7 వికెట్లతో సూపర్‌జెయింట్స్ గెలుపు
రాణించిన మిచెల్ మార్ష్, ఆకాశ్ సింగ్
చెన్నై 187/5, లక్నో 188/3
నవతెలంగాణ-లక్నో : ఐపీఎల్ ప్లే ఆఫ్స్ రేసులో చెన్నై సూపర్‌కింగ్స్ అవకాశాలను లక్నో సూపర్‌జెయింట్స్ గట్టిగా దెబ్బకొట్టింది. 188 పరుగుల లక్ష్యాన్ని మరో 20 బంతులు ఉండగానే ఛేదించిన సూపర్‌జెయింట్స్ 7 వికెట్ల తేడాతో అదిరే విజయం సాధించింది. ఓపెనర్ మిచెల్ మార్ష్ (90, 38 బంతుల్లో 9 ఫోర్లు, 7 సిక్స్‌లు) విధ్వంసక ఇన్నింగ్స్‌తో కదం తొక్కాడు. జోశ్ ఇంగ్లిశ్ (36, 32 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్)తో కలిసి తొలి వికెట్‌కు 135 పరుగుల భారీ భాగస్వామ్యం నిర్మించిన మిచెల్ మార్ష్.. సూపర్‌జెయింట్స్ విజయాన్ని లాంఛనం చేశాడు. 21 బంతుల్లో అర్థ సెంచరీ సాధించిన మార్ష్.. సెంచరీకి పది పరుగుల దూరంలో వికెట్ కోల్పోయాడు. నాన్ స్ర్టయిక్ ఎండ్‌లో రనౌట్‌తో మార్ష్ మెరుపులకు తెరపడింది. ఇంగ్లిశ్ ఎదురుదాడి చేయటంలో వెనుకంజ వేసినా.. మార్ష్ దంచికొట్టాడు. పవర్‌ప్లేలో సూపర్‌జెయింట్స్‌ను 86/0తో బలమైన స్థితిలో నిలిపాడు. పేసర్లు, స్పినర్లపై అలవోకగా బౌండరీలు బాదాడు. పిచ్ పేస్, బౌన్స్‌కు అనుకూలించినా.. మార్ష్, ఇంగ్లిశ్ సూపర్‌కింగ్స్ పేసర్లు, స్పిన్నర్లను సమర్థవంతంగా ఎదుర్కొన్నారు. అబ్దుల్ సమద్ (7) నిరాశపరిచినా.. నికోలస్ పూరన్ (32 నాటౌట్, 17 బంతుల్లో 1 ఫోర్, 4 సిక్స్‌లు), ముకుల్ చౌదరి (13 నాటౌట్, 10 బంతుల్లో 2 ఫోర్లు) 16.4 ఓవర్లలోనే లాంఛనం ముగించారు. అన్షుల్ కాంబోజ్ వేసిన ఇన్నింగ్స్ 17వ ఓవర్లో నికోలస్ పూరన్ వరుసగా 4 సిక్సర్లతో చెలరేగాడు. ఆఖరు ఓవర్‌కు వరకూ వెళ్తుందనుకున్న మ్యాచ్‌ను ముందే ముగించాడు. మిచెల్ మార్ష్ సైతం అన్షుల్ కాంబోజ్ వేసిన ఓ ఓవర్లో నాలుగు సిక్సర్లు, ఓ ఫోర్‌తో ఏకంగా 28 పరుగులు పిండుకున్నాడు. ఈ సీజన్లో సూపర్‌జెయింట్స్‌కు ఇది నాల్గో విజయం కాగా, సూపర్‌కింగ్స్‌కు ఆరో ఓటమి.
రాణించిన కార్తీక్ శర్మ
టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు వచ్చిన సూపర్‌కింగ్స్ 20 ఓవర్లలో 5 వికెట్లకు 187 పరుగులు చేసింది. పిచ్ నుంచి పేసర్లకు మంచి బౌన్స్ లభించటంతో పరుగులు చేయటం కష్టమైంది. రుతురాజ్ గైక్వాడ్ (13), ఉర్విల్ పటేల్ (6), సంజు శాంసన్ (20) నిరాశపరిచారు. కార్తీక్ శర్మ (71, 42 బంతుల్లో 6 ఫోర్లు, 5 సిక్స్‌లు) బాధ్యతాయుత అర్థ సెంచరీతో రాణించాడు. డెవాల్డ్ బ్రెవిస్ (25, 16 బంతుల్లో 2 సిక్స్‌లు), శివం దూబె (32 నాటౌట్, 16 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) ఆకట్టుకున్నారు. ప్రశాంత్ వీర్ (13 నాటౌట్) ధనాధన్ ముగింపు అందించటంలో నిరాశపరిచాడు. సూపర్‌జెయింట్స్ పేసర్ ఆకాశ్ సింగ్ (3/26) మూడు వికెట్ల ప్రదర్శనతో సూపర్‌కింగ్స్‌ను కట్టడి చేశాడు.
సంక్షిప్త స్కోరు వివరాలు
చెన్నై సూపర్‌కింగ్స్ : 187/5 (కార్తీక్ శర్మ 71, శివం దూబె 32, బ్రెవిస్ 25, ఆకాశ్ సింగ్ 3/26, మహ్మద్ షమి 1/41)
లక్నో సూపర్‌జెయింట్స్ : 188/3 (మిచెల్ మార్ష్ 90, జోశ్ ఇంగ్లిశ్ 36, నికోలస్ పూరన్ 32, ముకేశ్ చౌదరి 1/24, స్పెన్సర్ జాన్సన్ 1/39)



