నిరుద్యోగం నాలుగు త్రైమాసికాల గరిష్టానికి
15-29 ఏండ్ల యువతలో15 శాతానికి పెరుగుదల • మహిళల్లో పరిస్థితి మరింత దారుణం
• ఉపాధి అవకాశాల క్షీణతపై ఆందోళనలు : పీఎల్‌ఎస్‌ఎఫ్ గణాంకాలు వెల్లడి
న్యూఢిల్లీ : దేశంలో ఉపాధి పరిస్థితులపై మోడీ ప్రభుత్వం చెప్తున్న మాటలకు, వాస్తవ పరిస్థితులకు సంబంధమే ఉండటం లేదు. సాక్షాత్తూ కేంద్రం ప్రభుత్వ గణాంకాలే ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. కేంద్ర గణాం కాల మంత్రిత్వ శాఖ విడుదల చేసిన పీరియాడిక్ లేబర్ ఫోర్స్ (పీఎల్‌ఎఫ్‌ఎస్) సర్వేలో ఆందోళన కరమైన విషయాలు వెల్లడయ్యాయి. కేంద్ర గణాం కాలు, ప్రణాళిక అమలు మంత్రిత్వ శాఖ (ఎంఓ ఎస్‌పీఐ) విడుదల చేసిన ఈ నివేదిక గణాంకాలు దేశంలోని యువతలో నిరుద్యోగ సమస్య ఎంత తీవ్రంగా ఉందో తెలియజేస్తున్నాయి.
జనవరి-మార్చి త్రైమాసికానికి సంబంధిం చిన పీఎల్‌ఎఫ్‌ఎస్ నివేదిక ప్రకారం.. 15-29 ఏండ్ల యువతలో నిరుద్యోగం జనవరి-మార్చి త్రైమాసికంలో 15 శాతానికి పెరిగింది. ఇది గత నాలుగు త్రైమాసికాల్లో గరిష్టస్థాయి కావడం ఆందోళనకరం. ముఖ్యంగా యువ మహిళల్లో నిరుద్యోగం 17.7శాతానికి పెరిగింది. ఇది దేశంలో ఉపాధి అవకాశాల సంక్షోభాన్ని బహి ర్గతం చేస్తోందని మేధావులు, నిపుణులు అంటు న్నారు. గత అక్టోబర్-డిసెంబర్ త్రైమాసికంలో యువ నిరుద్యోగం 14.3 శాతంగా ఉండగా.. అది ఇప్పుడు 15 శాతానికి పెరిగింది. యువ మహిళల్లో నిరుద్యోగం 16.6 శాతానికి 17.7 శాతానికి చేరింది. యువ పురుషుల్లో ఇది 13.5 శాతం నుంచి 14 శాతానికి చేరింది. 15 ఏండ్లు పైబడినవారిలో మొత్తం నిరుద్యోగ రేటు కూడా 4.8 శాతం నుంచి 5 శాతానికి ఎగబాకింది.
గ్రామీణ ప్రాంతాల్లో..
గ్రామీణ ప్రాంతాల్లో నిరుద్యోగం 4 శాతం నుంచి 4.3 శాతానికి పెరగడం గమనార్హం. పట్టణాల్లో స్వల్పంగా తగ్గినా.. ఉపాధి నాణ్యతపై సందేహాలు కొనసాగుతున్నాయి. మహిళల లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేటు (ఎల్‌ఎఫ్‌పీఆర్) కూడా 34.9 శాతం నుంచి 34.7 శాతానికి తగ్గింది. అంటే ఉద్యోగాల కోసం ముందుకు వస్తున్న మహిళల సంఖ్య కూడా తగ్గుతున్న సంకేతాలు దీనితో కనిపిస్తున్నాయి. వర్కర్ పాపులేషన్ రేషియో (డబ్ల్యూపీఆర్) 53.1 శాతం నుంచి 52.8 శాతానికి పడిపోవడం దేశంలో ఉద్యోగాల లభించని స్థితిని సూచిస్తోందని నిపుణులు చెప్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో స్వయం ఉపాధి చేసుకునే వారి సంఖ్య 63.2 శాతం నుంచి 62.4 శాతానికి తగ్గింది. ఇక కూలీలు, వేతనం మీద ఆధారపడే ఉద్యోగుల సంఖ్య 14.8 శాతం నుంచి 15.5 శాతానికి పెరిగింది. ఇది వ్యవసాయం, చిన్న వ్యాపారాల్లో సంక్షో భం పెరుగుతోందనే అభిప్రాయాలకు బలం చేకూరుస్తోందని నిపుణులు చెప్తున్నారు.
తగిన సంఖ్యలో ఉద్యోగాలు లేక యువత విలవిల
దేశానికి వెన్నెముకగా చెప్పబడే వ్యవసాయం రంగంలో ఉపాధి వాటా 58.5 శాతం నుంచి 55.8 శాతానికి పడిపోయింది. ఇక సేవారంగం, పరిశ్రమల రంగంలో కొంత పెరుగుదల నమోదైంది. అయినప్పటికీ.. కొత్త ఉద్యోగాల సృష్టి యువత అవసరాలకు సరిపోవటంలేదని నిపుణులు చెప్తున్నారు. ఈ సర్వేలో దేశవ్యాప్తంగా 15 ఏండ్లు పైబడిన 5,61,822 మంది ప్రజల అభిప్రాయాలను సేకరించారు. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం ప్రచారం చేస్తున్న “విశ్వగురు”, “అమృతకాలం” నినాదాల మధ్య యువతకు స్థిరమైన ఉద్యోగాలు అందకపోవడం మరోసారి చర్చనీయాంశమైంది.



