Wednesday, May 6, 2026
E-PAPER
Homeఎడిట్ పేజిఎందుకోసం వ‌స్తున్నారు?

ఎందుకోసం వ‌స్తున్నారు?

- Advertisement -

ఐదు రాష్ట్రాల ఎన్నిక‌లు ముగిశాయి. వాటి ఫ‌లితాలు వెలువ‌డ‌క‌ముందే హైద‌రాబాద్‌లో పెద్ద పెద్ద హోర్డింగులు వెలిశాయి. ఈనెల ప‌దిన ప్ర‌ధాని మోడీ హైద‌రాబాద్‌కు వ‌స్తున్నారు.. ప‌రేడ్ గ్రౌండ్‌లో పెద్ద స‌భ పెడతార‌నేది వాటి సారాంశం. ఇంత‌కీ అక‌స్మాత్తుగా మోడీజీకి తెలంగాణ రావాల‌న్న కోరిక ఎందుకు పుట్టింది? మండుటెండ‌ల్లో భాగ్య‌న‌గ‌రానికి వ‌చ్చి ఆయ‌న ఏం చెప్ప‌బోతున్నార‌నేది ఆస‌క్తిక‌రంగా మారింది. గ‌త పన్నేండేండ్లుగా వివిధ రాష్ట్రాల్లో ఎన్నిక‌లు వ‌చ్చిన‌ప్పుడ‌ల్లా భార‌త‌దేశ స‌రిహ‌ద్దుల్లోనో, దేశంలోని వివిధ ప్రాంతాల్లోనో, ఎక్క‌డో ఏదో ఒక మూల‌న అనుకోని సంఘ‌ట‌న జ‌ర‌గ‌టం, వాటిని బీజేపీ త‌న ఎన్నిక‌ల ప్ర‌చారాస్త్రంగా వాడుకోవ‌టం ష‌రా మామూలైపోయింది. ఆ ర‌కంగా ఆ పార్టీ ప‌లు రాష్ట్రాల్లో లాభప‌డ్డ‌ది కూడా. మ‌రిప్పుడు తెలంగాణ‌తోపాటు ఏ రాష్ట్రంలోనూ ఎన్నిక‌లు లేవు. పైగా ఇటీవ‌ల వ‌చ్చిన ఫ‌లితాలు బీజేపీకి అనుకూలంగా ఉన్నాయి. అయినా మోడీ హైద‌రాబాద్‌కు వ‌స్తున్నారు.. ఎందుక‌నేదే అస‌లు సిస‌లు ప్ర‌శ్న‌. దీనికి బీజేపీ ప‌రివారం చెబుతున్న స‌మాధానాలు, వాస్త‌వ ప‌రిస్థితికి ఎంత‌మాత్ర‌మూ పొంత‌న లేకుండా ఉన్నాయి. అభివృద్ధి గురించి చెప్ప‌టానికే ప్ర‌ధాని హైద‌రాబాద్‌కు వ‌స్తున్నార‌నేది ఆ పార్టీ నేత‌ల ఉవాచ‌. కానీ పీఎం రాక నేప‌థ్యంలో ప్ర‌మాద‌క‌ర‌మైన సంకేతాలు బ‌లంగా విన‌బ‌డుతున్నాయి. ఈవీఎమ్‌ల ట్యాంప‌రింగ్‌, స‌ర్…త‌దిత‌ర త‌మకే సాధ్య‌మైన ట‌క్కుట‌మారా గ‌జ‌క‌ర్ణ గోక‌ర్ణ విద్య‌ల‌తో తూర్పున ఉన్న బెంగాల్ వ‌రకు పాకిన క‌మ‌ల‌ద‌ళం ఇప్పుడు ద‌క్షిణాదిన పాగా వేసేందుకు ర‌క‌ర‌కాల జిమ్మిక్కులు చేస్తోంది. ఇందుకు హైద‌రాబాద్‌ను వేదిక‌గా ఎంచుకోవాల‌న్న‌ది కాషాయ ప‌రివారం ఎత్తుగ‌డ‌. ఎందుకంటే మ‌త విద్వేషాలను రెచ్చ‌గొట్టి లాభ‌ప‌డేందుకు ఇది అనువైన ప్ర‌దేశంగా బీజేపీ భావిస్తోంది కాబ‌ట్టి. ఇక్క‌డ ముస్లిం మైనారిటీ జ‌నాభా ఎక్కువ‌గా ఉంటుంది గనుక… ఆ పేరిట హిందూ ఓట్ల‌న్నింటినీ గంప‌గుత్త‌గా తమ‌వైపున‌కు తిప్పుకుంటే త‌న ప‌ని మ‌రింత ఈజీ అవుతుంద‌ని ఆ పార్టీ ఆలోచనగా కనిపిస్తోంది. ఆ రకంగా త్వ‌ర‌లో నిర్వ‌హించ‌బోయే హైద‌రాబాద్ మ‌హా న‌గ‌ర పాల‌క సంస్థ (జీహెచ్ఎమ్‌సీ) ఎన్నిక‌ల్లో మొద‌ట గెల‌వాల‌న్న‌ది బీజేపీ వ్యూహంగా చర్చ కూడా సాగుతోంది. గ‌త అసెంబ్లీ, పార్ల‌మెంటు ఎన్నిక‌ల్లో ఎనిమిదేసి సీట్ల‌ను గెలుచు కున్న‌ప్ప‌టికీ తెలంగాణ‌లో దాని భావ‌జాల ప్ర‌భావం అంత‌గా ప‌ని చేయ‌లేదు. అందుకే ఈసారి జీహెచ్ఎమ్‌సీలో పాగా వేయ‌టం ద్వారా ఆ ప‌ని మొద‌లు పెట్టాల‌ని చూస్తున్నట్టు కనబడుతోంది. ఇందుకు ఆంధ్రాలోని కూట‌మి పార్టీలైన టీడీపీ, జ‌న‌సేన‌ను కూడా హైద‌రాబాద్‌లో వాడుకోవాల‌న్న‌ది మోడీ- షా స్ట్రాట‌జీగా విశ్లేష‌కుల అభిప్రాయ‌ం. ఇలాంటి కుట్ర‌లు, కుతంత్రాల‌కు బీజం వేసేందుకు వీలుగా ప్రధాని హైద‌రాబాద్‌లో అభివృద్ధి పేరిట సుద్ద‌పూస మాట‌లు మాట్లాడ‌బోతున్నారా? స‌రే… కానీ కాసేపు అభివృద్ధి గురించే మాట్లాడుకుందాం… ప‌న్నెండేండ్లపాటు తెలంగాణ‌ను విస్మ‌రించిన మోడీకి ఇప్పుడే ఈ రాష్ట్రం ఎందుకు గుర్తుకొస్తోంది? విభ‌జ‌న హామీల‌ను అట‌కెక్కించి, జీఎస్టీలో రాష్ట్రానికి ఇవ్వాల్సిన వాటా ఇవ్వ‌కుండా రిక్త‌హ‌స్తం చూపించి, 15వ ఆర్థిక సిఫార‌సుల‌ను బుట్ట‌దాఖ‌లు చేసినందుకా ఆయ‌న హైద‌రాబాద్‌కు వ‌స్తున్నారు? ప‌లు ప్రాజెక్టుల‌కు జాతీయ హోదా ఇవ్వ‌కుండా ఎండ‌బెట్టినందుకా.. ఆయ‌న అభివృద్ధి మాట‌లు మ‌నం వినాలి? ఇక్క‌డే మోడీ, ఆయ‌న ప‌రివారం… ఒక్క విష‌యం గుర్తు పెట్టుకోవాలి.. మీరెన్ని జిమ్మిక్కులు చేసినా.. తెలంగాణ‌లో మీ ప‌ప్పులుడ‌క‌బోవు. ఎందుకంటే ఇది రైతాంగ సాయుధ పోరాటంతో పునీత‌మైన గ‌డ్డ. ఇక్క‌డ సామాజిక దృక్ప‌థంతోపాటు రాజ‌కీయ చైత‌న్య‌మూ ఎక్కువే. మ‌త చిచ్చు పెడితే రెచ్చిపోవ‌టానికి ఇది ఉత్త‌రప్ర‌దేశో లేక మ‌ణిపూరో కాదు. ఇది ప‌ర‌మ‌త స‌హ‌నానికి ప్ర‌తీక‌. గంగా జ‌మూనా తెహ‌జీబ్ అనే దానికి అసలు సిస‌లు నిర్వ‌చ‌నం. అయితే ఇవ‌న్నీ ఉన్న‌ప్ప‌టికీ ఇక్క‌డి లౌకిక పార్టీలు, ప్ర‌జ‌లు, ప్ర‌జాస్వామ్య వాదులంద‌రూ అప్ర‌మ‌త్తంగా ఉండాలి. ఎందుకంటే అధికారం కోసం మ‌తాన్ని వాడుకోవ‌టానికి సిద్ధ‌మైన‌వాడు.. ఎంత‌కైనా తెగిస్తాడు… త‌స్మాత్ జాగ్ర‌త్త‌…

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -