- ఐద్వా అఖిల భారత ఉపాధ్యక్షురాలు ఎస్. పుణ్యవతి
నవతెలంగాణ-హైదరాబాద్: భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్ఎఫ్ఐ), భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య (డివైఎఫ్ఐ), అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా) తెలంగాణ రాష్ట్ర కమిటీల ఆధ్వర్యంలో.. హైదరాబాద్ ఆర్‌టీసీ క్రాస్ రోడ్స్ వద్ద బండి సంజయ్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు.ఈ కార్యక్రమానికి ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి టి. నాగరాజు అధ్యక్షత వహించగా, ఐద్వా అఖిల భారత ఉపాధ్యక్షురాలు ఎస్. పుణ్యవతి ప్రధానంగా పాల్గొని మాట్లాడారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ నేత, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడి, అనంతరం బెదిరింపులకు దిగడమే కాకుండా కేసును సెటిల్ చేసుకునే ప్రయత్నాలు జరగడం అత్యంత దారుణమని తీవ్రంగా ఖండించారు. “దేశంలో ‘బేటీ బచావో, బేటీ పడావో’ అనే నినాదాలు ఇచ్చే బీజేపీ నాయకత్వం, మహిళలపై జరుగుతున్న అత్యాచారాల విషయంలో మాత్రం నేరస్తులను కాపాడే సంస్కృతిని ప్రోత్సహిస్తోంది” అని విమర్శించారు.
బిల్కిస్ బాను కేసు నుంచి దేశవ్యాప్తంగా మహిళలు, చిన్నారులపై జరుగుతున్న దాడుల వరకు బీజేపీ పాలిత వ్యవస్థల వైఖరి మహిళా వ్యతిరేకంగా మారిందని ఆమె ఆరోపించారు. కేంద్ర మంత్రి పదవిలో ఉన్న బండి సంజయ్ తన కుమారుడిపై వచ్చిన తీవ్రమైన ఆరోపణలను సమర్థిస్తూ వెనుకేసుకురావడం దుర్మార్గమైన చర్య అని అన్నారు.
ఐద్వా రాష్ట్ర అధ్యక్షురాలు ఆర్. అరుణ జ్యోతి, డివైఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి ఆనగంటి వెంకటేష్ మాట్లాడుతూ పోక్సో కేసు నమోదై నాలుగు రోజులు గడిచినా నిందితుడిని అరెస్టు చేయకపోవడం కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి నిదర్శనమని విమర్శించారు. మైనర్ బాలికపై లైంగిక దాడి జరిగినా ప్రభుత్వం, పోలీసులు చట్టపరమైన చర్యలు తీసుకోకుండా బండి సంజయ్ కుటుంబానికి కొమ్ముకాస్తున్నట్లు కనిపిస్తోందన్నారు.
అధికార అహంకారంతో తన కుమారుడు చేసిన నేరాన్ని కప్పిపుచ్చుకునేందుకు బండి సంజయ్ ప్రయత్నిస్తున్నారని, ఇది మహిళల భద్రతను తాకట్టు పెట్టడమేనని అన్నారు. పోక్సో వంటి తీవ్రమైన కేసు నమోదైనా బీజేపీ నాయకత్వం స్పందించకపోవడం సిగ్గుచేటని పేర్కొన్నారు. దేశంలో చట్టాన్ని కాపాడాల్సిన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి ఇంట్లోనే చట్టాన్ని ఉల్లంఘించే పరిస్థితి నెలకొనడం సమాజానికి ప్రమాదకర సంకేతమని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రభుత్వ పదవిలో కొనసాగడానికి నైతిక హక్కు కోల్పోయిన బండి సంజయ్ తక్షణమే కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. బాధిత బాలిక కుటుంబం ఫిర్యాదు చేసినప్పటికీ పోలీసులు, ప్రభుత్వం స్పందించకపోవడం అన్యాయమని మండిపడ్డారు.
బండి భగీరథ్ గతంలో మహేంద్ర యూనివర్సిటీలో ర్యాగింగ్, డ్రగ్స్ వినియోగం వంటి ఆరోపణల్లో కూడా సోషల్ మీడియాలో వార్తల్లో నిలిచిన విషయాన్ని గుర్తుచేస్తూ, అధికార అండతో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. బాధిత కుటుంబానికి బండి సంజయ్ అనుచరుల నుంచి బెదిరింపులు వస్తున్న నేపథ్యంలో వెంటనే భద్రత కల్పించాలని, కేసుపై సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేశారు.
ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి బండి భగీరథ్‌ను తక్షణమే అరెస్టు చేసి రిమాండ్ చేయాలని, బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని, లేకపోతే డీజీపీ కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో ఐద్వా రాష్ట్ర ఉపాధ్యక్షులు టి. జ్యోతి, ఐద్వా రాష్ట్ర ఉపాధ్యక్షులు కె.ఎన్ అశాలత, కవిత, డివైఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షులు కోట రమేష్, ఎన్‌పీఆర్‌డి రాష్ట్ర కార్యదర్శి అడివయ్య, టిపిటిఎల్‌ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు విజయ్ కుమార్, ఎస్ఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు అశోక్ రెడ్డి రాష్ట్ర కమిటి సభ్యులు లెనిన్, రమేష్, డివైఎఫ్ఐ రాష్ట్ర నాయకులు కిరణ్ రాజయ్య, పవన్ తదితరులు పాల్గొన్నారు.



