– సాంకేతిక వైఫల్యాలు-నిర్వహణా లోపం !
– రైతన్నను వెంటాడుతున్న వైనం
– ప్రాణాల మీదకు తెస్తున్న ‘లూజ్ వైర్లు’
– విద్యుత్ ప్రమాదాలతో ఉమ్మడి వరంగల్ జిల్లాలో రూ.కోట్లల్లో నష్టం
నవతెలంగాణ-వరంగల్ డెస్క్
కాలం కలిసి రాక ఒకవైపు, ప్రకృతి వైపరీత్యాలు మరోవైపు రైతన్నను వెంటాడుతుంటే.. ఉమ్మడి వరంగల్ జిల్లాలో విద్యుత్ శాఖ పర్యవేక్షణ లోపం అన్నదాతకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. 2026 జనవరి నుంచి మే వరకు నమోదైన గణాంకాలు చూస్తుంటే, విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌లు కేవలం ప్రమాదాలుగా కాకుం డా, అవి రైతుల ఆశలను బూడి ద చేస్తున్న విషాదాలుగా మారుతు న్నాయి. ఈ ఏడాది ఎండల తీవ్రత 45 డిగ్రీలకు చేరుకోవ డంతో పాటు గాలివానలు తోడవ్వడం వల్ల ఉమ్మడి జిల్లాలో ని వరి, మొక్కజొన్న, మిర్చి పంటలు అగ్నికి ఆహుతవుతున్నాయి. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఈ వేసవిలో ఇప్పటి వరకు జరిగిన విద్యుత్ ప్రమాదాల వల్ల కోట్ల రూపాయల్లో నష్టం వాటిల్లినట్టు సమాచారం.
వరంగల్, హనుమకొండ జిల్లావ్యాప్తంగా దుగ్గొండిలో 11 కేవీలైన్ల వల్ల 5ఎకరాల వరి, దామెరలో 3ఎకరాల పంట పొలాలు కాలిపోయాయి. హసన్‌పర్తి, ఎల్కతుర్తి ప్రాంతాల్లో తక్కువ ఎత్తులో వేలాడుతున్న వైర్లు మృత్యుపాశాలుగా మారాయి. భూపాలపల్లి, జనగామ జిల్లా వ్యాప్తంగా మొగుళ్ళపల్లిలో ఏకంగా 17 ఎకరాల మొక్కజొన్న పంట దగ్ధమై రైతులు రోడ్డున పడ్డారు. జనగామ, లింగాల ఘనపురం ప్రాంతాల్లో ఎండుగడ్డి వాములు తగలబడి పశుగ్రాసం కరువైంది. ములుగు, మహబూబా బాద్ జిల్లా వ్యాప్తంగా గోవింద రావుపేటలో ఖరీదైన ఆయిల్ పామ్ తోటలు, కేసముద్రం మార్కెట్ యార్డులో నిల్వ ఉంచిన మిర్చి బస్తాలు కాలిపోవడం రైతాంగాన్ని కోలుకోలేని దెబ్బ తీశాయి. విద్యుత్ శాఖలోని అంతర్గత లోపాలు ఈ సమస్యను మరింత జటిలం చేస్తున్నా యనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దశాబ్దాల క్రితం వేసిన విద్యుత్ స్తంభాలు తుప్పుపట్టి వంగిపోవడం, పాతబడిన ఇన్సులేటర్ల వల్ల నిప్పురవ్వలు ఎగసిపడు తున్నాయి. ఎండల వల్ల విని యోగం పెరగడంతో ట్రాన్స్ ఫార్మర్లు లోడ్ తట్టుకోలేక పేలి పోతున్నాయి. మరిపెడలో 30కిపైగా మోటార్లు కాలిపోవడం దీనికి నిదర్శనం. పొలాల్లో వైర్లు వదులుగా ఉండటం వల్ల ట్రాక్టర్లతో దున్నే టప్పుడు, క్రాప్ హార్వెస్టర్లతో కోతలు కోసేటప్పుడు రైతులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పనులు చేస్తున్నారు. నర్సంపేట, బయ్యారం, బచ్చన్నపేట ప్రాం తాల్లో విద్యుత్ ఘాతానికి పాడి పశువులు మృత్యువాత పడ టం ఆయా కుటుంబాలకు తీరని నష్టం. మరోవైపు ప్రమా దం జరిగినప్పుడు అధికారులు వస్తున్నారు, పంచనామాలు చేస్తున్నారు. కానీ, క్షేత్రస్థాయిలో రైతుకు అందాల్సిన ఎక్స్ గ్రేషియా మాత్రం కంటికి కనిపించడం లేదని బాధితులు ఆరోపిస్తున్నారు. రెవెన్యూ, విద్యుత్ శాఖల మధ్య సమన్వయ లోపం వల్ల ఫైళ్లు ముందుకు కదలడం లేదని హనుమ కొండ, జనగామ జిల్లాల్లో రైతులు నిరసన బాట పట్టారు. ప్రస్తుత పరిస్థితిని చక్కదిద్దేందుకు జిల్లా యంత్రాంగం కొన్ని కీలక చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందని రైతు సంఘా లతోపాటు బాధిత రైతులు కోరుతున్నారు. వేసవి ముందే లూజ్ వైర్లను గుర్తించి బిగించాలని, ట్రాన్స్‌ఫార్మర్ల వద్ద నాణ్యమైన కట్-అవుట్లు, స్విచ్ గేర్లు ఏర్పాటు చేయాలని, పంట నష్టపోయిన రైతులకు కనీసం 15 రోజుల్లోపు పరిహారం అందేలా చూడాలని వేడుకుంటున్నారు. అలాగే, విద్యుత్ తీగల కింద గడ్డి వాములు వేయకుండా రైతులకు అవగాహన కల్పించాలని కోరుతున్నారు.
కొన్ని ఘటనలు..
హహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం తాళ్ల పూసపల్లి, కల్వలలో విద్యుత్ తీగలు తెగిపడి, కోసి కుప్ప పోసిన 15 ఎకరాల మొక్కజొన్న పంట అగ్నికి ఆహుతైంది. లక్షలాది రూపాయల పెట్టుబడి కళ్లముందే బూడిదవ్వడంతో రైతులు కన్నీరుమున్నీరయ్యారు. ములుగు జిల్లా ఏటూరు నాగారం మండలం షాపేల్లిలో పంట పొలాల్లో విద్యుత్ తీగలు తెగిపడి రెండు పాడి గేదెలు, నర్సింహులపేటలో వేలాడుతున్న 11 కేవీ వైర్లు తగిలి ఒక ఎద్దు అక్కడికక్కడే మృత్యువాతపడ్డాయి. గోవిందరావుపేట మండలం పస్రాలో షార్ట్ సర్క్యూట్ కారణంగా రెండు ఇండ్లు పూర్తిగా దగ్ధమయ్యాయి. నిరుపేద కుటుంబాలు కట్టుబట్టలతో రోడ్డున పడ్డాయి. హనుమకొండ జిల్లా నడికూడ మండలం చర్లపల్లిలో ట్రాన్స్‌ఫార్మర్ మరమ్మతు విషయంలో ఇద్దరు లైన్ మెన్ల మధ్య ‘పరిధి’ వివాదం తలెత్తింది. ఫలితంగా పది రోజులుగా కరెంటు లేక పంటలు ఎండిపోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేసిన ఘటన కూడా ఉంది.
ఒక్క బయ్యారం మండలంలోనే రూ.లక్షల్లో నష్టం
బయ్యారం మండలంలో గాలి దుమారానికి విద్యుత్ తీగలు తెగిపడటంతో మండలంలోని కోయగూడెం, కస్తూరి నగరం గ్రామాల్లో మొక్కజొన్న పంట దగ్ధమైంది. ఏప్రిల్ 24న కోయగూడెం గ్రామంలో 4ఎకరాల మొక్కజొన్న పంట విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తో దగ్ధమవడంతో సుమారు రూ.3లక్షల నష్టం వాటిల్లింది. ఏప్రిల్ 19న కస్తూరి నగరం గ్రామంలో విద్యుత్ తీగలు తెగిపడి షార్ట్ సర్క్యూట్‌తో మూడు ఎకరాల మొక్కజొన్న పంట దగ్దమై సుమారు రూ.2లక్షల నష్టం వాటిల్లింది.
రాత్రీపగలూ కరెంటు కోతలు
ములుగు మున్సిపాలిటీ కేంద్రంలో పగలనకా రాత్రనకా విద్యుత్ కోతలు విధిస్తున్నారు. ప్రస్తుతం లైన్ల మరమ్మతుల తో అప్రకటిత కరెంటు కోతలతో ఇబ్బందులు పడుతున్నాం. అసలే ఎండాకాలం. ఎండలు భగభగమంటున్నాయి. ములుగు మున్సిపాలిటీ కేంద్రంలో ఈ విధంగా ఉంటే పల్లెల్లో పరిస్థితి మరీ దారుణంగా ఉంది. విద్యుత్ శాఖ అధికారులు ముందస్తుగా ప్రణాళిక చేసుకొని రానున్న వానకాలంను దృష్టిలో పెట్టుకుని విద్యుత్ సమస్యలు తలెత్తకుండా చూడాలి.
– కుమార్ పాడ్య, సామాజిక విశ్లేషకులు
అంతరాయంలేని విద్యుత్ సరఫరా యే లక్ష్యం
తెలంగాణ నార్తర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ పరిధి లోని ములుగు సర్కిల్‌లో విద్యుత్ వ్యవస్థను బలోపేతం చేస్తున్నాం. గ్రామాల్లో ఎక్కడైనా సాంకేతిక లోపం తలెత్తితే, ఆ ప్రాంతం వరకు మాత్రమే సరఫరా నిలిపివేసి, మిగతా చోట్ల నిరంతరాయంగా విద్యుత్ ఇచ్చేలా ఏబీ స్విచ్‌లను ఏర్పాటు చేశాం. ఇప్పటికే సర్కిల్ వ్యాప్తంగా వందలాది స్విచ్‌ల ఏర్పాటు పూర్తయింది. భారీ వర్షాలు, ఈదురు గాలుల వల్ల చిన్నపాటి అంతరాయాలు కలుగుతున్నాయి. క్షేత్రస్థాయిలో సమస్యల గుర్తింపునకు ఈ ఆధునిక సాంకేతికత ఎంతగానో తోడ్పడుతుంది. వినియోగదారులకు ఏవైనా ఇబ్బందులు ఉంటే తక్షణమే 1912 టోల్ ఫ్రీ నంబర్‌కు ఫిర్యాదు చేయవచ్చు.
బి. బిక్షపతి, సూపరింటెండింగ్ ఇంజినీర్, ములుగు సర్కిల్



