ్యయానికి కావలసిన ఆర్థిక వనరులను బడ్జెట్‌లో ద్రవ్యలోటును పెంచడం ద్వారా కాని, సంపన్నులపై అధిక పన్నులను విధించడం ద్వారా కాని సమీకరించాల్సి వుంటుంది. అలా కాకుండా శ్రామిక ప్రజల మీద అధిక పన్నులను విధించి అదనపు ఆర్థిక వనరులను సమీకరించడానికి ప్రభుత్వం పూనుకుంటే దాని వలన స్థూల డిమాండ్‌ ఏమీ పెరగదు. ఉదాహరణకు: ప్రభుత్వ వ్యయాన్ని రూ.100 మేరకు పెంచాలని అనుకుంటే, అప్పుడు ఆ రూ.100 ను శ్రామిక ప్రజల మీద పన్నులు అదనంగా వేసి సమీకరించడానికి పూనుకుందనుకుందాం. ఆ శ్రామిక ప్రజలు తమ వద్దనున్న ఆదాయాలను ఎటుతిరిగీ ఖర్చు చేస్తారు. ఖర్చయిపోయే ఆ మొత్తంలోంచి పన్నులు వసూలు చేసి ప్రభుత్వం ఖర్చు చేయడం వలన స్థూల డిమాండ్‌ ఏమీ పెరగదు కదా. అందువలన ఆర్థిక మాంద్యమూ ఉపశమించదు, నిరుద్యోగమూ తగ్గదు. అందుచేత సంపన్నుల మీద అదనపు పన్నులు వేయడం కాని, బడ్జెట్‌లో ద్రవ్య లోటును పెంచడం కాని చేయాలి.

కాని ద్రవ్య పెట్టుబడి ఈ రెండింటికీ వ్యతిరేకం. ఈ సంపన్నుల్లో ఎక్కువ భాగం ద్రవ్య పెట్టుబడి కలిగివున్నవారే ఉంటారు. ఇక్కడ ప్రభుత్వం ఒక దేశానికి సంబంధించిన జాతీయ ప్రభుత్వంగా ఉన్నప్పటికీ, అది అంతర్జాతీయ రూపం పొందిన ద్రవ్య పెట్టుబడి ఆదేశాలకు అనుగుణంగా నడుచుకోవలసిందే. అలా నడుచుకోడానికి నిరాకరిస్తే అప్పుడు దేశ ఆర్థిక వ్యవస్థ నుండి ద్రవ్య పెట్టుబడి వెంటనే సరిహద్దులు దాటి బైటకు పోతుంది. అది సంక్షోభానికి దారి తీస్తుంది. ఈ విధంగా నయా ఉదారవాద విధానమే ప్రస్తుత సంక్షోభం నుంచి బయటపడేందుకు ఉన్న ఒక్కదారినీ మూసివేసింది. ఇప్పుడు సంక్షోభం ఏర్పడినదీ నయా ఉదారవాద విధానాలను అనుసరించడం వలనే. దాన్నుంచి బయటపడే దారిని మూసివేసినదీ ఆ నయా ఉదారవాద విధానాలే. ఈ సంక్షోభం నుంచి బయట పడేందుకు ఇప్పటిదాకా పెట్టుబడిదారీ వ్యవస్థ అనుసరించిన మార్గం నయా ఫాసిజాన్ని ప్రోత్సహించడం. కార్పొరేట్‌-ఫాసిస్టు కూటమిని ఏర్పాటు చేసి ప్రజల దృష్టిని పక్కకు మరల్చేలా కొంతమంది ప్రజలను ”పరాయివారి”గా చిత్రించి ఆ మత లేదా జాతిపరమైన మైనారిటీ ప్రజల పట్ల విద్వేష భావాన్ని రగల్చడం జరుగుతోంది. ఇలా చేయడం వలన శ్రామిక ప్రజలు చీలిపోతారు. ఆర్థిక మాంద్యం, నిరుద్యోగం చుట్టుముట్టినా గుత్తపెట్టుబడి పెత్తనాన్ని ఎదిరించే శక్తి లేనివారిగా మిగిలిపోతారు. అయితే, నయా ఫాసిస్టు శక్తులు కూడా ఆర్థిక అంశాలను ఎంతో కాలం పాటు పక్కన పెట్టలేవు. పరిస్థితి నుంచి బయట పడడానికి వాటికీ ఒక ఆర్థిక ఎజెండా అవసరమౌతుంది. డొనాల్డ్‌ ట్రంప్‌ దగ్గర అటువంటి ఎజెండా స్పష్టంగా కనిపిస్తోంది. నయా ఉదారవాద సమర్థకులు మాత్రం రకరకాల వాదనలు చేస్తున్నారు. అసలు ఆర్థిక సంక్షోభమే లేదు పొమ్మంటున్నారు. సంక్షోభానికి, ప్రపంచ వ్యాప్తంగా నయా ఫాసిస్టు శక్తులు ముందుకు రావడానికి మధ్య ఏ సంబంధమూ లేదనంటున్నారు. ట్రంప్‌ చేపడుతున్న చర్యలన్నీ మతి స్థిమితం లేనివాడి చర్యలుగా పరిగణిస్తున్నారు. ఇక్కడ ట్రంప్‌ మతి స్థిమితం ఉన్నవాడా లేడా అన్నది కానే కాదు. నయా ఉదారవాదం ముందున్న దారి మూసుకుపోయిన పరిస్థితిలో ట్రంప్‌ చర్యలను మనం పరిశీలించాలి.

అమెరికా నయా ఉదారవాద చట్రం నుండి బయట పడిపోవాలని, కాని మూడవ ప్రపంచ దేశాలు మాత్రం ఆ చట్రం లోపలే ఇరుక్కుని ఉండిపోవాలని ట్రంప్‌ వ్యూహం కోరుకుంటోంది. అతగాడు సాగిస్తున్న అధిక సుంకాల దాడిలో, భారతదేశం వంటి దేశాల మీద రుద్దుతున్న వాణిజ్య ఒప్పందాలలో ఈ వ్యూహపు దాడి కనిపిస్తోంది. భారతదేశంతో కుదుర్చుకున్న వాణిజ్య ఒప్పందం ఫలితంగా అమెరికా భారతీయ దిగుమతుల మీద గతంలో కన్నా ఎక్కువ సుంకాలను వసూలు చేస్తుంది. కాని భారతదేశం మాత్రం అమెరికా నుండి వచ్చిపడే దిగుమతుల మీద గతం కన్నా తక్కువ రేటులో సుంకాలను వసూలు చేయవలసి వుంటుంది. అంతేకాదు, గతంలో కన్నా ఎక్కువ మోతాదులో అమెరికా నుండి నిర్దిష్ట గడువు లోపల అధిక మొత్తాల్లో సరుకులను తప్పనిసరిగా దిగుమతి చేసుకోవలసివుంటుంది.

ఒకపక్క నయా ఉదారవాద సిద్ధాంతం మార్కెట్‌ను దైవంగా పరిగణించాలని, వాణిజ్యం ఎటువంటి నిబంధనలూ లేకుండా స్వేచ్ఛగా సాగాలని ప్రబోధిస్తుంది. కాని ట్రంప్‌ మాత్రం నయా ఉదారవాద సిద్ధాంతాన్ని ధిక్కరించి అమెరికా వరకూ తనకు నచ్చిన రీతిలో నిబంధనలు విధిస్తూ పోతున్నాడు. మనం అమెరికా నుంచి ఎంతెంత ఎప్పుడెప్పుడు దిగుమతి చేసుకోవాలో నిర్దేశిస్తున్నాడే తప్ప భారతదేశం నుండి అమెరికా కూడా అదే విధంగా ఎంతెంత దిగుమతి చేసుకోవాలో అది మాత్రం పేర్కొనడం లేదు. దాన్ని మాత్రం మార్కెట్‌కు వదిలివేయాలంటున్నాడు. అంటే అమెరికా వరకూ నయా ఉదారవాద సూత్రాన్ని పాటించదు కాని భారతదేశం మాత్రం పాటించి తీరవలసిందే అంటున్నాడు. ఇలా ఒప్పందాలను రుద్దడం వెనుక లక్ష్యం ఏమిటి? భారతదేశం నుండి, తక్కిన మూడవ ప్రపంచ దేశాల నుండి కొన్ని రకాల ఉత్పత్తి కార్యకలాపాలను తిరిగి అమెరికాకు తరలించుకుపోవడమే లక్ష్యం. అప్పుడు అమెరికాలో ఆర్థిక మాంద్యం తగ్గి దానితోబాటు నిరుద్యోగమూ తగ్గుతుంది. మరొకవిధంగా చెప్పాలంటే ట్రంప్‌ ఈ వాణిజ్య ఒప్పందాల ద్వారా తన దేశంలోని ఆర్థిక మాంద్యాన్ని, అధిక నిరుద్యోగాన్ని మూడవ ప్రపంచ దేశాలకు ఎగుమతి చేస్తున్నాడు!

ఇటువంటి అసమాన ఒప్పందాలు గతంలో వలస పాలనా కాలంలో జరిగేవి. అందుచేత ట్రంప్‌ ఇప్పుడు తీసుకుంటున్న చర్యలు మనకు మళ్లీ గత కాలపు వలస పాలనను తలపిస్తున్నాయి. మళ్లీ ప్రపంచాన్ని తమ వలసాధిపత్యం కిందకు తెచ్చుకోడానికి సామ్రాజ్యవాదం ప్రయత్నిస్తోంది. మూడవ ప్రపంచంలో ఉన్న ఖనిజ నిక్షేపాలను, ముఖ్యంగా చమురు నిక్షేపాలను తమ అదుపు లోకి తెచ్చుకోడానికి ఇప్పుడు అమెరికా ప్రయత్నిస్తోంది. రెండవ ప్రపంచ యుద్ధం అనంతరం రాజకీయంగా మూడవ ప్రపంచ దేశాలు వలస పెత్తనం నుంచి విముక్తి పొందగలిగాయి. ఆ తర్వాత ఆ దేశాలు తమ తమ దేశాల్లోని సహజ వనరుల మీద కూడా సామ్రాజ్యవాదుల పెత్తనం లేకుండా చేయడానికి పూనుకున్నాయి. ఆ క్రమంలో అవి విజయం సాధించడానికి ఆనాడు సోవియట్‌ యూనియన్‌ ఉనికిలో ఉండడం చాలా వరకూ దోహదం చేసింది. నయా ఉదారవాదం ఈ క్రమాన్ని తిరగదోడేందుకు పూనుకుంది. ఇప్పుడు ట్రంప్‌ ఈ తిరగదోడే ప్రక్రియను పూర్తి చేయడానికి వ్యూహం పన్నాడు. ప్రపంచంలో రెండవ అతి పెద్ద చమురు నిక్షేపాలు ఉన్న వెనిజులా మీద అమెరికా చేసిన దాడి, ఆ తర్వాత ఇప్పుడు ఇరాన్‌ మీద దాడి ఆ వ్యూహంలో భాగమే.

అంతర్జాతీయ న్యాయ సూత్రాలను, నియమ నిబంధనలను అమెరికా ఎందుకు ఉల్లంఘిస్తోందో అర్ధం కావాలంటే ఈ వ్యూహం బోధపడాలి. ఇప్పుడు ఉనికిలో ఉన్న అంతర్జాతీయ నిబంధనల పరిధిలో కూడా మూడవ ప్రపంచ దేశాలను మళ్లీ తమ వలసలుగా మార్చివేయడానికి అవకాశాలు ఉన్నాయి. కాని, ఇప్పుడు సామ్రాజ్యవాదం ముందు, ప్రపంచ పెట్టుబడిదారీ వ్యవస్థ ముందున్న దారి మూసుకుపోయిన పరిస్థితిలో సంపన్న పెట్టుబడిదారీ దేశాల వరకు నయా ఉదారవాద చట్రం నుంచి బైటపడి, అదే సమయంలో మూడవ ప్రపంచ దేశాలను అదే చట్రంలో మరింత గట్టిగా బిగించి ఉంచాలంటే మాత్రం అంతర్జాతీయ నియమ నిబంధనలను అతిక్రమించి వ్యవహరించడం సామ్రాజ్యవాదానికి తప్పనిసరి.

ప్రస్తుత సంక్షోభ పరిస్థితి నుండి బయటపడడానికి అందరికీ ప్రయోజనకరంగా ఉండే పరిష్కారాన్ని సూచించలేకపోవడం సామ్రాజ్యవాదపు బలహీనతను తెలియజేస్తోంది. ప్రజలందరి జీవన పరిస్థితులను మెరుగు పరుస్తామన్న హామీని కూడా ఇవ్వలేని పరిస్థితిలోకి పెట్టుబడిదారీ వ్యవస్థ పడిపోయింది. కొన్ని దేశాలు సంక్షోభం నుంచి బైట పడాలంటే మరికొన్ని దేశాలు మరింత సంక్షోభంలో కూరుకు పోవలసిందేనని సామ్రాజ్యవాద వ్యూహం ప్రకటిస్తోంది. మరి ఇటువంటి అసమాన వాణిజ్య ఒప్పందాలకు, ఒత్తిళ్లకు మూడవ ప్రపంచ దేశాల ప్రభుత్వాలు ఎందుకు తలొగ్గుతు న్నాయి? అటువంటి ఒప్పందాలు మళ్లీ మనల్ని వలసపాలన లోకి తీసుకుపోతాయని తెలిసినా ఎందుకు అంగీకరిస్తున్నాయి? ఈ ఒప్పందాల వలన మూడవ ప్రపంచ దేశాలలోని శ్రామిక ప్రజలు, చిన్న ఉత్పత్తిదారులు (రైతులు,చేతివృత్తిదారులతో సహా) చిన్న పెట్టుబడిదారులు సైతం నష్టపోతారు కాని అంతర్జాతీయ ద్రవ్య పెట్టుబడితో సన్నిహితంగా పెనవేసుకుపోయిన గుత్త పెట్టుబడిదారీ కార్పొరేట్లు మాత్రం నష్టపోరు. పైగా వారికి ఎంతో కొంత ప్రయోజనం కూడా కలగవచ్చు. మూడవ ప్రపంచ దేశాల్లోన్ని ప్రభుత్వాలు, ముఖ్యంగా నయా ఫాసిస్టు శక్తులు అధికారంలో ఉన్న చోట్ల పని చేసేది ఈ గుత్త పెట్టుబడిదారీ కార్పొరేట్ల కోసం మాత్రమే. గతంలో సామ్రాజ్యవాదుల వలస దోపిడీ నుంచి విముక్తి పొందడానికి పోరాడిన ఐక్య సంఘటనలో భాగంగా ఉండిన ఈ గుత్త పెట్టుబడిదారులు ఇప్పుడు ఆ సంఘటనను చీల్చి తామూ సామ్రాజ్యవాదులతో చేయి కలపడం వల్లనే మళ్లీ వలస పాలన ప్రమాదం నడినెత్తి మీదికొచ్చింది. (స్వేచ్ఛానుసరణ)

ప్రభాత్‌ పట్నాయక్‌

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -