Tuesday, May 19, 2026
E-PAPER
Homeప్రధాన వార్తలుఏది సర్..ఏది జనగణన?

ఏది సర్..ఏది జనగణన?

- Advertisement -

వివరాల సేకరణలో గందరగోళం పాక్షిక వివరాలే చెప్తున్న జనం ఎన్యూమరేటర్లకు ఇబ్బందులు
క్షేత్రస్థాయిలో మ్యాపింగ్ లోపాలు..కొరవడిన ప్రజల సహకారం

కేంద్ర ప్రభుత్వం చేపట్టిన జనగణన రాష్ట్రంలో మొదలైంది. ఈ ప్రక్రియ కొనసాగుతుండగానే ఓటర్ల జాబితా సవరణలకు సంబంధించిన ‘స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్’ (సర్) ఏర్పాట్లు కూడా జరగుతుండటంతో ప్రజల్లో గందరగోళం నెలకొంటోంది. ఎన్యూమరేటర్లకు ప్రజల నుంచి ఆశించిన మద్దతు లభించట్లేదు. జనగణన, సర్ రెండూ వేర్వేరు అనీ, ఆ రెండింటిని విడివిడిగా నిర్వహిస్తున్నామని ప్రజల్లో అవగాహన కల్పించడంలో కేంద్ర ప్రభుత్వం, కేంద్ర ఎన్నికల సంఘం విఫలమైనట్టు తెలుస్తోంది. ఈ గందరగోళం క్షేత్రస్థాయిలో స్పష్టంగా కనిపిస్తున్నదని ఎన్యూమరేటర్లు మొత్తుకుంటున్నారు.

మ్యాచ్ కాని మ్యాపింగ్
కేవలం ప్రభుత్వ ఉద్యోగులనే ఏకైక కారణంతో జనగణనలో స్కావెంజర్లు, అటెండర్లు, స్వీపర్లకు కూడా ఇంటింటి సర్వే డ్యూటీలు వేశారు. వీరికి మ్యాపింగ్ ఎలా చేయాలో అర్థంకాక నానా అవస్థలు పడుతున్నారు. ఇదే విషయంపై ఇటీవలే మాజీ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ జనగణన ఉన్నతాధికారులకు వినతిపత్రం కూడా సమర్పించారు. జనగణన సక్రమంగా జరగట్లేదని ఆయన ఆ లేఖలో పేర్కొన్నారు.

పంచాయతీల్లోనూ పరేషానే
కొత్త గ్రామ పంచాయతీలు, ఇటీవల ఏర్పడిన మున్సిపల్ వార్డుల్లో మారిన హౌస్ నంబర్లు అధికారిక రికార్డుల్లో పూర్తిగా అప్‌డేట్ కాకపోవడంతో ఎన్యూమరేటర్లు ఇబ్బందులు పడుతున్నారు. కొన్ని గ్రామాల్లో పాత మ్యాపులు, కొత్త నిర్మాణాల మధ్య వ్యత్యాసం ఉండటంతో ఇళ్ల లెక్కింపులో పొరపాట్లు చోటుచేసుకుంటున్నాయని అధికారులు అంగీకరిస్తున్నారు.

నగరాల్లో…
నగరాల్లో అనధికార నిర్మాణాలు, బస్తీల విస్తరణ, రహదారి మార్పులు వంటి అంశాలు డిజిటల్ మ్యాపింగ్‌ను మరింత క్లిష్టం చేస్తున్నాయి. జనగణనలో ఆయా కుటుంబ సభ్యుల వివరాలు, విద్య, ఉపాధి, వలసలు, గృహ వసతులు వంటి వివరాలను సేకరించాల్సి ఉంటుంది. అయితే పట్టణ ప్రాంతాల్లో ఒకే చిరునామాలో బహుళ కుటుంబాలు నివసిస్తుండటం, అపార్ట్‌మెంట్లలో ఫ్లాట్ నంబర్లు స్పష్టంగా లేకపోవడం, అద్దెదారులు తరచూ మారిపోవడం వంటి అంశాలు సర్వేను క్లిష్టతరం చేస్తున్నాయి.

వివరాలు చెప్పేందుకు అనాసక్తి
కొన్ని ప్రాంతాల్లో ప్రజలు తమ వివరాలు ఇవ్వడానికి నిరాకరిస్తుండటం ఎన్యుమరేటర్లకు తలనొప్పిగా మారింది. ప్రధానంగా వ్యక్తిగత సమాచారం దుర్వినియోగం అవుతుందనే అనుమానంతో అనేకమంది ఆధార్, ఫోన్ నంబర్, ఉద్యోగ వివరాలు వంటివి చెప్పేందుకు తిరస్కరిస్తున్నారు. దీనితో సర్వేకు అదనపు సమయం పడుతున్నదని ఎన్యూమరేటర్లు వాపోతున్నారు.

మా డ్యూటీలు ఎలా చేయాలి?
జనగణన, సర్ విధుల్లో పాల్లోంటున్న ఉపాధ్యాయులు, రెవెన్యూ సిబ్బంది, గ్రామ స్థాయి ఉద్యోగులు తమకు ఇప్పటికే ఇతర ప్రభుత్వ పనులు ఉన్నాయనీ, వాటికి అదనంగా ఈ పనులు కూడా చేయాల్సి రావడం కష్టంగా ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎండలు దంచికొడుతున్న సమయంలో రోజంతా ఫీల్డ్‌లో తిరగాల్సి రావడం, ప్రయాణాలు ఆలస్యం కావడం, అధికారుల నుంచి లక్ష్యాల ఒత్తిడి పెరగడం వంటి సమస్యలపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కొన్ని జిల్లాల్లో తగినంత మంది సిబ్బంది లేక ఒక్కో ఎన్యూమరేటర్‌కు అధిక సంఖ్యలో కుటుంబాల బాధ్యతలు అప్పగించినట్టు సమాచారం. దీంతో గడువులోగా పనులు పూర్తి చేయడం కష్టసాధ్యమవుతోందని అధికారులు చెప్తున్నారు.

సవాలుగా వలస కార్మికుల లెక్కింపు
హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ వంటి జిల్లాల్లో వలస కార్మికుల లెక్కింపు ఎన్యూమరేటర్లకు పెద్ద సవాలుగా మారింది. నిర్మాణ రంగం, పరిశ్రమలు, హాస్టళ్లు, అద్దె గదుల్లో నివసిస్తున్న కార్మికులు తరచూ ప్రాంతాలు మారుతుండటంతో కచ్చితమైన గణాంకాలు సేకరించడం కష్టమవుతోంది. దానికితోడు అనేకమంది కార్మికులకు స్థానిక భాష తెలియక పోవడంతో సమాచారాన్ని సరిగ్గా అందించలేకపోతున్నారని ఎన్యూమరేటర్లు చెప్తున్నారు. మరికొందరు ప్రభుత్వ రికార్డుల్లో పేర్లు నమోదవుతాయనే భయంతో వివరాలు చెప్పేందుకు వెనుకంజ వేస్తున్నారు. రెండింటికీ ఒకే ఉద్యోగులు
జనగణన పూర్తికాగానే ‘సర్’ ప్రారంభం కావడం, రెండింటికీ ఆయా శాఖల ఉద్యోగులే ఎన్యూమరేటర్లుగా ఉండటం గమనార్హం. ‘సర్’లో కూడా పాత ఓటరు జాబితాలు, కుటుంబ లింకులు, చిరునామాలు, మరణించిన ఓటర్లు, వలస వెళ్లిన వారి వివరాలు పరిశీలిస్తారు. ఇక్కడ కూడా ఎన్యుమరేటర్లు మరోసారి ఫీల్డ్ సర్వేలు, ఇంటింటికీ వెళ్లి వివరాలు నమోదు చేయడం, వాటిని డిజిటలైజ్ చేయడం వంటి పనులు చేయాల్సి ఉంటుంది. జనగణనలో ఇంటికి వెళ్తున్న ఎన్యూమరేటర్లను ఇది ఏ సర్వే… అని ప్రజలు అయోమయంగా అడుతున్నారని చెప్తున్నారు. జనగణన సిబ్బందిని ఓటరు సర్వే అధికారులుగా భావిస్తున్నారు. ఈ రెండు ప్రక్రియల్లోనూ కుటుంబ సభ్యుల వివరాలు, చిరునామాలు, మొబైల్ నంబర్లు, గుర్తింపు ఆధారాలు అడుగుతుండటంతో ప్రజల్లో అనుమానాలు పెరుగుతున్నాయి.

తలకు మించిన భారం
‘సర్’కు సంబంధించిన శిక్షణా తరగతులు కూడా ఏకకాలంలో జరుగుతుండటం ప్రభుత్వ ఉద్యోగులకు కష్టంగా మారింది. అదే సమయంలో వారికి ఆయా శాఖల్లో కేటాయించిన పనులు పెండింగ్‌లో పడిపోతున్నాయి. దాదాపు ముడు నెలలు అధికారులు, సిబ్బంది తమ కార్యాలయాలకు దూరంగా పనిచేయాల్సి వస్తుంది. పలు సమస్యలపై ఆయా కార్యాలయాలకు వస్తున్న ప్రజలు రేపు, మాపు అంటూ తిరగాల్సి వస్తుండటంతో ప్రభుత్వంపై విశ్వాసాన్ని కోల్పోతున్నారు.

ఇదీ జనగణన షెడ్యూల్
కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న డిజిటల్ జనగణనలో భాగంగా తెలంగాణలో ‘సెల్ఫ్ ఎన్యూమరేషన్’ ప్రక్రియను ఏప్రిల్ 26 నుంచి మే 10 వరకు నిర్వహించారు. మే 11 నుంచి జూన్ 9 వరకు ఫీల్డ్ ఎన్యూమరేటర్లు ఇంటింటికీ వెళ్లి జనగణన ధ్రువీకరణ చేపడతారు. దానిలో భాగంగా తొలివిడతలో కీలకమైన భౌగోళిక మ్యాపింగ్ ప్రక్రియను చేపట్టారు. రెవెన్యూ, మున్సిపల్ ఉద్యోగులు, ఉపాధ్యాయులు దీనికోసం క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నారు.

‘సర్’తో సరికొత్త చిక్కులు
జనగణన జరుగుతున్న సమయంలోనే ‘సర్’ ప్రకటనలు కూడా వస్తుండటంతో ప్రజల్లో గందరగోళం, భయం ఏర్పడుతున్నాయి. ఏది జనగణనో, ఏది ‘సర్’ తెలీక అనేకచోట్ల పొంతనలేని సమాధానాలు చెప్తున్నారు. రాష్ట్రంలో ఓటరు జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) ప్రక్రియ జూన్ 25 నుంచి ప్రారంభం కానుంది. జులై 24 వరకు బూత్ లెవల్ అధికారులు (బీఎల్ఓ) ఇంటింటికీ వెళ్లి వివరాలు సేకరిస్తారు. జులై 31న డ్రాఫ్ట్ ఓటరు జాబితా విడుదల చేసి, ఆగస్టు 30 వరకు అభ్యంతరాలు స్వీకరిస్తామనీ, తుది జాబితాను అక్టోబర్ 1న విడుదల చేస్తామని ఎన్నికల సంఘం ఉన్నతాధికారులు ప్రకటించారు.

డిజిటల్ యాప్ తలనొప్పి
జనగణన ప్రక్రియ మొత్తాన్ని డిజిటల్ యాప్‌లోనే అప్‌లోడ్ చేయాలని చెప్పండంతో స్మార్ట్‌ఫోన్ల వినియోగంలో అనుభవం లేని ఎన్యూమరేటర్లు అవస్థలు పడుతున్నారు. మ్యాపింగ్‌ను కూడా డిజిటల్ యాప్‌లోనే అప్‌లోడ్ చేయాల్సి రావడంతో ఆ ప్రక్రియ మరింత ఆలస్యం అవుతుంది. పలుచోట్ల ఇంటర్నెట్ కనెక్టివిటీ సరిగా లేకపోవడం, యాప్‌లు స్లోగా పనిచేయడం, డేటా సేవ్ కాకపోవడం వంటి ఫిర్యాదులు వస్తున్నాయి. ఈ సమస్యలు గ్రామీణ ప్రాంతాల్లో మరీ తీవ్రంగా ఉన్నాయి. సాంకేతిక పరిజ్ఞానంపై సరైన శిక్షణ లేక ఇబ్బందులు పడుతున్నారు. యాప్‌లో ఒకసారి నమోదు చేసిన వివరాలు మళ్లీ కనిపించకపోవడం, జీపీఎస్ వెరిఫికేషన్ సరిగా క్యాప్చర్ కాకపోవడంతో ఒకే ప్రాంతంలో మళ్లీ మళ్లీ తిరగాల్సి వస్తున్నదని ఎన్యూమరేటర్లు వాపోతున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -