Monday, July 6, 2026
E-PAPER
Homeసోపతిరాములోరికే పంగనామాలు

రాములోరికే పంగనామాలు

- Advertisement -

జుట్టుపోలుగాడు : రాం.. రాం.. రాం.. స్కాం.. స్కా.. స్కాం.. కొట్టుకుంటా… కొట్టుకుంటా.. బాగా కొట్టుకుంటా.. వళ్లు చీరేలా.. రక్తం కారేలా కొరడాతో కొట్టుకుంటా. నాకు నేనుగా ఈపుమీద కొట్టుకుంటా.. మొండోటి ఆటంటే ఇది. రండి.. చూడండి.. రాం.. రాం.. రాం.. స్కాం.. స్కాం.. స్కాం…
కేతిగాడు: అరే జుట్టుపోలుగా ఆగరా.. ఆగరా… ఆ మొండితనం ఏంది. ఆ కొట్టుకోవడం ఏంది…
జుట్టుపోలుగాడు : నన్ను ఆపకురా మావా.. ఇది ‘మొండోడి ఆట’. మొగాళ్లు ఇలా కొరడాతో కొట్టుకుంటారు. కత్తులతో కోసుకుంటారు. అప్పుడు మన ఆడోళ్లు ”నెత్తురు కారిపోతుంది తల్లో తల్లా.. పానం పోతుంది తల్లో తల్లా… దయ చూపండి తండ్రుల్లారా…” అంటూ అడుక్కుంటారు.
కేతిగాడు : ఇప్పుడు నీకంత కష్టమేం వచ్చిందిరా..?
జుట్టుపోలుగాడు : ఇంకేం కావాల్రా ‘రాముడంటేనే దేవుడు. దేవుడంటేనే దేశం అని మా నాయకులు చెప్పిన మాటలు నమ్మి అయోధ్యలో రామాలయ నిర్మాణానికి ఎన్నెన్ని డబ్బులు చందాలుగా వసూలు చేసి పంపాను. ఇటుకలు మోశాను. కరసేవలో పాల్గొన్నాను. అయోధ్యలోనే రాముడు పుట్టాడు. అదీ బాబ్రీమసీదు ఉన్నచోటనే అంటేనే కదరా, నిజంగా నమ్మి ఆ మసీదుకు నిద్రాహారాలు మాని పనిచేశాను. ఇప్పుడు అక్కడ కూడా దొంగ నా కొడుకులు వుంటే నేనేం చేయాల్రా.. బుద్దున్నోడు ఎవడైనా సరే ఈ పనికి వాడి చెప్పులతో వాడే కొట్టుకోవాలి. నేనో మామూలు కళాకారుడ్ని కనుక ఆ పని చేయలేక ఇదిగో ఇలా నడిబజార్లో ‘మొండోడి ఆట’ ఆడుతున్నాను.
కేతిగాడు : అవున్రా గుడిని, గుళ్లో లింగాన్ని మింగేసే దొంగలెక్కువైపోయారు దేశంలో.
జుట్టుపోలుగాడు : అది కాదురా మావా… బయట దొంగలైతే ఒక రకంగా వుంటుంది. ఈ నా కొడుకులందరూ ఇంటి దొంగలు. ఆ ఇంటి దొంగలను ఈశ్వరుడు కూడా పట్టుకోలేడు మావా.. అందుకే ఇది రాం.. స్కాం.. కుంభకోణం.
కేతిగాడు : అవునొరే… మన ప్రధాని మోడీ రామాలయాన్ని మంచి ముహూర్తంలో ప్రారంభించాడు. అక్కడి ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ నిర్వహణలో రామాలయం నడుస్తున్నది. డబుల్‌ ఇంజన్‌ సర్కార్‌. పాలకులంతా మహా భక్తులు కదరా. మరి ఈ దొంగతనం ఎలా జరిగిందబ్బా..?
జుట్టుపోలుగాడు : పుండుమీద కారం చల్లినట్టు నీ పరాచికాలేందిరా. రాముని పేరుతో సరాసరి రాములోరికే పంగనామాలు పెట్టారంటే వినవేంది?
కేతిగాడు : అదేందో వివరంగా చెప్తేనే కదరా తెలిసేది?
జుట్టుపోలుగాడు : అయోధ్యలో రామాలయ నిర్మాణం అనేది పెద్ద కల. ఇది హిందూ దేశం. రామాలయం నిర్మించిన వారికే రాజ్యాధికారం అన్నది మా నినాదం. కల నిజం చేసుకున్నాం. బాబ్రీమసీదును కూల్చాం. ఆరునూరైనా అక్కడే రాముని గుడి కట్టాం. ఇప్పుడు ఆ నిర్మాణంలోనూ, నిర్వహణలోనూ దొంగలు పడ్డారంటే ఎంత బాధగా వుంటుందో చెప్పు. అది అనుభవించినోడికే తెలుస్తుంది.
కేతిగాడు : అవునవును. ఏ బాధైనా అంతే. దేశంలో ఇతర దొంగతనాలు వేరు. సాక్షాత్తు అయోధ్య రామాలయంలోని దొంగతనాలు వేరు.
జుట్టుపోలుగాడు : దాదాపు 200 కోట్లపైనే ఈ దొంగల దోపిడీ జరిగిందట మావా. దేశ విదేశాల నుండి సేకరించిన చందాల డబ్బు.. బంగారు నగలు, వెండి ఇటుకలు, వజ్ర వైఢూర్యాలు, భక్తుల హూండీ డబ్బు అంతా మింగేశారు మావో.. మావా…
బంగారక్క : ఇది కేవలం ఓ దొంగతనం అనుకుంటే పొరపాటు. కోట్లాదిమంది హిందువుల మత విశ్వాసానికి, ఆధ్యాత్మిక భావనకు సంబంధించిన విషయం. అయినా వాములు తినే స్వాములకు పచ్చగడ్డి పలహారమా… అన్నట్టు లక్షల కోట్ల స్కాముల్లో వందల కోట్లు ఏపాటివి? రామాలయం స్కాం గనుక చర్చకు వచ్చింది. జమ అయిన మొత్తం నిత్యం వస్తున్న విరాళాలకు, వాస్తవంగా వున్న నిధులకు పొంతన లేకుండా ఉన్నదంటూ వార్తలొస్తున్నాయి. జనం విమర్శలు తట్టుకోలేక సి.ఎం.యోగి దీనిపై సిట్‌ (ప్రత్యేక దర్యాప్తు సంఘం) వేశాడు. ప్రాథమిక దర్యాప్తు నివేదిక వచ్చింది. దాన్ని బయటపెట్టి దోషుల్ని కఠినంగా శిక్షించాలని జనం డిమాండ్‌ చేస్తుంటే… ‘ఆలయం కోసం 500 ఏండ్లు ఆగినోళ్లు దర్యాప్తు పూర్తయ్యే వరకు ఆగలేరా..?’ అని ఆయన కోపగించుకోవడం మరిన్ని అనుమానాలకు తావిస్తుంది. కంచే చేను మేస్తే దేవుడికే కాదు దేశానికే రక్షణ వుండదు. జుట్టు పోలుగాని మొండోని ఆట కళారూపం అదే చెప్పుద్ది. మా పేదరికానికి, మా ఆకలికి, మా బతుకులు వెనకబాటుతనానికి కారణాలు వెతకండి. కళ్ళెట్టి బాగా చూడండి అంటూ అత్యంత నగంగా వాస్తవాన్ని ప్రదర్శిస్తారు. కఠోర చేదువాస్తవం నుండే ప్రశ్నలు ఉద్భవిస్తాయి. అప్పుడు నమ్మకద్రోహాన్ని కూడా జనం ప్రశ్నిస్తారు.

– కె.శాంతారావు, 9959745723

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -