Saturday, May 16, 2026
E-PAPER
Homeజాతీయంజూన్‌ 21న నీట్‌ యూజీ రీ ఎగ్జామ్

జూన్‌ 21న నీట్‌ యూజీ రీ ఎగ్జామ్

- Advertisement -

వచ్చే ఏడాది నుంచి ఆన్‌లైన్‌లోనే : ధర్మేంద్ర ప్రధాన్‌
ప్రశ్నపత్రం లీక్‌తో రద్దయిన నీట్ పరీక్ష

న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా లక్షలాది మంది వైద్య విద్యార్థులు ఎదురుచూస్తున్న నీట్‌ యూజీ రీ-ఎగ్జామ్‌ తేదీని కేంద్రం ప్రకటించింది. జూన్ 21న నీట్‌ పరీక్షను మళ్లీ నిర్వహించనున్నట్లు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ) అధికారికంగా వెల్లడించింది. మే 3న జరిగిన పరీక్షా ప్రశ్నపత్రం లీక్‌ అవ్వడంతో ఆ పరీక్షను రద్దు చేసి మళ్లీ నిర్వహిస్తామని పేర్కొంది. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఆ కఠిన నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ఈ నేపథ్యంలో కొత్త తేదీలను ఎన్టీఏ వెల్లడించింది. పారదర్శకమైన రీతిలో జూన్ 21న పరీక్ష నిర్వహిస్తామని తెలిపింది. అడ్మిట్ కార్డులు, పరీక్షా కేంద్రాల వివరాలను త్వరలోనే అధికారిక వెబ్‌సైట్‌లో పెడతామని పేర్కొంది. పునఃపరీక్ష రాసే విద్యార్థులు ఎలాంటి అదనపు ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. రీఎగ్జామ్‌కు సంబంధించి అధికారిక మార్గాల్లో వచ్చే సమాచారాన్నే విశ్వసించాలని విద్యార్థులను ఎన్టీఏ కోరింది.

వచ్చే ఏడాది నుంచి ఆన్‌లైన్‌లో నీట్ పరీక్ష: 
కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్వచ్చే ఏడాది నుంచి ఆన్‌లైన్‌లో నీట్ పరీక్ష నిర్వహిస్తామని కేంద్రమంత్రి ధరేంద్ర ప్రధాన్ వెల్లడించారు. వచ్చే ఏడాది నీట్ పరీక్షను సీబీటీ విధానంలో నిర్వహిస్తామని, మళ్లీ మాల్‌ప్రాక్టీస్‌ జరగకుండా చూడటమే మా ధ్యేయమని చెప్పారు. జూన్ 21 నుంచి నీట్ రీ-ఎగ్జామ్ నిర్వహిస్తామన్న కేంద్రమంత్రి, జూన్ 14 నుంచి అడ్మిట్‌కార్డులు విడుదల చేస్తామని తెలిపారు. విద్యార్థులకు ఎలాంటి నష్టం కలగకుండా ఈ సారి చర్యలు తీసుకుంటున్నాం. విద్యార్థులు ఎవరూ నష్టపోకూడదనే పరీక్ష రద్దుచేసి మళ్లీ నిర్వహిస్తున్నాం. పరీక్ష పారదర్శకంగా నిర్వహించడమే మా ప్రధాన కర్తవ్యం.

విద్యార్థుల భవిష్యత్తు బాగుండాలనేది మా మొదటి ప్రాధాన్యం. పేపర్‌ లీక్‌ చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. నిబంధనలు ఉల్లంఘించిన వారిని ఉపేక్షించబోము. పేపర్‌ ఎలా లీక్‌ అయింది? ఎవరి నుంచి ఎక్కడికి వెళ్లిందనేది పూర్తి వివరాలు బహిర్గతమవుతాయి. సీబీఐ దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది. విద్యార్థులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. సామాజిక మాధ్యమాల్లో వచ్చిన వార్తలు చూసి భయపడొద్దు. అడ్మిట్‌కు సంబంధించి ఇంకా మెరుగుపడాల్సిన అవసరం ఉంది. పరీక్ష ఫీజు లేకుండా విద్యార్థులకు ప్రయోజనం కల్పిస్తున్నాం. ప్రశ్నపత్రం లీక్‌ చేసిన వారిని వదిలిపెట్టేది లేదు సీబీఐ అదే పనిలో ఉంది. మరోసారి ఇలాంటివి పునరావృతం కాకుండా గట్టి చర్యలు తీసుకుంటున్నాం. వ్యవస్థ బలోపేతానికి మరిన్ని చర్యలు తీసుకుంటాం.” అని కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వివరించారు.

రీఎగ్జామ్ కు ఫీజు చెల్లించాల్సిన అవసరంలేదు ..ఎన్డీఏ
దేశవ్యాప్తంగా ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకున్న 23 లక్షల మంది మళ్లీ పరీక్ష రాయాల్సిన పరిస్థితి ఏర్పడింది. కాగా రీఎగ్జామినేషన్‌కు మరోసారి దరఖాస్తు చేసుకోనక్కర్లేదని, ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదని ఎన్‌టీఏ క్లారిటీ ఇచ్చింది. ఇదిలాఉండగా నీట్‌ పేపర్‌ లీక్‌పై సీబీఐ ముమ్మర దర్యాప్తు కొనసాగుతోంది. ఇప్పటికే పలువురు కీలక నిందితులను అరెస్ట్‌ చేసి అధికారులు విచారిస్తున్నారు. రాజస్థాన్‌లోని సికార్‌లో ఈ లీకేజీ వ్యవహారం బయటపడింది. సుమారు 410 ప్రశ్నలతో ఒక గెస్‌ పేపర్‌ పరీక్షకు ముందే విద్యార్థులకు అందగా, అందులోని 120 కెమిస్ట్రీ ప్రశ్నలు పరీక్షలో వచ్చాయనే ఆరోపణలు వచ్చాయి. ప్రశ్నల క్రమంతో పాటు ఆప్షన్లు కూడా ఒకే వరుసలో ఉండటంతో లీక్‌ జరిగినట్లు అధికారులు ప్రాథమికంగా నిర్ధరించారు. మహారాష్ట్రలోని నాసిక్ నుంచి కూడా ప్రశ్నపత్నం లీక్ అయి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. అక్కడి నుంచి రాజస్థాన్‌, హరియాణా, జమ్మూకశ్మీర్‌, కేరళ సహా పలు రాష్ట్రాలకు చేరినట్లు దర్యాప్తులో బయటపడింది. ఈ పేపర్‌ కోసం విద్యార్థుల నుంచి రూ.5 లక్షల వరకు వసూలు చేసినట్లు తెలుస్తోంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -