Thursday, May 14, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంలక్ష మంది బదిలీ!

లక్ష మంది బదిలీ!

- Advertisement -

ఉద్యోగులు 80 వేలు టీచర్లు 20 వేలు
షెడ్యూల్‌ ప్రకారం కొనసాగుతున్న ప్రక్రియ
ప్రజాప్రతినిధులపై తీవ్ర ఒత్తిడి
సచివాలయం, డీఎస్సీ కేంద్రంగా జోరుగా పైరవీలు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

సాధారణ బదిలీల్లో భాగంగా దాదాపు లక్ష మంది బదిలీ అయ్యే అవకాశాలు కనిపిస్తు న్నాయి. ఇందులో ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, సిబ్బంది ఉండనున్నారు. ఈ మేరకు సర్కారు కసరత్తు చేస్తున్నది. ప్రభుత్వం ఇచ్చిన జీవో 38 ప్రకారం ఉన్నతాధికారులు ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. దాదాపు 50 సర్కారీ శాఖల్లో బదిలీల కౌన్సెలింగ్‌ ప్రక్రియ హడావిడి కనిపిస్తున్నది. ఎలాంటి కోర్టు కేసులు కాకుండా, అన్నీ సవ్యంగా జరిగితే ప్రభుత్వ పరిపాలనలో పెద్ద కుదుపు రానుంది.

పారదర్శకత కోసమే
పరిపాలనలో పారదర్శకతను పెంపొందించడానికి, అధికారిక సిండికేట్లను నివారంచడానికి, స్థానిక రాజకీయాలను తగ్గించేందుకు ఉద్యోగులు, ఉపాధ్యాయులు, సిబ్బందిని మార్గదర్శకాల ప్రకారం బదిలీ చేస్తుంటారు. నాలుగు నుంచి ఐదేండ్లకోసారి బదిలీలు చేయడం మూలాన పరిపాలనపై సర్కారు పట్టుపెంచుకోవడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సర్కారీ పథకాలను ప్రజల దగ్గరకు తీసుకుపోవడంలో అధికారులు, ఉద్యోగులు, సిబ్బందిది కీలకపాత్ర అనే సంగతి తెలిసిందే.

మార్గదర్శకాలివిగో..
తాజా బదిలీల కోసం ప్రభుత్వం పలు మార్గదర్శకాలను విడుదల చేసింది. మూడేండ్లు ఒకే చోట పనిచేస్తున్న ఉద్యోగులు, సిబ్బంది బదిలీకి దరఖాస్తు అర్హులు. నాలుగేండ్లు దాటిన వారిని తప్పనిసరిగా బదిలీ చేయాల్సిందే. ఈ మేరకు తాజాగా జీవో నెంబరు 38ని జారీచేశారు. ఇందులో 2013 నుంచి 2025 వరకు ఇచ్చిన పాత జీవోలైన119, 61, 81,80,85,87,34 లను కోట్‌ చేశారు. బదిలీలు ఏ పద్దతిలో చేయాలో స్పష్టమైన మర్గదర్శకాలు ఇచ్చారు. ఒకే ఒక్క విద్యాశాఖకు మినహా అన్నీ ప్రభుత్వ శాఖలకు ఈ నిబంధనలు వర్తిస్థాయి. ఈనెల ఒకటిన బదిలీల ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. ఇప్పటికే మూడు వారాలుగా ప్రక్రియ నడుస్తున్నది. ఇంకో రెండు వారాల్లో బదిలీలు పూర్తికానున్నాయి. ఆయా శాఖల హెచ్‌వో డీలు ఈ బదిలీల ప్రక్రియను పర్యవేక్షి స్తున్నారు. నెలాఖరులోగా బదిలీల ప్రక్రియను ముగిస్తామని వారు అంటున్నారు.

జనగణనలో ఉన్నవారికి..
తాజా జీవోలో ఒక ప్రత్యేకత ఉంది. జనాభా లెక్కల సేకరణలో ఉన్న ఉద్యోగులు, ఉపాధ్యాయులు, సిబ్బందిని మినహాయిం చారు. ఈ మేరకు ఉత్తర్వులు ఇచ్చారు. జనగ ణన తర్వాత అవసరమైతే సర్కారు వారికోసం మరోసారి బదిలీల ప్రక్రియను చేపట్టే అవ కాశాలు ఉన్నాయని అధికారిక సమాచారం.

40 శాతానికి తప్పనిసరి
రాప్ట్ర ప్రభుత్వం చేపట్టిన బదిలీల్లో దాదాపు 40 శాతం మందికి స్థానచలనం తప్పనిసరి కానుంది. ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాల్లో ఈ విషయం స్పష్టమైంది. రాప్ట్రంలో మొత్తం 3.25 లక్ష?ల మంది ఉద్యోగులు, ఉపాధ్యాయులు, సిబ్బంది ఉన్నారు. ఇందులో రెండు లక్షల మంది ఉద్యోగులు, సిబ్బందే సుమారు రెండు లక్షలు. వీరిలో 40 శాతం మంది అంటే సుమారు 80 వేల మంది స్థానచలనం కలిగే అవకాశ మున్నట్టు అధికారిక సమాచారం. విద్యాశాఖ ఇచ్చిన ప్రత్యేక మార్గదర్శకాల ప్రకారం ట్రాన్స్‌ఫర్లు అవుతాయి. వీరంతా కలిపి లక్ష ఐదు వేల మంది ఉంటారు. వీరిలో 40 శాతం అంటే సుమారు 22 వేల మందికి ట్రాన్స్‌ఫర్‌ తప్పకపోవచ్చు. అంటే అన్నీ ప్రభుత్వ శాఖల్లో సుమారు లక్ష మందికి పైగా ఉద్యోగులు, ఉపాధ్యాయులు, సిబ్బంది బదిలీ కానున్నారు.
బదిలీల కోసం ఉద్యోగులు, ఉపాధ్యాయులు, సిబ్బంది నానా తంటాలు పడుతున్నారు. ఎమ్మెల్యే నుంచి ముఖ్యమంత్రి స్థాయి వరకు ఒత్తిడి తెస్తున్నారు. భారీస్థాయిలో ఫైరవీలు చేస్తున్నారు. రాజకీయ, అధికార పలుబడిని వాడుకుంటూ తమకు కావాల్సిన స్థానాలను రిజర్వు చేసుకునే పనిలో పడ్డారు. ఇందుకోసం ఎంత ఖర్చుపెట్టడానికైనా వెనుకాడకుండా ప్రయత్నాలు చేస్తున్నారు. కొంత మంది సచివాలయం చుట్టూ చక్కర్లు కొడుతున్నారు. విద్యాశాఖ ప్రధాన కార్యాలయం డీఎస్సీలో పైరవీలు జోరుగా నడుస్తున్నాయి. అమ్యామ్యాల కోసం కొందరు దళారులు సైతం ఇప్పటికే రంగంలోకి దిగారు. కౌన్సెలింగ్‌ను తోసిరాజని ఉత్తర్వులు ఇప్పిస్తానని ఆశపెడుతున్నారు. ‘మాకు పోన్ల మీద పోన్లు వస్తున్నాయి..బదిలీల కోసం మంత్రులు, ఎమ్మెల్యేల నుంచి మా పై ఒత్తిడి తెస్తున్నారు’ అని ఒక ప్రభుత్వ శాఖ హెచ్‌వోడీ నవ్వుతూ మీడియాతో వ్యాఖ్యానించడం గమనార్హం.

ఇదే జరిగితే..
ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం బదిలీలు పూర్తయితే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రభుత్వం రెండోసారి విజయవంతంగా ఉద్యోగుల బదిలీలు చేపట్టినట్టవుతుంది. ఇప్పటికే ఐదు డీఏలు సర్కారు ఇవ్వలేదు. పీఆర్సీ ఇంకా పెండింగ్‌లోనే ఉంది. ఈనేపథ్యంలో ఉద్యోగులంతా ఒకింత అసంతప్తితో ఉన్నారు. ఈనేపథ్యంలో తొలిసారి బదిలీలు, పదోన్నతులు కల్పించారు. రెండోసారి బదిలీలు చేస్తున్నారు. మొత్తం ఈ వ్యవహారం సక్రమంగా జరిగితే పరిపాలనలో వేగం పుంజుకోనుందనే ప్రచారం జరుగుతున్నది. ప్రభుత్వం చేపడుతున్న పథకాలు విస్త్రతంగా ప్రజల్లోకి తీసుకెళ్లే అవకాశాలు ఉంటాయని సర్కారు భావిస్తున్నది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -