Friday, May 8, 2026
E-PAPER
Homeఎడిట్ పేజినాగరికతనే నాశనం చేస్తానన్నవాణ్ణి క్షమించొచ్చా?

నాగరికతనే నాశనం చేస్తానన్నవాణ్ణి క్షమించొచ్చా?

- Advertisement -

ఊరికే ఊహించు కోండి ! ఇరాన్ వాషింగ్టన్ డి.సి. మీద బాంబులేసి, వారి ఆధ్యక్షుణ్ణి, అతని కుటుంబాన్ని, డిప్లమేట్లను, రాజకీయ నాయకుల్ని, జనరల్స్ ని అందరినీ చంపారని అనుకుందాం. అప్పుడు మీరేమంటారూ? అది ఉగ్రవాదుల చర్య అని అంటారా? అనరా ? మరి అదే- వాస్తవంగా ఇరాన్ మీద జరిగింది కదా? ఇరాన్ రాజధాని టెహ్రాన్ మీద బాంబులేసి, వారి సుప్రీం లీడర్ రుహల్లా ఖొమేనిని అతని కుటుంబాన్ని, డిప్లమేట్లను, జనరల్స్ ను, రాజకీయ నాయకుల్ని- అందరినీ చంపేస్తే.. దాన్ని మాత్రం మీరు ఉగ్రవాద చర్య అని అనరు. ప్రపంచాన్ని రక్షిం చడానికి చేపట్టిన దాడి అని – అందంగా ముసుగేసుకుంటారా? ఇకనైనా ముసుగు తొలగించుకోవాల్సిన అవసరం లేదా? నాగరికతనే నాశనం చేస్తానన్న వాణ్ణి క్షమించొచ్చా?

నాగరికతను నాశనం చేస్తాననడం ఎంత పెద్ద మాట? ఎంతటి చారిత్రక తప్పిదం? విజ్ఞత, వివేకం గలవాడు మాట్లాడాల్సిన మాటేనా? ఎంత అమెరికా అధ్యక్షుడయినా, ట్రంప్ ఆలోచనాపరుడు కాదు. మేధావి కాదు. ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి. డబ్బు మదంతో ఏదైనా చెసెయ్యగలను – అన్న ఆహంకారం తప్ప, అందులో ఇసుమంతైనా వివేకం లేదు. మానవ నాగరికతను నాశనం చేసి, ఏమై పోదామని ఈ ఆరాటం? అతణ్ణి ఎగదోసేందుకు ఓ మత పిచ్చిగాడు బెంజమిన్ నెతన్యాహు తోడయ్యాడు. ఏ దేవుడూ ఎవడికీ ఏ భూమి రాసివ్వలేదు. ఈ భూమి అందరిది. ఈ గాలి అందరిది. ఈ ప్రకృతి అందరిది. ఆర్థిక లావాదేవీలుంటే ఒప్పందాలు చేసుకోవాలి తప్ప, నాగరికతల వినాశనం దాకా పోగూడదు. ఆ హక్కు ఎవడికీ లేదు. ప్రపంచ నేతలే కాదు, వారి అమెరికా సెనెటర్లు అధ్యక్ష‍ుడి చర్యల్ని ఛీకొడుతున్నారు. అమెరికా పౌరులు, ఇజ్రాయిల్ పౌరులు- మిలియన్ల సంఖ్యలో రోడ్ల మీది కొచ్చి వారి నేతల నిర్ణయాల్ని తీవ్రంగా నిరసించారు. వాటిని అర్థం చేసుకుని స్వీకరించాలి కదా? మానవ జాతిని మట్టుబెట్టి ఎవడు మాత్రం ఏం బావుకుంటాడూ? ఆలోచించుకునే పని లేదా? మూఢత్వంతో కళ్లు మూసుకుపోయిన వారికి ఇలాంటివేవీ కనబడవన్న మాట!

‘అమెరికాది ఉగ్రవాదం’ అని ఉత్తర కొరియా సుప్రీం లీడర్ కిమ్ జోంగ్ ఉన్ బాహాటంగా ప్రకటించాడు. అతను ఇంకా ఇలా అన్నాడు. అమెరికాది ప్రపంచ స్థాయి రాజ్య ఉగ్రవాదం. అది చేస్తున్నవన్నీ దురాక్రమణలు- అందువల్ల, అమెరికా వ్యతిరేక కూటమిలో మా ఉత్తర కొరియా మరింత బలమైన పాత్ర పోషిస్తుంది అని. శత్రువులు శాంతియుత సహజీవనాన్ని కోరుకుంటారా? లేక ఘర్షణను ఎంచుకుంటారా ?- అనేది వారి ఇష్టం! వారు ఏది కోరుకున్నా దానికి ధీటుగా బదులిచ్చే స్థితిలో తాము సిద్ధంగా ఉన్నామని ప్రకటించిన కిమ్ జోంగ్ ఉన్, ట్రంప్ గురించి మరోమాట కూడా ధైర్యంగా, స్పష్టంగా ఈ ప్రపంచానికి తెలియజేశాడు. మానసిక సమతుల్యం కొల్పోయిన ఒక వృద్ధ అమెరికన్ డొనాల్డ్ ట్రంప్! చిత్తవైకల్యంతో (DEMENTIA)తో బాధ పడుతున్న రోగి – అని కూడా అన్నాడు.

బాలిస్టిక్ మిస్సైల్ కన్నా తీవ్రమైన స్థాయిలో ఇరాన్ విదేశాంగ మంత్రి సయీద్ అబ్బాస్ అరగ్చి, ట్రంప్‌‌నకు జవాబిచ్చాడు- మేం ఏమని, ఎలాగని అమెరికాతో ఒప్పందాలు చేసుకోగలం? అంటూ ట్రంప్ చెప్పిన మాటల్నే తిరిగి చెబుతూ.. ట్రంప్ ముఖం పగిలేలా జవాబిచ్చాడు-
మాదేశానికి నాయకత్వం లేదు
మాకు నూక్లియర్ ప్రోగ్రాం లేదు
మా దగ్గర్ మిస్సైల్స్ స్టాక్ లేదు.
ఆయుధాల తయారీ ఆగిపోయింది
మా నావికాదళం పూర్తిగా ధ్వంసమైంది
అసలు ప్రపంచ పటంలో మా ఉనికే లేదు-
ఇక మేం ఏ విషయంలో ఎవరితో చర్చలు జరపాలీ? ఏ ఒప్పందాలు చేసుకోవాలి? – అని అన్నాడు అరగ్చి. డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌‌ను పూర్తిగా ధ్వంసం చేశామని ప్రకటించినందుకు, దానికి ప్రతి స్పందనగా – ఇరాన్ విదేశాంగ మంత్రి అలా జవాబిచ్చాడు. లేశమాత్రమైన లజ్జగల వాడైతే, ఈ పాటికి ట్రంప్ ఏ నుయ్యో గొయ్యో చూసుకోవాలి. లేదా తనను తాను కాల్చకుని ఆత్మహత్య అయినా చేసుకోవాలి. అది లేకనే కదా- ఈ యుద్ధాన్ని ముందేసుకుని, ప్రపంచాన్ని కష్టాల పాలు చేశాడూ? అతనికి లేకపోతే లేకపోయింది. పోనీ, అమెరికాన్ పౌరులకు, అక్కడి వ్యవస్థలకు, కోర్టులకైనా ఇంత ఇంగిత జ్ఞానం ఉంటే అతణ్ణి తక్షణం ఆ పదవి నుండి లాగి రోడ్డున పడేయాలి కదా?

యుద్ధంతో సంబంధం లేని, ప్రపంచంలోని ఇతర దేశాల సామాన్య పౌరులకే రక్తం మసలుతూ ఉంటే, ఇక ఇరాన్ పౌరులకు ఎలా ఉండాలి? అంతర్జాతీయ చట్టాలన్నీ చచ్చాయి. లేదా చచ్చుబడి పోయాయి. అవి అగ్రరాజ్యాలకు మద్దతునిస్తూ, నిశ్శబ్దంగా ఉండిపోయాయి. లేకపోతే గాజా గురించి, ఉక్రెయిన్ గురించి ఎందుకు మాట్లాడవూ? కనీసం, ఫ్రాంక్ వాల్టర్ స్పెయిన్ మియర్, జర్మనీ అధ్యక్షుడు ఇరాన్ మీద జరిగే దాడుల్ని ఖండించాడు. అంతర్జాతీయ చట్టాలకు విలువనిచ్చేవారు గొంతెత్తి మాట్లాడాలి కదా? ‘‘చరిత్రలో ఏ దేశం కూడా అణ్వాయుధాలున్న అతి శక్తి శాలి అయిన ఒక అగ్రరాజ్యానికి ఎదురొడ్డి నిలిచింది లేదు. అయితే, వాళ్లనుకున్నది ఏ ఒక్కటి కూడా సాధించనీయకుండా ముప్పుతిప్పలు పెట్టిన దేశం మాది తప్ప, ఈ భూమి మీద మరొకటి లేదు. దీన్ని మేం మానవత్వంతో ఎదుర్కున్నామని సగర్వంగా చెప్పుకోగలుగుతున్నాం” అని ప్రకటించాడు ఇరాన్ విదేశాంగ మంత్రి సయీద్ అబ్బాస్ అరగ్చి. ధైర్యంగా ఎదుర్కోవడమే కాదు, మానవీయ విలువలతో తమ ప్రజల్ని ఆదుకుంది. అక్కడి ప్రస్తుత ప్రభుత్వం.

ఇరాన్ సూపర్ మార్కెట్లలో ప్రజల కోసం ఇలా బోర్డులు పెట్టారు. TAKE NOW, PAY AFTER THE WAR – అంటే, సరుకులు ఇప్పుడు తీసుకోండి. యుద్ధం తర్వాత డబ్బులు చెల్లించండి అని చెప్పడమన్నమాట! సమైక్యతకు జాతీయ భావనకు – దేశ ప్రేమకు ఇంతకన్నా మరో మంచి ఉదాహరణ లభించదు. ఈ భూమి మీద ఇంకా కొంత మంచితనం, మానవత్వం మిగిలే ఉంది … అని చెప్పడానికి ఇదొక ఉదాహరణ! ప్రపంచ దేశాల నేతలంతా ట్రంప్ ను, నెతన్యాహును అంతర్జాతీయ స్థాయిలో ఛీ కొడుతున్నారు. అన్యాయాన్ని అన్యాయమని చెప్పగలగడం కూడా ఎంతో సాహసవంతమైన కార్యమైపోయింది. బ్రెజిల్ అధ్యక్షుడు లూలా దసిల్వా ఏమన్నాడంటే- ‘‘ఈ ప్రపంచం తన స్వంతం అని అనుకుంటున్నాడు ట్రంప్. ఓరోజు ఇరాన్ మీద దాడులు చేస్తాడు. మరొకరోజు ఐస్‌‌ల్యాండ్‌ కావాలంటాడు. దీన్ని ఎవరూ సహించరు. నేను మాత్రం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాను’’అని! నిజమే ట్రంప్ ఒక మానసిక వికలాంగుడు అని అనాల్సివస్తోంది. ఎందుకంటే, కెమెరా ముందు ప్రపంచమంతా చూస్తూ ఉండగా ఏం చెప్పాడు? ‘ఇరానీ చమురు నిలువలున్న చోట – ఊరికే- తమాషాకు బాంబు లేసి చూస్తాను?’ -అని కదా అన్నాడు? ఇలాంటి పిచ్చివాణ్ణా అమెరికన్లు తమ అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. ‘ఇలాంటి విడ్డూరం ఎక్కడా ఎప్పుడూ చూడలేదండి బాబూ ‘ – అని ప్రపంచ పౌరులంతా ఆందోళన పడుతూ ఆశ్చర్యపోతున్నారు.

వేరే దేశాల సంగతి ఎందుకు? వారి ఆమెరికా సెనేటరే చర్ని సాండర్స్ ట్రంప్ ప్రభుత్వాన్ని ఎంతగా విమర్శించాడో చూడండి. 84 ఏళ్ళ అనుభవజ్ఞుడు, ఈ సీనియర్ రాజకీయ నాయకుడి మాటల్లో ఎంతో నిజం, నిజాయితీ కనిపిస్తు న్నాయి… అమెరికా టాక్స్ పేయర్స్ కట్టిన పన్నుల డబ్బు తీసుకుపోయి మీరు పాఠశాల పిల్లల మీద బాంబులేస్తున్నారు. ఆకలితో అలమటిస్తున్న వారిని కాల్చి చంపుతున్నారు. ఇదేం పద్ధతి? వారికి విద్యనందించాలి. వీరికి ఆహారం అందించి ప్రాణాలు కాపాడాలి! కానీ, వరసబెట్టి ప్రాణాలు తీస్తున్నారే? గాజాలో 18,500 మంది పిల్లల్ని ఇజ్రాయిల్ చంపేసింది. అందుకు బహుమతిగా అమెరికా ఇజ్రాయిల్‌‌కు ఇరవై రెండు బిలియన్లు అందించడమే కాకుండా, ఇజ్రాయిల్ చేయాలనుకున్న యుద్ధాన్ని, అమెరికా తన మీద వేసుకుని చేస్తూ ఉందేమిటే? అని!
అమెరికాలోని ఇల్లినాయిస్ గవర్నర్ జె.బి. ప్రిట్జ్‌‌కేర్‌ ఎంతో ధైర్యంగా సూటిగా ట్రంప్ సుగుణాన్ని వెలికి తీసి ప్రపంచానికి చాటాడు. ‘‘ట్రంప్ అనుకుంటాడు – మనం ఆయన్ని నమ్మాలని! ఆయన వెనక ఉన్న ఆర్థిక వనరుల్ని చూసి, స్వతహాగా ఆయన ధనవంతుడని ఆయన మాటలకు విలువనిస్తామా? నిజమే! ఆయన అత్యంత ధనవంతుడే అది ఎందులో? అంటే – కేవలం మూర్ఖత్వంలోనే” అని అన్నాడు.

ఒక చోట ఒక చైనా స్కాలర్, ఇజ్రాయిల్ జనరల్ కలుసుకున్నారు. సమకాలీన పరిస్థితులు తెలిసిన చైనా స్కాలర్ ఊరికే ఉండలేడు కదా? ‘‘ మీ మిలట్రీ బలగాలు అమాయకులైన పసిపిల్లల్ని చంపుతున్నాయి’’ అన్నాడు. ఇజ్రాయిల్ వాడు ఒప్పుకోడు కదా. ‘‘లేదు లేదు. మేం అలా చేయడం లేదు” అని ఇంకా ఏదో చెప్పబోయాడు. చైనా స్కాలర్ కు మండి పోయింది ‘‘ ఆపేయ్ అబద్ధాలాడడం!’’ అని గట్టిగా అరిచాడు. చుట్టు పక్కల వాళ్లంతా ఏమైందోనని పరిగెత్తుకొచ్చారు. చైనా స్కాలర్ ధైర్యంగా చెప్పాడు. ‘‘ప్రపంచమంతా చూస్తోంది. పాలస్తీనాలో మీరు డెబ్బయి వేలకు పైగా పసి ప్రాణాలు బలితీసుకున్నారు. పైగా అబద్దాలా?’’ అన్నాడు. చుట్టు మూగిన వారికి విషయం అర్థమైంది. ‘‘యస్! ధైర్యమంటే ఇలాగే ఉండాలి! అబద్దాలాడే వాడు ఎంత బలవంతుడైనా లెక్కచేయకుండా నిజాలు బయట పెడుతూనే ఉండాలి!’’ అని ధైర్యం చెప్పి అభినందించారు. ఇజ్రాయిల్ వాడు తల దించుకుని పక్కకు వెళ్లిపోయాడు. ఇరాన్పై జరిగిన దాడుల్లో మరణించిన విద్యార్థుల తల్లి దండ్రులకు సుమారు 1.6 కోట్లు మానవతా సహాయం ప్రకటించిన మొదటి దేశం చైనా. యుద్ధం వల్ల నిరాశ్రయుల సంఖ్య పెరిగిందనీ, వారిని ఆదుకోవాల్సిన బాధ్యత అన్ని దేశాలకూ ఉందని చెపుతూ, ఆ దిశలో తాము తొలి అడుగులు వేస్తున్నామని ప్రకటించింది. చైనా రెడ్ క్రాస్ సొసయిటీ ద్వారా, ఈ మానవతా సహాయం ఇరానియన్ రెడ్ క్రాస్ సొసయిటీకి పంపించామని తెలియజేశారు. వ్యాసకర్త – కవిరాజు త్రిపురనేని రామస్వామి జాతీయ పురస్కార తొలిగ్రహీత, జీవశాస్త్రవేత్త

ప్రొ. దేవరాజు మహారాజు

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -