Saturday, May 16, 2026
E-PAPER
Homeమానవిపోషకాల ఘని…

పోషకాల ఘని…

- Advertisement -

వేసవి సీజన్‌లో లభించే పండ్లలో పనస ఎంతో ముఖ్యమైనది. రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లోనూ ఇవి అరకొరగా దొరుకుంటాయి. సహజ సిద్ధంగా పెరిగే ఈ చెట్టు రైతులకు అదనపు ఆదాయాన్ని అందించడమే కాకుండా, ప్రజలకు ఆరోగ్యాన్ని అందించే విలువైన ఆహారంగా నిలుస్తోంది. దక్షిణ భారతదేశంలో పనస వినియోగం చాలా ఎక్కువ. కేరళలోనే వందల రకాల పనస చెట్లు ఉన్నాయి. పనసతో కూరలు, వేపుళ్లు, చిప్స్, అప్పడాలు, స్వీట్లు తయారు చేయడం మామూలే. బెంగళూరులోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హార్టికల్చర్ రీసర్చ్ పనసపై పలు పరిశోధనలు చేసి కొత్త ఉత్పత్తులను రూపొందించింది. పనస గుజ్జుతో జ్యూస్, చాక్లెట్లు, బిస్కెట్లు తయారు చేసి మార్కెట్‌కు పరిచయం చేసింది. ఇందులో చక్కెర, నిల్వ పదార్థాలు ఉపయోగించకపోయినా ఆరు నెలల వరకు నిల్వ ఉండేలా రూపొందించడం విశేషం. పనస గింజల పిండితో చేసిన బిస్కెట్లు, గోధుమ పిండితో కలిపిన చాక్లెట్లు కూడా ఆరోగ్యకరమైన ఆహారంగా ప్రాచుర్యం పొందుతున్నాయి. కరోనా తరువాత ఆరోగ్యంపై ప్రజల్లో అవగాహన పెరిగింది. మాంసాహారానికి బదులుగా పనసను ఉపయోగించే వంటకాలు ఎక్కువయ్యాయి.

పనస బిర్యానీ, పనస కూర, పనస కట్లెట్స్ వంటి వంటకాలకు మంచి డిమాండ్ పెరిగింది. బెంగాల్‌లో పనసను ‘గాచ్ పతా’ అని పిలుస్తారు. అంటే “గొర్రె చెట్టు” అని అర్థం. పనస ముక్కలు మటన్‌లా ఉండటంతో ఆ పేరు వచ్చింది. బీహార్‌లో కాలా మటన్ తరహాలో పనస కర్రీ, గోవాలో కొన్ని వంటల్లో చేపకు బదులుగా పనస ఉపయోగించడం విశేషం. మన రాష్ట్రంలో పనస పొట్టు ఆవకూర, పనసకాయ బిర్యానీ, గింజల వేపుడు ప్రత్యేక రుచులుగా గుర్తింపు పొందాయి. ఆరోగ్యానికి రక్షణగా పనసలో విటమిన్–సి, యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉండటం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. పొటాషియం గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది. పీచు పదార్థాలు జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. బీటా కెరోటిన్ కంటిచూపుకు మేలు చేస్తుంది. కాల్షియం, ఐరన్ వంటి ఖనిజాలు ఎముకలు, రక్త ఆరోగ్యాన్ని కాపాడుతాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -