ప్రధాని మోడీకి పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ లేఖ
హైదరాబాద్ మెట్రో, మూసీ పునరుజ్జీవనం అత్యంత ప్రాధాన్యతా అంశాలని వెల్లడి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
తెలంగాణ రాష్ట్రానికి అత్యంత కీలకమైన ఎనిమిది అంశాల్లో కేంద్ర ప్రభుత్వం సహకరించాలని టీపీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేశ్ కుమార్ గౌడ్ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆయన ప్రధాని మోడీకి ఆదివారం బహిరంగ లేఖ రాశారు. హైదరాబాద్ మెట్రో విస్తరణ, మూసీ పునరుజ్జీవనం అనేవి తమ ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యతా అంశాలని పేర్కొన్నారు. మెట్రో ఫేజ్-2కు వెంటనే కేంద్రం ఆమోదం తెలపాలని, రూ.38,595 కోట్ల విలువైన విస్తరణ ప్రాజెక్టును జాయింట్ వెంచర్‌లో చేపట్టాలని కోరారు. మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టుకు ప్రత్యేక ఆర్థిక సహాయం ప్రకటించాలని, ఈ ప్రాజెక్టును జాతీయ స్థాయి అర్బన్ రివర్ రీస్టోరేషన్ ప్రాజెక్టుగా గుర్తించాలని విజ్ఞప్తి చేశారు. బాపూఘాట్ గాంధీ సరోవర్ ప్రాజెక్టుకు రక్షణ శాఖ అనుమతులు ఇవ్వాలని పేర్కొన్నారు.
పీసీసీ చీఫ్ తన లేఖలో పేర్కొన్న ఇతర అంశాలు…
-రీజినల్ రింగ్ రోడ్ ఉత్తర భాగానికి వెంటనే ఫైనాన్షియల్ అప్రూవల్ ఇవ్వాలి
-దక్షిణ భాగం నిర్మాణానికి కూడా కేంద్ర అనుమతులు మంజూరు చేయాలి
-రీజినల్ రింగ్ రైలు ప్రాజెక్టును 100 శాతం కేంద్ర నిధులతో చేపట్టాలి
-హైదరాబాద్-అమరావతి-బందర్ పోర్ట్ గ్రీన్ ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ హైవే నిర్మించాలి
-హైదరాబాద్-బెంగళూరు హైస్పీడ్ కారిడార్ అభివద్ధికి కేంద్రం చొరవ చూపాలి
-రేడియల్ రోడ్ల నిర్మాణానికి రూ.45 వేల కోట్ల సహాయం చేయాలి
-హైదరాబాద్ సిగల్ ఫ్రీ ప్రాజెక్టుకు కేంద్రం తగినన్ని నిధులు ఇవ్వాలి
-ఫ్లైఓవర్లు, అండర్‌పాస్‌లు, ఎలివేటెడ్ కారిడార్లకు సహకారమందించాలి
-హైదరాబాద్ ఫ్యాబ్ సిటీకి సెమీకండక్టర్ మిషన్ కింద ప్రాధాన్యం ఇవ్వాలి
-కేంద్ర పరిశీలనలో ఉన్న సెమీకండక్టర్ ప్రాజెక్టులకు తుది ఆమోదం తెలిపాలి
-తుమ్మిడిహెట్టి ప్రాజెక్టుకు మహారాష్ట్ర ప్రభుత్వం నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఇచ్చేట్టు చూడాలి
-తెలంగాణ విభజన హామీలను పూర్తిగా అమలు చేయాలి
-కాజీపేట కోచ్ ఫ్యాక్టరీని పూర్తి స్థాయి యూనిట్‌గా అభివద్ధి చేయాలి
-కొత్త జిల్లాలకు కేంద్రీయ విద్యాలయాలు, నవోదయ పాఠశాలలు మంజూరు చేయాలి.



