కాలం మారినా మమత మారలేదు, ప్రపంచం ఎంత వేగంగా మారిపోయిందో మన కుటుంబాల రూపంలోనే స్పష్టంగా కనిపిస్తోంది. ఒకప్పుడు ‘అమ్మ’ అంటే ఇంటి గుండె చప్పుడు. ఇప్పుడు అదే అమ్మ ఆధునిక జీవితపు పరుగుల్లో కుటుంబాన్ని, ఉద్యోగాన్ని, తన వ్యక్తిత్వాన్ని సమతుల్యం చేస్తూ నిలబడుతోంది. రూపం మారింది… జీవనశైలి మారింది… కానీ తల్లితనం మాత్రం మారలేదు. అందుకే ప్రతి మదర్స్ డే మనకు ఒక గొప్ప సత్యాన్ని గుర్తు చేస్తుంది. కాలం మారినా తల్లి ప్రేమ శాశ్వతం.
అమెరికాలో అన్నా జార్విస్ ప్రారంభించిన మదర్స్ డే భావన, రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో అమెరికా సైనికుల ద్వారా యూకేకు చేరింది. అక్కడి సంప్రదాయ ‘మదరింగ్ సండే’తో కలిసిపోయి ప్రపంచవ్యాప్తంగా తల్లుల ప్రేమకు ప్రతీకగా మారింది. కానీ ఈ వేడుక వెనుక ఉన్న అసలు అర్థం కేవలం శుభాకాంక్షలు చెప్పడం కాదు. తల్లితనం అనే భావోద్వేగ శక్తిని గుర్తించడం. ఒకప్పుడు అమ్మలు ”బంగారూ.. బటన్లు పెట్టుకో” అని పలికేవారు. ఆ ఒక్క మాటలోనే ప్రేమ, జాగ్రత్త, ఆప్యాయత దాగి ఉండేది. నేటి అమ్మ ”నువ్వే వేసుకో” అంటోంది. ఇది ప్రేమ తగ్గిపోవడం కాదు. పిల్లలను స్వతంత్రంగా తయారు చేయాలనే కొత్త తల్లితనం.
మనోవిజ్ఞాన శాస్త్రం చెబుతున్న ఒక గొప్ప విషయం ఏమిటంటే… పాత తరంలోని తల్లులు పిల్లలను కాపాడే ప్రేమను చూపితే, నేటి తల్లులు పిల్లలను జీవితానికి సిద్ధం చేసే ప్రేమను చూపిస్తున్నారు. ఒకప్పుడు అమ్మ చేయి పట్టుకుని నడిపించేది. ఇప్పుడు ”నువ్వు చేయగలవు” అని ధైర్యం చెబుతోంది. ఇది ప్రేమకి కొత్త రూపం. ఆనాటి అమ్మ జడలో మల్లెలు పెట్టుకుని పిల్లల బ్యాగ్ సర్ది పంపేది. నేటి అమ్మ ఉదయాన్నే పనుల పరుగులోనూ ”తిన్నావా?” అని సందేశం పంపుతోంది.
ఒకప్పుడు తల్లి తల నిమిరి ప్రేమను వ్యక్తం చేసేది. ఇప్పుడు ఫోన్‌లో పలకరించి అదే మమతను చేరవేస్తోంది. మారింది పద్ధతి మాత్రమే… భావం కాదు.
ఇప్పటి తల్లి జీవితం అనేక బాధ్యతల మధ్య సాగుతోంది. ఇంటి పనులు, ఉద్యోగం, పిల్లల చదువు, సమాజపు అంచనాలు ఇవన్నీ ఆమె భుజాలపై ఉన్నాయి. అయినప్పటికీ పిల్లల చిరునవ్వు కోసం ఆమె తన అలసటను మరిచిపోతుంది. ఈ మౌన త్యాగమే తల్లితనం గొప్పతనం.
ఒకప్పుడు అమ్మ ”పాలు తాగి వెళ్ళురా” అనేది. ఇప్పుడు ”ఆరోగ్యానికి ఏది మంచిదో అదే తాగు” అంటోంది. ఇది కేవలం ఆహారపు మార్పు కాదు. పిల్లల ఆలోచనలను గౌరవించే కొత్త తల్లితనం. నేటి అమ్మ పిల్లలతో ఆజ్ఞలు కాదు, సంభాషణలు చేస్తోంది. భయం కాదు, అర్థం చేసుకునే ప్రేమను ఇస్తోంది. ఆనాటి అమ్మ పంచతంత్ర కథలు చెప్పేది. నేటి అమ్మ కథలను తెరల ద్వారా చూపిస్తోంది. కానీ ఒక విషయం మాత్రం ఎప్పటికీ మారలేదు. పిల్లలతో గడిపే ఆ అనుబంధం. ఎందుకంటే పిల్లలకు అవసరమైనవి ఖరీదైన వస్తువులు కాదు, తల్లి సమయం, తల్లి పలుకు, తల్లి ప్రేమ. నేటి తల్లుల మనసులో ఒక మౌన పోరాటం కూడా నడుస్తోంది.
పిల్లలతో ఎక్కువ సమయం గడపలేకపోతున్నామనే బాధ చాలా మంది తల్లులను వెంటాడుతోంది. ఉద్యోగం చేస్తే పిల్లలకు దూరమవుతున్నామేమోననే ఆందోళన… ఇంట్లో ఉంటే తన కలలు ఆగిపోతున్నాయనే బాధ… ఈ రెండింటి మధ్య నేటి అమ్మ తన మనసును మౌనంగా మోస్తోంది. అయినా ఆమె ప్రతీ ఉదయం మళ్లీ నవ్వుతుంది. ఎందుకంటే పిల్లల కోసం ఆమె బలంగా ఉండాలని తెలుసు. ఇదే తల్లితనం అసలు మహిమ. సమాజం తల్లులపై ఎన్నో అంచనాలు పెడుతోంది. ‘పరిపూర్ణ తల్లి’ కావాలని ఒత్తిడి చేస్తోంది. కానీ నిజానికి పిల్లలకు పరిపూర్ణత అవసరం లేదు. ప్రేమగా అర్థం చేసుకునే తల్లి ఉంటే చాలు. పిల్లలు పడిపోతే పట్టుకునే చేయి… భయపడితే ధైర్యం చెప్పే గొంతు… బాధలో ఉన్నప్పుడు కౌగిలించుకునే హదయం… అదే తల్లి. అందుకే తల్లి గురించి ఎంత చెప్పినా తక్కువే.
చీరలోనైనా… జీన్స్‌లోనైనా… ఆమె గుండెలో మమత మాత్రం ఒకటే. ఒకప్పుడు లాలిపాట పాడేది… ఇప్పుడు ఫోన్‌లో పాట పెట్టొచ్చు… కానీ పిల్లలు నిద్రపోయే వరకు మేల్కొని ఉండే హదయం మాత్రం అదే. ఒకప్పుడు తల్లి చేతిలో దీపం ఉండేది… ఇప్పుడు ల్యాప్‌టాప్ ఉండొచ్చు… కానీ పిల్లల భవిష్యత్తు వెలుగొందాలని కోరుకునే మనసు మాత్రం మారలేదు.
అమ్మ అనే పదం ఒక పిలుపు మాత్రమే కాదు… అది భద్రత, ప్రేమ, ధైర్యం, త్యాగం అనే నాలుగు అక్షరాల జీవితం. ఆమె నవ్వు ఇంటి ఆనందం. ఆమె మౌనం కుటుంబ బాధ. ఆమె ప్రేమ పిల్లల జీవితానికి మొదటి పాఠశాల. ‘పిల్లలే ఆమె గుండెలో రాజ్యం’ కాదు… ఆమె గుండె అనే విశ్వానికి పిల్లలే శ్వాస, జీవం, అర్థం. తన ప్రతి కలలో పిల్లల భవిష్యత్తే ఉంటుంది. తన ప్రతి ప్రార్థనలో పిల్లల సంతోషమే ఉంటుంది. ప్రపంచం మొత్తం తనకు వ్యతిరేకంగా నిలిచినా, పిల్లల కోసం మాత్రం కొండలా నిలబడే మహాశక్తి…. అమ్మ. కాలం మారొచ్చు…, పద్ధతులు మారొచ్చు… కానీ తల్లి ప్రేమ మాత్రం శాశ్వతం. అందుకే ఈ మదర్స్ డే సందర్భంగా ప్రతి తల్లికి హదయపూర్వక వందనం.
డా|| హిప్నో పద్మా కమలాకర్,
9390044031
కౌన్సెలింగ్, సైకో థెరపిస్ట్, హిప్నో థెరపిస్ట్



